నేటితో ముగియనున్న కేయూ వీసీ పదవీకాలం
కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం పదవీకాలం శనివారంతో ముగియనుంది. వెంకటరత్నం వీసీగా బాధ్యతలను చేపట్టి ఈనెల 17తో మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. అయితే మరో రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు ఇంకా ప్రొఫెసర్ వెంకటరత్నానికి సర్వీస్ ఉంది.
కాకతీయ యూనివర్సిటీలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన చివరి కేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెంకటరత్నం స్థానంలో మరో నూతన వీసీని నియమించే వరకు ప్రభుత్వం ఉన్నత విద్యలోని ఐఏఎస్ ఆఫీసర్‌కు లేదా ఇతర యూనివర్సిటీలోని వీసీకి ఇన్‌చార్జ్‌గా నియమించే అవకాశాలున్నాయి.
పలు అభివృద్ధి పనులు
కాకతీయ యూనివర్సిటీ వీసీ వెంకటరత్నం మూడేళ్ల కాలంలో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. అంతేగాకుండా ఎమ్మెస్సీ సైకాలజీ, జర్నలిజం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరింగ్ కళాశాల, ఎంబీఏ కోర్సులను ఏర్పాటు చేశారు. అలాగే కాకతీయ యూనివర్సిటీలో మహిళా ఇంజినీరింగ్ కళాశాలను, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లిలో పీజీ సెంటర్లను, ఖమ్మంలో బీపీఈడీ కోర్సును ప్రారంభించారు. యూజీసీ, డీఎస్‌టీల నుంచి కూడా నిధులు రాబట్టారు.
యూనివర్సిటీలో స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్, సెంట్రల్ జోన్ కబడ్డీ, క్రికెట్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. నాన్ టీచింగ్ ఉద్యోగులకు పదోన్నతలు కల్పించారు. సుమారు 60 మంది వరకు పార్ట్ టైం లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా నియామకం చేశారు.
ఇటీవల కేయూ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమం లో కాకతీయ యూనివర్సిటీ ఎంప్లాయీస్ జాక్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సేనెట్ హాల్‌లో వీసీ వెంకటరత్నంను ఘనంగా సన్మాని స్తామని జాక్ చైర్మన్ కొండల్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ కోల శంకర్ తెలిపారు.