ఆ జీవో వెనుక అక్రమాలున్నాయ్! | those G.o irregularities back! | Sakshi
Sakshi News home page

ఆ జీవో వెనుక అక్రమాలున్నాయ్!

Published Mon, May 12 2014 1:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

those G.o irregularities back!

 పోలీసు పదోన్నతుల జీవోపై గవర్నర్‌కు ఫిర్యాదు 

దీన్ని అలాగే అమలుచేస్తే చాలామంది నష్టపోతారని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఎదుర్కోవడం కోసం పోలీసు ఉన్నతాధికారులు హడావుడిగా అమలు చేయాలని చూస్తున్న పదోన్నతుల జీవో (నెం.54) వెనుక అనేక అక్రమాలున్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీన్ని యథాతథంగా అమలు చేస్తే ప్రస్తుతం డీఎస్పీ, ఆపై హోదాలో ఉన్న 1985 బ్యాచ్ ఎస్సైలకు అక్రమ లబ్ధి చేకూరడంతోపాటు ఆ తర్వాతి బ్యాచ్‌లు దాదాపు నాలుగేళ్ల పాటు సీనియారిటీ, పదోన్నతుల్ని కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ 1989 బ్యాచ్ అధికారులు ఇటీవల గవర్నర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

పోలీసు విభాగంలో ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి పోస్టులను జోనల్ పోస్టులుగా పరిగణిస్తారు. డీఎస్పీ పోస్టు నుంచి రాష్ట్ర క్యాడర్‌కు మారిపోతాయి. రాష్ట్రంలో మొత్తం ఆరు జోన్లు ఉండగా.. హైదరాబాద్ సిటీ పోలీసు అనేది చాలా కాలం వరకు ప్రత్యేక జోన్‌గా కొనసాగింది. దీన్ని 2001లో హైకోర్టు ఆరో జోన్‌లో భాగంగా కలిపేసినా.. 2009లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మళ్లీ వేరే జోన్‌గా మారిపోయింది. హైదరాబాద్ సిటీ వేరే జోన్‌గా ఉండటంతో ఇక్కడ ఏర్పడే ఖాళీల ఆధారంగానే ఎస్సై, ఇన్‌స్పెక్టర్‌లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. స్థానికంగా ఖాళీలు తక్కువ కావడంతో సాధారణ పరిస్థితుల్లోనే పదోన్నతులు ఆలస్యమవుతాయి.

1985లో ఎస్సైలుగా ఎంపికైన అధికారుల పరిస్థితి మరీ ఘోరం. ఈ బ్యాచ్‌లో మొత్తం 220 మంది వరకు ఎంపిక కాగా.. సగానికి సగం మంది హైదరాబాద్ సిటీకే అలాట్ అయ్యారు. దీంతో వీరి పదోన్నతులు మరీ ఆలస్యమవుతాయి. అనివార్య కారణాల నేపథ్యంలో గడిచిన కొన్నేళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. ప్రతి ఏటా ప్యానల్ ఇయర్ (సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు)లో ఏర్పడిన ఖాళీల ఆధారంగా తాత్కాలిక పదోన్నతులు (అడ్‌హాక్) ఇస్తూ వచ్చారు. వీటిని క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో జీవో నెం.54 జారీచేసింది.

2009లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సిటీ పోలీసును వేరే జోన్‌గా పరిగణించి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా.. ఉన్నతాధికారులు అలా చేయకుండా, జోన్-6లో కలిపి ప్రమోషన్లు ఇస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పడటమేనని 1989 బ్యాచ్ అధికారులు జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి జీవో నెం.54ను విడుదల చేశారు. ఇది ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఇటీవల సుప్రీంకోర్టు.. డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

దీంతో అడ్‌హాక్ పదోన్నతుల్ని క్రమబద్ధీకరించడానికీ ఆఘమేఘాల మీద జీవో నెం.54ను అమలు చేయడానికి పోలీసు విభాగం కసరత్తులు చేస్తోంది. అయితే, ఇందులో అనేక అక్రమాలు ఉన్నాయని, ఏకంగా ప్రభుత్వ రికార్డుల్నే తారుమారు చేశారని ఆరోపిస్తూ 1989 బ్యాచ్ అధికారులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. దీంతో వారు ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది పొరపాటున జరిగింది కాదని, ఉద్దేశపూర్వకంగానే చేశారని ఆరోపించారు.
 
ఆరోపిస్తున్న అవకతవకలివీ..
సీఐడీ, ఏసీబీల్లోకి సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. ఇలా ఓ అధికారి వెళ్లినప్పుడు సదరు విభాగంలో ఏర్పడిన ఖాళీని డిప్యుటేషన్ వేకెన్సీగా పరిగణిస్తారు. అనివార్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్ సిటీ యూనిట్‌లో 1992-1998 మధ్య డిప్యుటేషన్ అమలుకాక ఆ వేకెన్సీలు ఏర్పడలేదు. ఈ కాలంలో డిప్యుటేషన్ వెకెన్సీలు లేనప్పటికీ 1992-93లో 30 పోస్టులు, 1993-94లో 10 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు చూపుతూ జీవో రూపొందించారు.

ఆరో జోన్‌లో పనిచేస్తున్న అధికారి పదవీ విరమణ పొందితే ఆ ఖాళీలో అదే జోన్‌కు చెందినవారికి పదోన్నతి ఇచ్చి భర్తీ చేయాలి. దీనికి విరుద్ధంగా ఆరో జోన్‌లో రిటైర్ అయినవారి ఖాళీలనూ సిటీ పోలీసులో చూపిస్తూ 70 వేకెన్సీలకు తెరలేపారు.
సీనియారిటీ జాబితాలో అప్పటికే పదవీ విరమణ చేసిన అధికారుల పేర్లనూ చేర్చాల్సి ఉంటుంది. అయితే జీవో నెం.54కు సంబంధించిన జాబితాలో 13 మంది పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసినవారి పేర్లు చేర్చలేదు. దీనివల్ల కింది స్థానాల్లో ఉన్న 13 మంది పై స్థానాలకు ఎగబాకారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement