‘తమ్మిడిహెట్టి’పై ఉమ్మడి పోరు | Joint war on "Tammidihetti ' | Sakshi
Sakshi News home page

‘తమ్మిడిహెట్టి’పై ఉమ్మడి పోరు

Published Sun, Mar 27 2016 4:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

‘తమ్మిడిహెట్టి’పై ఉమ్మడి పోరు - Sakshi

‘తమ్మిడిహెట్టి’పై ఉమ్మడి పోరు

సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉమ్మడిగా ఉద్యమించాలని విపక్ష పార్టీలన్నీ నిర్ణయించాయి. దీంతోపాటు మేడిగడ్డ వద్ద కొత్త బ్యారేజీల నిర్మాణం, అందుకనుగుణంగా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడం వెనుక ప్రభుత్వ దురుద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న నిర్ణయానికి వచ్చాయి. తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులోనే నిర్మించాలన్న అంశంపై శనివారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది.

తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షత వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రేమేందర్‌రెడ్డి, తెలంగాణ బచావో మిషన్ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ చెరుకు సుధాకర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘వ్యాప్కోస్ నివేదికల వెనుక ఉన్న మతలబేమిటో, ప్రాజెక్టులపై వేసిన కమిటీ నివేదికలను బయటపెట్టకుండా దాచడమెందుకో స్పష్టం చేసేదాకా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలపైనే ఉంది. కాబట్టి ఈ విషయంలో అంతా కలిసి ఉమ్మడిగా పోరాటం చేయాలి’’ అని నేతలంతానిర్ణయించారు. వారేమన్నారంటే...

 ఎందుకీ మొండితనం: ఉత్తమ్
 ప్రాణహిత డిజైన్ మార్పు స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.83 వేల కోట్లకు పెంచి అక్రమాలకు తెర తీశారు. పైగా పెంచిన అంచనాలను పాత కాంట్రాక్టర్లకే అప్పగించాలని చూస్తున్నారు. ఒక్క ఎకరా ఆయకట్టు కూడా పెరగకుండా ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగిందో ప్రభుత్వం చెప్పాలి. ఈ ప్రాజెక్టుపై వేసిన ప్రభుత్వ కమిటీ సైతం పాత డిజైన్‌నే కొనసాగించాలని సూచించినా ఎందుకు మొండిగా వెళ్తోందో చెప్పాలి. నీటి లభ్యత, ఎత్తు మార్పుతో జరిగే పరిణామాలపై సాంకేతిక పరిశీలన జరగాలి.

 ఎత్తు తగ్గిస్తే నష్టమే: ఎల్.రమణ
 అన్ని పక్షాలతో చర్చించి బంగారు తెలంగాణకు బాటలు వేస్తానంటున్న సీఎం కేసీఆర్, ఆచరణలో మాత్రం తన ఆలోచనల మేరకే వెళ్తూ అన్నింటినీ వివాదాస్పదం చేస్తున్నారు. తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులో చేపడితేనే రాష్ట్రానికి మేలు. ఏ మాత్రం తగ్గించినా నష్టమే. ఈ విషయంలో అన్ని పక్షాలతో కలిసి పోరాడటంలో మేం ముందుంటాం.

 కాసులు కొట్టేసే యత్నం: తమ్మినేని
 తమ్మిడిహెట్టి నుంచి దిగువ వరకు కాల్వల తవ్వకం పూర్తయింది. కొత్తగా కాల్వల్లేకుండా ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించదలచుకోలేదు. కాకపోతే కాల్వల పేరుతో కొత్తగా కాసులు కొల్లగొట్టజూస్తున్నారు.

 గొంతు పిసికారు: చాడ
 తమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి ప్రాణహిత గొంతు పిసికారు. చేవెళ్లను తొలగించి రంగారెడ్డిని నట్టేట ముంచారు. ఎవరితోనూ చర్చించకుండా పూర్తి ఏకపక్షంగా చేస్తున్న ఈ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో పారదర్శకత లేదు. దీనిపై ప్రజా క్షేత్రంలో కొట్లాడాలి.

 ఎత్తుకు సహకారం: ప్రేమేందర్‌రెడ్డి
 తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులో చేపట్టేందుకు బీజేపీ సహకారముంటుంది. దీనిపై మహారాష్ట్రతో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు మేం ముందుంటాం. అయితే ముంపుపై ఒప్పించేందుకు ప్రభుత్వం సైతం చొరవ చూపాలి.

 కలిసి రావాలి: జస్టిస్ చంద్రకుమార్
 ప్రాణహిత డిజైన్ మార్పులో తొలి అడుగే అవినీతితో మొదలైంది. ఒకమారు నీటి లభ్యత పుష్కలంగా ఉందని చె ప్పిన వ్యాప్కోస్, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త లెక్కలు చెబుతోంది. గ్రావిటీని వద్దని, ఎత్తిపోతలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఈ చర్యలపై ఉమ్మడిగా ప్రజా పోరాటం చేయాలి. దీనికి అన్ని పక్షాలూ ముందుకు రావాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement