- దిగ్విజయ్‌తో బలరామ్, కవిత భేటీ
- ఏఐసీసీ నేతల చుట్టూ ప్రదక్షిణలు
- ఢిల్లీలో జిల్లా కాంగ్రెస్ నేతల మకాం
వరంగల్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ సిట్టింగ్‌లతో సహా ఆశావహుల్లో టికెట్ టెన్షన్ పెరుగుతోంది. నిన్నటి వరకు తమకు టికెట్ గ్యారంటీ అని భావించిన నేతల్లో సైతం అంతర్గతంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మారిన సమీకరణల నేపథ్యంలో భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన సిట్టింగ్‌లు, ఆశావహులంతా ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, కుంతియాలను కలుసుకొని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. శుక్రవారం తొలి జాబితా వస్తుందని భావించిన నేపథ్యంలో వాయిదా పడడంతో మరింత ఆందోళనకు లోనవుతున్నారు.
పొత్తు ప్రచారంతో ఆందోళన
టీఆర్‌ఎస్‌తో పొత్తులేదని ఇరుపార్టీల నేతలు ప్రకటిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయిలో పొత్తుంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా తొలి జాబితా విడుదల జాప్యమైనట్లు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుంటే తమ స్థానం గల్లంతేనని భావించేవారు, సీపీఐతో పొత్తుంటే తమ పరిస్థితేమిటని ఆందోళన చెందేవారు, కొత్తగా టికెట్ కోరుకునే నేతలంతా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు ఇప్పటికే నేతలను కలిసి వచ్చారు.
పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి
ఢిల్లీలో కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోతు కవితలు కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి ఈ ఎన్నికల్లో తమకే టికెట్ కేటాయించాలని విన్నవించారు. అయితే బలరాంనాయక్, కవితల పని తీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందనే ప్రచారం ఊ పందుకున్నది. ఈ దఫా సిట్టింగ్‌లైనప్పటికీ టికెట్ దక్కుతుందో?లేదో?ననే చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల్లో వర్గపోరుతో ఈ సమ స్య మరింత పెరిగింది.
ఒక కుటుంబం నుంచి ఒకరి కే టికెట్ అని ప్రచారం కావడంతో ఎమ్మెల్యే కవితలో ఆందోళన నెలకొంది. తాజాగా శుక్రవారం మహబూబాబాద్‌కు వచ్చిన సీపీఐ నేత నారాయణ సైతం ఎంపీ, ఎమ్మెల్యేలు దద్దమ్మలంటూ వారికి ప్రజాదరణ లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. సీపీఐతో పొత్తుంటే ఈ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే మంత్రి, ఎమ్మెల్యే ఢిల్లీకి వెళ్లినట్లు భావిస్తున్నారు.
ఆశావహులంతా అక్కడే..
టికెట్ ఆశిస్తున్న ఆశావహులు, టికెట్ వస్తుందోరాదోననే భయం ఉన్న నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి తమకు మరోసారి పోటీకి అవకాశం కల్పించాలని కోరారు.
వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, తాజాగా పాలకుర్తి నుంచి తమకు అవకాశం కల్పించాలని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనాయణ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆశావహులు డాక్టర్ విజయరామారావు, రాజారపు ప్రతాప్, భువనగిరి ఆరోగ్యం, పరకాల టికెట్ ఆశిస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.