శనివారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రైతుల సమస్యలపై గళమెత్తనున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక రోజు రైతుదీక్ష చేయనున్నారు. ఆయనతోపాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొననున్న రైతుదీక్ష కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు కామారెడ్డిలో రైతుదీక్ష చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఈ నెల ఆరున ప్రకటించింది. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై అనేక ఉద్యమాలు నిర్వహించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వేదికగా రైతుదీక్షలకు శ్రీకారం చుట్టింది. 2012 జనవరి 10, 11, 12 తేదీలలో మూడు రోజులపాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్మూరులో రైతు దీక్ష నిర్వహించి జిల్లా ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఇందూరు ప్రజలకు ‘నేనున్నాను’ అంటూ భరోసా ఇచ్చిన సంగతిని ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు. ఈ నెల 10న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతుదీక్షను నిర్వహిస్తుండటం రైతువర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
తొమ్మిది నెలల్లో 784 మంది రైతుల ఆత్మహత్య... ప్రభుత్వ లెక్కల్లో 96 మందే...
రైతులు ఆశలసౌధం నుంచి ఆత్మహత్యల ఒడిలోకి జారుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగానైనా స్పందించడం లేదు. హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో 2014 జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వర కు 784 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 140 కాగా, కరీంనగర్‌లో 115, ఆదిలాబాద్‌లో 98 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 50 మందికిపైగా రైతులు తనువు చాలించారు. కాడినే నమ్ముకున్న రైతులను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత పట్టించుకునేవారు లేకుండా పోవడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. రైతులు, రైతు సంఘాల లెక్కల ప్రకారం 784 మంది రైతులు మృతి చెందగా ప్రభుత్వం మాత్రం కేవలం 96 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రకటించింది. కనీసం ఆ 96మంది రైతు కుటుంబాలను సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఆదుకునే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ రైతుల బాగోగులు పూర్తిగా విస్మరించగా, ప్రతిపక్ష పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ కనీసంగా రైతుల పక్షాన నిలిచిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో కర్షకుల కోసం ‘మేమున్నాం’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో రైతుదీక్షకు సిద్ధమైంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకే...
అన్నదాతల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకే రైతుదీక్ష చేస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీక్ష విజయవంతం కోసం పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్ రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, సత్యం శ్రీరంగం, గున్నం నాగిరెడ్డి, యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడు భీష్మ రవీందర్ , జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి తదితరులు కామారెడ్డిలో ఏర్పాట్లను పరిశీలించారు.