
చోరీకి గురైన విగ్రహం
టీ.నగర్: కాంచీపురం మురుగన్ ఆలయంలో కచ్చియప్పర్ విగ్రహం చోరీ కేసులో పూజారిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మురుగన్ ఆలయంలో కచ్చియప్పర్‌కు 29 సెంటీ మీటర్ల ఎత్తు, 18 సెంటీమీటర్ల వెడల్పుగల 7,470 కిలోగ్రాముల పంచలోహ విగ్రహం ఉంది. ఏడాదికి ఒకసారి ఈ విగ్రహానికి ప్రత్యేక అభిషేకం జరిపి ముఖ్య నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఉత్సవం గత మార్చి మొదటి వారంలో జరిగింది. తర్వాత విగ్రహాన్ని ఆలయంలో భద్రపరిచారు.
ఇలావుండగా మార్చి 10వ తేదీన కచ్చియప్పర్ విగ్రహం కనిపించడం లేదని ఆలయ పూజారులు కొందరు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి త్యాగరాజన్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయ పూజారి కార్తిక్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద విచారణ జరపగా మద్యం మత్తులో సమీపంలోగల సర్వతీర్థ కొలనులో పారేసినట్లు తెలిపాడు. అక్కడ అగ్నిమాపక సిబ్బంది సాయంతో వెదికినప్పటికీ కనిపించకపోవడంతో అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కుంభకోణం విగ్రహాల తరలింపు నిరోధక విభాగం ప్రత్యేక కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి అతన్ని 15 రోజులపాటు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించారు
Comments
Please login to add a commentAdd a comment