ప్రతీకాత్మక చిత్రం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ఎల్‌పీలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటన పూర్తి భరోసా ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు కొంతకాలంగా అభద్రతా, అపోహల మధ్య ఉన్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు కూడా లేనిపోని ప్రచారాలకు తెరలేపాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు విడతలుగా చేయించిన సర్వే చాలామందిలో అయోమయం, ఆందోళనకు కారణమైంది.
ఇదే సమయంలో థర్డ్‌ఫ్రంట్ తెరమీదకు రావడం.. వచ్చే ఎన్నికల్లో మంత్రులను ఎంపీలుగా, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతారన్న ప్రచారం అధికార పార్టీలో గందరగోళానికి వేదికైంది. ఈ ప్రచారం చాలామంది ప్రజాప్రతినిధులను టెన్షన్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో 2019 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకే ‘సిట్టింగ్’ స్థానాలను కేటాయిస్తామని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొంతకాలంగా అభద్రతాభావంతో ఉన్న ప్రజాప్రతినిధులకు ఆయన ప్రకటన భరోసా ఇచ్చినట్లయ్యింది. సీఎం స్వయంగా చేయించిన మూడు విడతల సర్వేలో ‘గ్రాఫ్’ తగ్గిన ప్రజాప్రతినిధులూ తేరుకుంటున్నారు.
ప్రచారాలు, అపోహలకు తెర.. సీఎం ప్రకటనతో ఊరట
సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ జరుగుతున్న రకరకాల ప్రచారాలు అధికార పార్టీలో గందరగోళం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ పలువురికి ఉద్వాసన పలుకుతారన్న చర్చ కూడా ఉమ్మడి జిల్లాలో ‘వైరల్’ అయ్యింది. ఈ ప్రచారాలపై అధికార పార్టీ నేతలు కొందరు వివరణ ఇచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పార్లమెంట్‌కు వెళ్తారని, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ జిల్లాలోని ఓ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి శాసనసభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.
పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద్ బరిలో ఉంటారని, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఈసారి రాజన్న సిరిసిల్లలో ఓ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదుచోట్ల అభ్యర్థుల మార్పు అనివార్యమన్న ప్రచారమూ అధికారపార్టీలో నిన్నామొన్నటి వరకు ‘వైరల్’ కావడం పలువురిని ఆందోళనకు గురి చేసింది. ఇదే సమయంలో అధినేత కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌ను తెరమీదకు తీసుకురావడం, ఉద్యమంలో తనవెంట అడుగులేసిన సీనియర్లను ఎంపీలుగా తీసుకెళ్తానని ప్రకటించడంతో జిల్లాకు చెందిన పలువురు ఇప్పుడున్న అవకాశాలు కోల్పోతారన్న చర్చ గందరగోళం సృష్టించింది.
ఇదే సమయంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ఎల్‌పీలో కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. 2019 వరకు తానిక్కడే ఉంటానని, ఆ ఎన్నికల్లో అందరూ సిట్టింగ్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు ఇస్తానని చేసిన ప్రకటన అపోహలకు తెరవేసి కొండంత భరోసా ఇచ్చింది.
వలస, కొత్తగా అశావహులకు నోఛాన్స్
మూడు విడతలుగా సర్వేల ఫలితాలను ప్రకటించిన గులాబీ దళపతి కేసీఆర్ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరును వారి కళ్లకు కట్టారు. రెండు సర్వేలను సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మూడో విడత సర్వే నివేదికను డిసెంబర్‌లో కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే వివరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12 కాగా.. శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల పనితీరు, టీఆర్‌ఎస్ పార్టీ, ఇతర పార్టీల బలాబలాలను కేసీఆర్ వివరించారు.
ఆ సర్వేలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు 89.90 శాతంతో ఫస్ట్ ర్యాంకు రాగా.. మంత్రి కేటీఆర్ 79.60 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. తొలి, రెండో సర్వేలకు పోలిస్తే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల్లో చాలామందికి ‘గ్రాఫ్’ తగ్గగా.. కొందరు ఫరవాలేదనిపించారు. ఇంకొందరు పాసు మార్కులకే పరిమితం అయ్యారు. మరికొందరు పాస్‌మార్కులను కొంచెం పైకి పెరిగారు. ప్రజాక్షేత్రంలో ఉండేవారికి ప్రజలు వేసిన మార్కులను కేసీఆర్ ప్రజాప్రతినిధులకు వివరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
చాలామందికి టిక్కెట్లు ఇవ్వడం కష్టమేనన్న చర్చ జరిగింది. ఆది వారం టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సందర్భంగా సీఎం ‘సిట్టింగు’లందరికీ టిక్కెట్లు ఇస్తామనడం ‘గ్రాఫ్’ తగ్గిన నేతలకు ఊరటనిచ్చింది. కేసీఆర్ ప్రకటన సిట్టింగ్‌లకు భరోసా ఇవ్వగా, వలస నేతలు, కొత్తగా టిక్కెట్లు ఆశించే వారికి ఈసారి ఆశాభంగమే కలగనుందన్న చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment