- నేటి నుంచి నెలరోజులపాటు ఉత్సవాలు
- దేవతల శుద్ధీకరణ
- తరలిరానున్న వేలాది మహిళలు
- సౌకర్యాలపై దృష్టిసారించని అధికారులు
- రూ.10 లక్షలు మంజూరు చేసినా ఇంకా అందని వైనం
కెరమెరి : లక్షలాది మంది ఆదివాసీలు పూజించే జంగుబాయి దేవతా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది రెండుసార్లు కొనసాగే ఉత్సవాలు ప్రతీ సంవత్సరం పుష్యం మాసం నుంచి ప్రారంభమై నెలరోజులుపాటు కొనసాగుతాయి. మే 19, తర్వాత డిసెంబర్ 25న కొనసాగుతాయి. మండలంలోని పరంధోళి గ్రామ పంచాయతీకి చెందిన ముకద్దంగూడ గ్రామ అడవుల్లో జంగుబాయి దేవత కొలువై ఉంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దైవక్షేత్రానికి ఇటీవల ప్రాధాన్యత వచ్చింది. నియమ నిష్టతో ఆదివాసీలు పూజలు చేస్తారు. నేడు రాత్రి 8ః00 గంటలకు భక్తి శ్రద్ధలతో దీపోత్సవం జరగనుంది.
దేవతా విగ్రహాలకు శుద్ధి
ఇటీవల చంద్ర గ్రహణం ఉండడంతో నేటి నుంచి ఎనిమిది గోత్రాలకు చెందిన ఆదివాసీలు జంగుబాయి ఆలయ సన్నిధిలో కొలువుదీరిన దేవతా విగ్రహాలను టొప్లకసలో శుద్ధి చేస్తారు. ఎవరికి వారు మేళాలతో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జంగుబాయి, పోచమ్మ, రావుడ్‌తో పాటు మరో ఏడు దేవతా విగ్రహాలను శుద్ధి చేస్తారు.
విత్తనాలు చూపించడమే ప్రత్యేకత
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని విత్తనాలను జంగుబాయికి చూపిస్తారు. పంటపొలాల్లో ఏఏ రకాల విత్తనాలు వేస్తున్నామో వాటిన్నిటిని దేవతకు చూపిస్తే పంటల్లో దిగుబడి బాగా వస్తుందని వారి నమ్మకం.
నిధులు మంజూరైన నిర్లక్ష్యమే
రెండునెలలక్రితం జంగుబాయి ఆలయ అభివృద్ధికోసం ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినా అవి నేటికి ఆల య కమిటీ సభ్యులకు ఐటీడీఏ అధికారులు సమాచారం ఇవ్వలేదు. గతంలోనే ఐటీడీఏ పీవో ఖాతాలో జమ చేసినట్లు తెలిసిందని ఆలయ కమిటీ చైర్మన్ మరప బాజీరావు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కాక్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రోడ్డు, తాగునీటికి కష్టం
జంగుబాయి ఆలయానికి వెళ్లేందుకు సరైనసౌకర్యం లేకపోవడంతో ఆదివాసీ భక్తులు ఇబ్బంది పడక తప్పదు. రాళ్లు రప్పలతో కూడుకున్న దారి ఉండడంతో ఎడ్లబండ్లు రావడం కష్టంకానుంది. తాగునీటి కోసం ఎలాంటి సౌకర్యం లేదు. సమీపంలోని టొప్లకసలో ఉన్న నీటిని ఎడ్ల బండ్లపై తీసుకరాక తప్పదు. తాగునీటికి, స్నానాలకు అవేనీటిని వాడడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
గుహలో బస చేసిన జంగుబాయి
ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి దేవతా గుహలో కొలువైంది. పోచమ్మ ఆలయం వెనుక భాగంలోంచి కప్లైకి పై భాగంలో జంగుబాయి దేవి ఉంది. అది పూర్తిగా గుహకావడంతో భక్తులు కూర్చునే నడుస్తారు. చిమ్మని చీకటిలో దీపం వెలుగులో ఆ దేవత కనిపిస్తుంది. మనుసుల్లో ఉన్న కోర్కెలు తీర్చే తల్లిగా ఆదివాసీలు భావిస్తారు.
ఆరు గోత్రాలకు చెందిన కుటుంబాలు ఒకే వేదికపై
వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులైన వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హైం రం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. వారెవరూ కూడా వాహనాలను ఉపయోగించకుండా కేవలం కాలిబాట, ఎడ్ల బండ్లపై వందలాది కిలో మీటర్లు రవాణా సాగిస్తారు. ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు పూజారులుగా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతాయి. వనక్షేత్రంలో బస చేసిన పోచమ్మతల్లికి కూడా మొక్కులు తీర్చుకుంటారు
జంగుబాయి సన్నిధిలో నేడు దీపోత్సవం
Published Sun, Apr 19 2015 2:35 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
Advertisement
Advertisement