తెలంగాణ రైతులకు బేడీలు వేసినట్లే : కోదండరాం
హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును హరించొద్దని అలా హరిస్తే అది ప్రజాస్వామ్యం కానే కాదు అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం రైతులకు భయపడడంతోనే రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో తేలిపోయిందన్నారు. ధర్నా చౌక్ ఎత్తివేతకు నిరసనగా టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం మిర్చి యార్డులో ఆందోళన చేసిన రైతులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరిచడం దారుణమన్నారు.
ఇది ఒక్క ఖమ్మం రైతులకు మాత్రమే వేసినట్లు కాదని..మొత్తం తెలంగాణ రైతులకు బేడీలు వేసినట్లు అని అభిప్రాయ పడ్డారు. ఒక్క ధర్నా చౌక్ ఎత్తివేస్తే నగరం అంతా ధర్నా చౌక్‌గా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే 15వ తేదీన చలో ధర్నా చౌక్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వేదికను మూసివేసినంత మాత్రాన నిరసనలు ఆగవు అని స్పష్టం చేశారు. ఎవరి మార్గాల్లో వారు ధర్నా చౌక్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు.