
చోరీకి వెళ్లి.. ఇరుక్కుపోయాడు
తెలిసిన ఇల్లు.. పైగా అందులో ఎవరూ లేరు.. ఇంకేముంది పక్కా ప్లాన్‌తో ఇంట్లోకి దూరి మూటా ముల్లె సర్దేసి ఇల్లు గుల్ల చేయాలనుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. చోరీకి వెళ్లే యత్నంలో పొగ గొట్టంలో ఇరుక్కుపోయాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా సిద్దిపేట అంబేద్కర్‌నగర్‌లో ఇందిరమ్మకు ఇల్లు ఉంది. ఆమె ఇంట్లో లేదని గ్రహించిన అదే ప్రాంతానికి చెందిన ఎర్రోళ్ల భార్గవ్ (24).. ఆ ఇంట్లో చోరీకి ప్లాన్ వేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఆ ఇంటిపై ఉన్న పొగగొట్టం ద్వారా ఇంట్లోకి దిగబోయాడు. ఈ క్రమంలో గొట్టంలోని కాంక్రీట్ ఊచల మధ్య చిక్కుకుపోయాడు.
అటు పైకీ రాలేక.. ఇటు కిందికీ దిగలేక ఐదు గంటల పాటు అలాగే ఇరుక్కుపోయాడు. సోమవారం ఉదయం కాలనీలోని చుట్టుపక్కల వారు గమనించి టూటౌన్ పోలీసులకు ఉప్పందించారు. ఎస్‌ఐ వరప్రసాద్ సిబ్బందితో అక్కడికి వచ్చి పొగ గొట్టం పగులగొట్టి దొంగను బయటకు తీశారు. వైద్యం అందించిన అనంతరం భార్గవ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
- సిద్దిపేట రూరల్