నేడు మహిళలపై హింస నివారణ దినం
ఈ నెలలో 2 నిర్భయ కేసులు
1. ఈ నెల 7న నిర్మల్ పట్టణంలో హంసరాణి అనే యువతి పెళ్లికి నిరాకరించిందని మునీర్ అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించగా నిందితుడి పై నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
2. ఈ నెల 13న ఆదిలాబాద్ పట్టణంలోని గౌతమ్‌మోడల్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిని అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు దేవాసీస్ లైంగికంగా వేధించాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఆయనపై నిర్భయ, ఫ్యాక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అనుబంధాలు ఆవిరి
ఆధునిక ప్రపంచంలో అనుంబంధాలను మరిచిపోతున్నారు. పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు ఒకరినొకరు తోడూ నీడగా ఉండాల్సిన భార్య, భర్తలు చిన్నచిన్న కారణాలతో బంధాన్ని మరిచిపోయి అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో మహిళలు క్షణికావేశంలో బలవ న్మరణాలకు పాల్పడుతున్నారు. వరకట్న వేధింపులు, కుటుంబ తగాదాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, చుట్టుముట్టిన సమస్యలను పరిష్కరించుకోలేకపోవడం తమకు ఎవరూ లేరనే భావన మహిళలను ఆత్మహత్యల వైపు పురిగొల్పుతోంది. మద్యపానమూ కాపురాల్లో చిచ్చుపెడుతోంది. చాలామంది దంపతులు తమ సమ్యలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోలేక పోలీసుస్టేషన్ల గుమ్మం తొక్కుతున్నారు. న్యాయస్థానాల తలుపు తడుతున్నారు. ఏది ఏమైనా చివరకు బలయ్యేది ఆడబిడ్డే.
అడుగడుగునా వివక్షే!
ఆడదంటేనే చాలు.. వివక్ష గుర్తుకొస్తుంది కావొచ్చు. మహిళ ఎంత విద్యావంతురాలైనా తోటి మగవారిని మించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా ఆడదనే వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతరిక్షంలో మగవారికి దీటుగా రోజురోజుకు మహిళలు పోటీ పడుతున్నారు. కానీ ఎక్కడో కొంత అసహనం. ఎంత చేసినా ఎక్కడికి వెళ్లినా ఆడవారే కదా అనే చులక భావం కనిపిస్తోంది.
ఇదే మహిళా శక్తిని అణగదొక్కేస్తోంది. తాము ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత గుర్తింపు వచ్చినా వివక్ష కనబరుస్తున్నారనే విషయం వారికీ తెలుసు. కానీ ఏమీ అనలేని తత్వం. పాఠశాల తరగతి గది నుంచి మొదలుకొని పెళ్లి చేసుకొని కుటుంబ పోషణ చేసే వరకు మహిళలపై అడుగడుగునా వివక్ష కనిపిస్తోంది. ఏ దేశంలోనైతే మనుషుల మధ్య వివక్ష ఉండదో ఆ దేశం అభివృద్ధి చెందుతుందనేది అక్షరాలా నిజం.
మహిళల కోసం చట్టాలు
మహిళలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తే ఐపీసీ 306 సెక్షన్ కింద సదరు వ్యక్తికి పదేళ్ల జైళు శిక్ష విధిస్తారు.
మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడితే సెక్షన్ 354 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
మహిళలను అపహరించి బలవంతంగా వివాహం చేసుకుంటే 366 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుంది.
వివాహితను వేధింపులకు గురిచేస్తే ఐపీసీ సెక్షన్498-ఏ చట్టం ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు.
భార్య బతికి ఉండగా మరో వివాహం చేసుకుంటే 494 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తారు.
వరకట్నం కోసం భార్యను వేధించి గాయపరిస్తే 304-బి వరకట్న చావు కింద భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తారు.
వీటితో పాటు మహిళలపై అత్యాచారం చేసి, దాడిచేసిన నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు.