కాంచీపురం: తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి దొంగలే ఆలయ బంగారం దోచేయటంతో పోలీసులు మోసాన్ని ఛేదించి విచారణ జరుపుతున్నారు. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయంలోని స్వామి, అమ్మవార్లకు బంగారు నగలు చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. నగలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్తపతి, ఆలయ మేనేజర్, నగ తయారీదారులకు ఆరు కిలోల బంగారాన్ని అందించారు. తర్వాత కొత్త బంగారు నగలు చేసి స్వామివార్లకు అలంకరించారు. అయితే ఇటీవల పోలీసుల తనిఖీలలో రెండు పంచలోహ విగ్రహాలు పట్టుబడ్డాయి. దీనిపై విచారణ జరపగా ఈ విగ్రహాలు ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలోనివని తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని కొందరు పంచలోహ విగ్రహాల స్థానంలో నకిలీ విగ్రహాలను పెట్టి అసలు విగ్రహాలను బయట విక్రయించినట్లు తేలింది. అంతేకాక స్వామివార్ల నగలు కూడా నకిలీవని తేలింది. అసలు బంగారాన్ని స్వాహా చేసి నకిలీ గిల్డ్ నగలను స్వామివార్లకు అలంకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు స్తపతి, ఆలయ మేనేజర్, నగల తయారీదారు సహా తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేశారు. ప్రఖ్యాత ఆలయంలో స్వామివారి పంచలోహ విగ్రహాలు, నగలు స్వాహా చేయటం తమిళనాట కలకలం సృష్టిస్తోంది.