ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
హుజూరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారానికి గొంతెత్తుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విఘాతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సకల జనులను ఐక్యం చేసి, రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన స్ఫూర్తి యాత్రను పోలీసులు అడ్డుకుని, ఆయన్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
టీజేఏసీ సభపై దాడికి పాల్పడిన టీఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెట్టి, కోదండరాంకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారిపై కేసులు నమోదు చేస్తూ, దాడులకు పాల్పడటం, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారు మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారని, ఇందుకేనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నది అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ప్రతిపక్షాలు అడుగుతున్నాయని, ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం చేస్తున్న గోబెల్స్ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అభివృద్ధిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.