సాక్షి, హైదరాబాద్: గుంతల మయమైన రోడ్లు.. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్.. మెట్రోరైలు నిర్మాణ పనులు.. ఇరుకు రోడ్లు... ఇన్ని ఇబ్బందుల మధ్య బస్సు నడపటం డ్రైవర్లకు కత్తిమీద సామే. చీటికి మాటికి గేర్లు మార్చాల్సి రావటం, క్లచ్ వినియోగం పెద్ద చికాకు వ్యవహారం. ఆర్టీసీ డ్రైవర్ల సహనానికి ఇది పెద్ద పరీక్ష. ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మధ్య ఈ పరీక్షను ఎదుర్కోవడం డ్రైవర్లకు పెద్ద సవాల్‌గా మారింది. ఎడాపెడా గేర్, క్లచ్ వినియోగంతో పరికరాలు పాడై ఎక్కడపడితే అక్కడ నిలిచిపోవటం నిత్యకృత్యంగా మారుతోంది. దీనికి విరుగుడుగా ఇప్పుడు గేర్ లేని (ఆటో ట్రాన్స్‌మిషన్) బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఇకపై హైదరాబాద్‌లో కొత్తగా ప్రవేశపెట్టే బస్సుల్లో గేర్ లేని డిజైన్‌వే కొనాలని నిర్ణయించింది. త్వరలో రోడ్లపైకి ఇలాంటి 160 బస్సులు రాబోతున్నాయి.
ఆ బస్సులతో పడలేక...
పెరుగుతున్న ట్రాఫిక్, ఇరుకుగా మారుతున్న రోడ్లపై బస్సులు నడిపేందుకు పెద్ద సమస్యగా మారింది. దీంతో డ్రైవర్లు చాలాకాలంగా గగ్గోలు పెడుతున్నారు. చాలామంది డ్రైవర్లు హైదరాబాద్ కన్నా జిల్లాల్లో పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. రోడ్లు గుంతలమయంగా మారటంతో ప్రమాదాలు తీవ్రమయ్యాయి. దీంతో ఆర్టీసీ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కూడా పీడకలగా మారుతోంది. దాదాపు 20 శాతం బస్సులు కాలం చెల్లినవే కావటంతో వాటిని నడిపేవారు మరీ ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని డ్రైవర్లపై ఒత్తిడి తగ్గించేందుకు గేర్లు లేని బస్సులను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం నడుస్తున్న ఏసీ బస్సులు, లో ఫ్లోర్ బస్సులు క్లచ్‌తో అవసరం లేనివే. ఇవి ప్రయోజనకరంగా ఉన్నాయని వాటి డ్రైవర్లు చెబుతున్నారు. తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టినా.. త్వరలోనే జిల్లాల్లో నడిపేందుకు కూడా ఈ నమూనావే కొనాలని నిర్ణయించారు. కాగా, గేర్‌బాక్స్ అవసరం లేని నమూనాపై ఆర్టీసీకి ఓ విదేశీ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మైలేజీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చింది. ఇప్పుడున్న బస్సులను ఆ పద్ధతిలోకి మార్చే అంశాన్ని కంపెనీ ముందుంచగా అది సులభం కాదని పేర్కొంది.
డ్రైవర్‌పై భారం తగ్గుతుంది
గేర్ బాక్సులేని ఆటో ట్రాన్స్‌మిషన్ నమూనా బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఇది డ్రైవర్‌లపై ఒత్తిడి తగ్గిస్తుంది. ఫలితంగా మరింత భద్రంగా బస్సును నడిపేందుకు అవకాశం లభిస్తుంది. ప్రమాదాలను తగ్గించటమే కాకుండా కుదుపులేని ప్రయాణంతో ప్రయాణికులకూ ఊరట కలుగుతుంది. – ఆర్టీసీ ఎండీ రమణారావు
Comments
Please login to add a commentAdd a comment