అటకెక్కిన ఆధునికీకరణ.. | There is no matter of modernisation in mahabub nagar water projects | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ఆధునికీకరణ..

Published Sat, Jan 31 2015 9:37 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM

There is no matter of modernisation in mahabub nagar water projects

- అధ్వానస్థితిలో పిల్లకాల్వలు
- పాత అలుగులో లీకేజీలు
- చివరి ఆయకట్టుకు అందని సాగునీరు


మహబూబ్‌నగర్: ప్రస్తుతం రిజర్వాయర్‌గా ఉపయోగిస్తున్నా.. కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు క్రస్టుగేట్ల షట్టర్లకు ఇప్పటివరకూ మరమ్మతులు చేపట్టలేదు. రబ్బర్ వాచర్లు పూర్తిగా అరిగిపోయి పాత అలుగుస్థాయి 26.6 అడుగులకు నీరు చేరగానే లీకేజీలు ప్రారంభమవుతున్నాయి. అధికారులు కొత్తగా రబ్బరు వాచర్లను వేయడంలో శ్రద్ధచూపడం లేదు. గతంలో ఉన్న అధికారులు ఏటా లీకేజీలు అరికట్టడానికి తాత్కలికంగా గోనే సంచులను షట్టర్ల కిందకు జొప్పించేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదు. కోయిల్‌సాగర్ అలుగుపై పిచ్చిమొక్కలు మొలచినా తొలగించడం లేదు.
 
నెరవేరని ఎత్తిపోతల లక్ష్యం
వర్షాభావ పరిస్థితుల కారణంగా కోయిల్‌సాగర్‌లోకి పెద్దవాగు నీటి ప్రవాహం లేకపోవడంతో జూరాల బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని పంపింగ్ చేసినా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపలేకపోయారు. షట్టర్ లేవల్ 32.6 అడుగులు ఉండగా, అలుగు లెవల్ 26.6 అడుగుల సామర్థ్యం మేరకు నీటిని నింపారు. అయితే గొటుసు కట్టు చెరువులకు నీటిని వదిలి పూర్తిస్థాయిలో నింపలేకపోయారు. దాదాపు రూ.400కోట్లు వెచ్చించి కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పనులు పూర్తిచేసినా ఇతర సమస్యలను గాలికొదిలారు. గతంలో వర్షాధారంగా ప్రాజెక్టు నిండినప్పడు 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేవారు. ప్రస్తుతం కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా తీసుకురావడం వల్ల ఆయకట్టు 50,250 ఎకరాలకు పెరగాల్సి ఉంది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొంది.
 
తూములు లేని కాల్వలు

కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల తూములకు షట్టర్లు లేకపోవడంతో నీరంతా వృథా అవుతుంది. ఇక పిల్లకాల్వల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. కాల్వల ద్వారా పంటపొలాలకు నీరు వదిలితే.. పది అడుగులు కూడా పారడం లేదు. కుడి కాల్వ కింద ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలతో పాటు నర్వ మండలంలోని కొంతమేర భూములు సాగవుతాయి, ఎడమ కాల్వ ద్వారా ప్రస్తుతం దేవరకద్ర మండలం గూరకొండ వరకు భూములు సాగవుతుండగా కొత్త ఆయకట్టు కింద కౌకుంట్ల రాజోలి వరకు సాగులోకి వస్తాయి. గొలుసు కట్టు చెరువుల కోసం నీటిని వదలడానికి కొత్త కాల్వలకు తూములు నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుకు రెండువైపులా ఉన్న ఆనకట్ట ఫుట్‌పాత్‌పై కాంక్రీట్ పనులు చేపట్టాలి.
 
పర్యాటకం కల నెరవేరేనా..?

జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు నిండినప్పుడు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సెలవుదినాల్లో పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తుంటారు. బోటింగ్ వంటి సౌకర్యం, అలాగే అధ్వానస్థితిలో ఉన్న గెస్ట్‌హౌస్‌ను బాగుచేస్తే పర్యాటక  శాఖకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
 
నేడు జిల్లాకు మంత్రి హరీష్‌రావు
రాష్ట్ర నీటిపారుదల, మైనింగ్, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 8.30 గంటలకు అన్నాసాగర్, 10 గంటలకు కోయిల్‌సాగర్ డ్యామ్‌ను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 కోయిలసాగర్ ఎత్తిపోతల పథకం, భూత్పూర్ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు అమరచింతకు చేరుకుని ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు శుక్రవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement