నేడే రీ పోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఆదివారం జరుగనున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రీ పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఆదిలక్ష్మయ్య, పాపాన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారవడంతో రీపోలింగ్ జరుపుతున్న విషయం తెలిసిందే. మరోసారి పొరపాట్లు జరగకుండా అన్ని అంశాలను అధికారులు కూలంకషంగా పరిశీలిస్తున్నారు. గుర్తింపు పత్రం లేనిదే ఎవరినీ పోలింగ్‌కు అనుమతించబోమని స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లను ఎన్నికల సంఘం పరిశీలకులు రజత్‌కుమార్, రిటర్నింగ్ అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్ శనివారం స్వయంగా పరిశీలించారు.
చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీని, అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అంబర్‌పేట జీహెచ్‌ఎంసీ ఇండోర్ స్టేడియంకు మార్చ డంతో అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. పోలింగ్ సిబ్బంది శనివారం ఉదయం ఎన్నికల సామాగ్రితో కేంద్రాలకు వెళ్లారు. ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
9న జరిగిన పోలింగ్ పరిస్థితుల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారి ఇచ్చిన వయొలెట్ స్కెచ్ పెన్‌తోనే ఓటర్లు బ్యాలట్ పేపర్‌పై ఓటు మార్క్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఓటేసేవారికి మధ్యవేలిపై సిరా గుర్తు వేయనున్నట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు కనీస సదుపాయాలు కల్పించామన్నారు. ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభ మవుతుంది. ఎనిమిది జిల్లాల పరిధిలోని 126 కేంద్రాల్లో పోలింగ్ జరుగనుంది.
పోటీలోని అభ్యర్థులు..
కొంగర శ్రీనివాస్, అరకల కృష్ణాగౌడ్, ఆది లక్ష్మయ్య, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, గోపాల్ సాయిబాబా మీసాల, నర్రా భూపతిరెడ్డి, ఎంవీ నర్సింగ్ రావు, పాపన్నగారి మాణిక్‌రెడ్డి, ఎం. మమత, ఏవీఎన్ రెడ్డి, ఎస్. విజయకుమార్