హైదరాబాద్‌లో వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీసు కమిషనర్
కామారెడ్డి క్రైం : కామారెడ్డి వేణుగోపాలస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలను అపహరించిన అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కామారెడ్డి పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆలయంలో చోరీకి గురైన శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామల పంచలోహ ఉత్సవ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి ఎస్పీ శ్వేత, పోలీ సు బృందంతో కలిసి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం నగర పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన నబీద్‌షేక్ హైదర్, షేక్ అజీజ్‌లు ముఠాగా ఏర్పడి పురాతన ఆలయాల్లోని పంచలోహ విగ్రహాలను దొంగి లించి స్మగ్లర్ల కు విక్రయిస్తుంటారు. కామారెడ్డిలోని పెద్దబజార్ వేణుగోపాలస్వామి ఆలయంలో జనవరి 27 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 700 యేళ్ల నాటి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ పుటేజీల్లో నిందితుల ఆనవాళ్లను గుర్తించిన కామారెడ్డి పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితులు అపహరించిన పంచలోహ విగ్రహాలను అఫ్జల్‌గంజ్‌లో స్మగ్లర్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కామారెడ్డి పోలీసులతో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కామారెడ్డి వేణుగోపాలస్వామి ఆలయంలోకి చోరీకి గురైన పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాల విలువ బయట మార్కెట్‌లో రూ. 3 కోట్ల వరకు ఉంటుందని కమిషనర్ వెల్లడించారు.
మూడు రాష్ట్రాల్లో చోరీలు
కర్ణాటకకు చెందిన బాల్చి ముఠా సభ్యులైన హైదర్, అజీజ్‌లు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోరీ కేసుల్లో నిందితులు. వారు పంచలోహ విగ్రహాలను మాత్రమే టార్గెట్ చేసి అపహరిస్తారు. మహారాష్ట్రలోని హింగోలిలో గల జైన్ మందిరం నుంచి మహావీర పంచలోహ విగ్రహాన్ని, లాతూర్ జిల్లాలోని కిల్లోరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేదార్‌లింగ్ దేవాలయంలో శివుని విగ్రహాన్ని ఇదే తరహాలో దొంగిలించారు. వాటితో పాటు గతంలో మూడు కేసుల్లో వీరిని కర్ణాటకలోని బాగల్ కోర్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ పురాతన ఆలయాలను గుర్తిస్తారు. ఆయా దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు ఉన్నది నిర్ధారించుకుంటారు. దొంగలించేందుకు అనువైన సమయాన్ని ఎంచుకునేందుకు గస్తీ నిర్వహిస్తారు. వెంట తెచ్చుకునే రాడ్లతో ఆలయాల్లోని తాళాలను పగులగొట్టి దేవతామూర్తులను ఎత్తుకెళ్తారు. ఒకరు ఆలయంలోకి వెళితే మరొకరు బయట గస్తీ నిర్వహిస్తారు. ఈ తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న బాల్చి ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కామారెడ్డి పోలీసులకు ఆదివారం అప్పగించారు. తదుపరి విచారణ నిమిత్తం కామారెడ్డి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment