మూడో వ్యక్తి ఊహాగానమే!: నాయిని
‘సూర్యాపేట’ ఘటనపై హోంమంత్రి నాయిని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో కాల్పులు జరిపి పోలీసులను హతమార్చిన ‘సిమి’ ఉగ్రమూకలో మూడో వ్యక్తి సైతం ఉన్నాడని జరిగిన ప్రచారం ఊహాగానమేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ ముష్కర మూకలో మూడో వ్యక్తి ఉన్నట్లు ఆధారాలు లభిస్తే ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఎన్‌కౌంటర్ స్థలంలో లభించిన రైలు టికెట్ మృతిచెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిది అయివుండవచ్చని భావిస్తున్నామన్నారు. సిమి ముష్కరులతో పోరాడుతూ అసువులు బాసిన ఎస్‌ఐ సిద్ధయ్య, కానిస్టేబుళ్లు నాగరాజు, లింగయ్య, హోంగార్డు మహేశ్‌ల ధైర్య సాహసాలపై సీనియర్ జర్నలిస్టు కళా సురేందర్ రచించిన ‘పోలీస్ టైగర్స్’ అనే పుస్తకాన్ని సోమవారం హోంమంత్రి నాయిని సచివాలయంలో ఆవిష్కరించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నలుగురు పోలీసు అమరుల ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు. సూర్యాపేట బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపిన మూకను తొలుత ఉత్తరప్రదేశ్‌కు చెందిన దోపిడీ దొంగల ముఠాగా భావించామన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సహకారంతో మృతి చెందిన అస్లం, ఎజాజుద్దీన్‌లను సిమి ఉగ్రవాదులుగా గుర్తించామన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు హోంమంత్రి నిరాకరించారు. ఈ అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మాట్లాడడం సబబు కాదన్నారు. పుస్తక రచయిత కళా సురేందర్ మాట్లాడుతూ అమర వీరుల త్యాగాలు భవిష్యత్తు తరాలకు తెలపాలనే ఈ రచన చేసినట్లు పేర్కొన్నారు.