మాట్లాడుతున్న మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం, చీపురుపల్లి: ఆరుగాలం శ్రమించి వరి పండించిన అన్నదాతల గుండె రగిలింది. పండించిన పంటను కొనుగోలు చేయని సర్కారు తీరుతో విసిగెత్తి ధాన్యాన్ని నడిరోడ్డుపై పోసి తగలబెట్టాల్సి వచ్చిం ది. బహుశా జిల్లా చరిత్రలో ఇలాంటి సంఘటన జరిగి ఉండలేదేమో. మంగళవారం చీపురుపల్లిలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలివి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం అర్ధంతరంగా మూసివేయడంతో రైతులు తాము పండించిన పంటను ఏం చేసుకోవాలని ఆందోళన చెందింది. కేంద్రాలు కొనసాగించాలని వేడుకుంది. నెల రోజులుగా నిరసనలు తెలిపింది. జిల్లా కేంద్రంలో కొద్ది రోజుల క్రితం ధర్నా చేపట్టారు. తరువాత చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినిని నాలుగు సార్లు కలిసి సమస్య వివరించారు.
ఈ ప్రయత్నాలు ఫలించకపోవడంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెంది న రైతులు చివరకు చీపురుపల్లి పట్టణంలోని మూ డు రోడ్ల జంక్షన్‌లో మంగళవారం ధర్నాకు దిగా రు. విజయనగరం– పాలకొండ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ధాన్యం బస్తాలు తీసుకొచ్చి నడిరోడ్డుపై పోసి తగలబెట్టారు. రైతులు నిర్వహించిన ధర్నాకు వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నేతృత్వంలో పార్టీ నియోజకవర్గ నాయకులు మద్దతు తెలిపారు. అంతకుముందు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని, రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని, సీఎం డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనప్పుడు, మిల్లర్లు కూడా తీసుకోవడం లేదని దీంతో ఈ ధాన్యం తమ వద్ద మరెందుకు అంటూ ధాన్యం బస్తాలు తీసుకొచ్చి తగలబెట్టారు. నాలుగు మండలాల నుంచి ధర్నాకు హాజరైన రైతులు విజయనగరం– పాలకొండ ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి వాహన రాకపోకలను నిలిపివేశారు.
రైతులను మోసం చేసిన ప్రభుత్వం: మజ్జి
ధర్నా చేపడుతున్న రైతులకు వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఆ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, నాఫెడ్ డైరెక్టర్ కె.వి.సూర్యనారాయణరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి తిరుమల ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రైతులు పండించిన ధాన్యం రోడ్డుపై పోసి తగలబెట్టారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు మరొకటి ఉండవన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయలేని చేతగాని ప్రభుత్వమని మండిపడ్డారు. రైతుల కష్టాలు పట్టించుకోని పాలకులు శిలాఫలకాలు పట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడికక్కడే శంకుస్థాపనల హడావుడిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఈ ఏడాది సంక్రాంతి పండగ కూడా చేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరచి రైతుల వద్ద ఉన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment