చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎట్టకేలకు టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది.
చేవెళ్ల: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎట్టకేలకు టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని కాలె యాదయ్య స్వయంగా ధ్రువీకరించారు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌పార్టీలో పలు పదవులను పొందిన యాదయ్య 2014లో సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అదే పార్టీ టికెట్‌పై పోటీచేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కేఎస్ రత్నంపై విజయం సాధించారు.
ఐదునెలల కాలంలోనే పార్టీని వీడడానికి నిర్ణయించుకున్న ఆయన కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. పెద్ద ఎత్తున తన అనుచరులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్ భవన్‌కు వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే..
రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షపార్టీలో తానుంటే నిధులు ఎలా వస్తాయి, ఏవిధంగా అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రశ్నించారు. అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఓట్లేసి గెలిపించిన ప్రజలు సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌లో ఇప్పటివరకు ఉన్న నాయకులు, కార్యకర్తలను కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ చొరవతో కృషి చేస్తానని పేర్కొన్నారు.