‘టీఆర్‌ఎస్ పాలన గాడి తప్పింది’
► ఇసుక దందాల్లో టీఆర్‌ఎస్ నేతలు కూరుకుపోయారు
► పెట్టుబడులకు రైతుల చేతిలో చిల్లరకూడా లేదు
► టీఆర్‌ఎస్ పాలనపై ద్వజమెత్తిన కోదండరాం
సిరిసిల్ల జిల్లా: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకులు ఇసుక దందాలో కూరుకుపోయారని, ప్రభుత్వ పాలన గాడి తప్పిందని కోదండరాం విమర్శించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూలై 7, 8, 9వ తేదీల్లో జిల్లాలో అమరవీరుల స్పూర్తియాత్రను నిర్వహిస్తామని వెల్లడించారు. ముస్తాబాద్ నుంచి మొదలయ్యే యాత్ర మూడురోజులపాటు జిల్లాలో సాగుతుందని, చివరిరోజు జిల్లాకేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం డబ్బులు చెల్లించడంలో విఫలమైందన్నారు. రైతులు ఖరీఫ్ సీజన్‌లో పెట్టుబడులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ డబ్బులు ఇంకా బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని, నకిలీ విత్తనాల బెడద రైతులను వేధిస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రాథమిక సూత్రంపైనే రాష్ట్ర సాధనకు ఉద్యమించామని, ఆ మూడింటినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలిపారు. మొదటి విడత అమరుల స్ఫూర్తియాత్ర సంతృప్తినిచ్చిందని, అదే స్ఫూర్తితో జిల్లాలో యాత్ర సాగిస్తామని వెల్లడించారు.