సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గురువారం మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 16కు చేరింది. సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి (50) దుబాయి నుంచి రాగా, ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ నెల 14న ఆయన దుబాయి నుంచి వచ్చాడు. 17న కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో తక్షణమే గాంధీ ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు చేయగా, కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆయనతో కాంటాక్టు అయిన వారిని గుర్తించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. విమానంలో ఆయనతో ప్రయాణించిన వారి వివరాలు గుర్తిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వారిలో ఒకరు ఈ నెల 18న హైదరాబాద్ వచ్చాడు. విమానాశ్రయం నుంచి రాగానే లక్షణాలు గుర్తించి, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక మరో వ్యక్తి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అతడికి కూడా పాజిటివ్ లక్షణాలున్నట్లు నిర్దారించారు. వీరిద్దరూ నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలకు చెందిన యువకులు. వారి కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. (ముందు జాగ్రత్తలే శ్రీరామరక్ష)
గలేరియా మాల్‌లో కలకలం..
హైదరాబాద్‌లోని పంజగుట్ట గలేరియా మాల్‌కు వేరే రాష్ట్రానికి చెందిన ఓ కోవిడ్ పాజిటివ్ రోగి ఈ నెల 11న వచ్చాడని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ రోజు ఆ మాల్‌కు వెళ్లినవారెవరైనా ఉంటే వారంతా హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు కోరారు. ఎవరిౖకైనా లక్షణాలున్నా, ఇతరత్రా అనుమానాలున్నా 104 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. అయితే ఆ వ్యక్తి హైదరాబాద్‌లో ఇంకెక్కడెక్కడ తిరిగి ఉంటాడో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పనిచేయని కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూం 24 గంటలూ పనిచేస్తుందని చెప్పడమే కానీ, అక్కడ ఎలాంటి సమాచారం కానీ, వివరాలు కానీ లభ్యం కావట్లేదని కొందరు చెబుతున్నారు. దానికి ఒక నంబర్ కూడా కేటాయించకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. కోవిడ్‌ను పర్యవేక్షించే అధికారులు తమ బంధువులు, స్నేహితులతో గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుతున్నారే కానీ ఎవరైనా కోవిడ్ సమాచారం అడిగితే చెప్పట్లేదని, ఫోన్లే ఎత్తట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్లల్లో అధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి భరోసా ఇస్తున్నా, అధికారుల తీరు మాత్రం మారట్లేదు. కోవిడ్ నియంత్రణ నోడల్ ఆఫీసర్‌గా విజయ్‌కుమార్ అనే అధికారిని నియమించారు. ఆయనకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు.
71,256 మందికి స్క్రీనింగ్ :
హైదరాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో గురువారం నాటికి మొత్తం 71,256 మందికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
యాదాద్రిలో ఆర్జిత సేవలు బంద్
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంతో పాటు కొండపై ఉన్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి, అను బంధ ఆలయమైన పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఆర్జిత సేవలు నిలిపి వేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment