టీడీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు చంద్రబాబు నిర్దేశం
పోలింగ్ రోజు తరహాలో మరోసారి విధ్వంసానికి పథకం
కౌంటింగ్ కేంద్రాలు, బయట హింస రాజేయడమే లక్ష్యం
కొమ్ము కాసే అధికారుల అండతో వ్యూహం అమలుకు ప్రణాళిక
రెచ్చగొట్టి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లగొట్టడమే లక్ష్యం
ఈసీ నిర్లిప్త వైఖరిపై ప్రజాస్వామ్యవాదుల విస్మయం
సాక్షి, అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా సృష్టించిన విధ్వంస కుట్రలకు చంద్రబాబు మరింత పదును పెడుతున్నారు! అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను హైజాక్ చేసేందుకు పక్కా పన్నాగం పన్నుతున్నారు. ఓట్లు లెక్కించే జూన్ 4వతేదీన దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండకు తెగబడేందుకు టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారు.
ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల్లో కవ్వింపులకు దిగి ఘర్షణలతో ఉద్రిక్తత రేకెత్తించేందుకు పథకం రూపొందించారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను కవ్వించి కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లగొట్టడమే టీడీపీ దుష్ట పన్నాగం. అందరినీ ఏమార్చి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలన్నదే చంద్రబాబు కుతంత్రం.
పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు వరకు ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ పచ్చ ముఠాలు బరితెగించడం ఆందోళనకరంగా మారింది. ఈసీని ప్రభావితం చేసి తమ చెప్పుచేతల్లో నడుచుకునేలా నియమించుకున్న పోలీసు అధికారుల ద్వారా ఈ కుట్రలను అమలు చేసేందుకు చంద్రబాబు ఉద్యుక్తమైనట్లు స్పష్టమవుతోంది.
ఎంతకైనా తెగించేందుకు వెనుకాడొద్దు..
కౌంటింగ్ సందర్భంగా ఏదో ఒక సాంకేతిక అంశాన్ని సాకుగా చూపించి అధికారులతో వాగ్వాదంతోపాటు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో ఘర్షణకు దిగాలని టీడీపీ ఏజెంట్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మొదట లెక్కించే పోస్టల్ బ్యాలెట్ల నుంచే ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించడం ద్వారా ఎంత పకడ్బందీగా కుట్ర పన్నారో స్పష్టమవుతోంది.
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈమేరకు చంద్రబాబు ఉపదేశించారు. ఇక సాధారణ కౌంటింగ్ ఏజంట్లతో శనివారం నిర్వహించే సమావేశంలోనూ ఇవే అంశాలు పునరుద్ఘాటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
ఎంత తీవ్రస్థాయిలో ఘర్షణకు అయినా సిద్ధం కావాలని అందుకోసం ఎంతకైనా తెగించాలని కౌంటింగ్ ఏజెంట్లను పురిగొల్పడం ద్వారా చంద్రబాబు తన కుతంత్రాన్ని బహిర్గతం చేశారు.
పోలింగ్ రోజు మోడల్ అమలు
పోలింగ్ సందర్భంగా పాల్పడిన కుట్రలనే కౌంటింగ్ రోజు కూడా పునరావృతం చేయాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) ద్వారా తాము నియమించుకున్న పోలీసు యంత్రాంగం ఇందుకు పూర్తిగా సహకరిస్తుందనే ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించిన ఈ నెల 13వతేదీన టీడీపీ రౌడీమూకలు దాడులతో భయానక వాతావరణం సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రధానంగా పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో అల్లరి మూకలు యథేచ్ఛగా దౌర్జన్యకాండకు పాల్పడ్డాయి. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాలతోపాటు నడి వీధుల్లో స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది. అదే అదనుగా మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలను ఓటింగ్‌కు దూరం చేయడమే లక్ష్యంగా పచ్చ ముఠాలు కత్తులు, కర్రలు, రాడ్లు చేతబట్టుకుని బీభత్సం సృష్టించాయి.
బాంబు దాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధ్వంసకాండ మోడల్‌ను ఓట్ల లెక్కింపు రోజు కూడా అమలు చేయాలని చంద్రబాబు పథకం వేశారు. కౌంటింగ్ కేంద్రాల బయట దాడులతో దృష్టి మళ్లించి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తమ ఏజెంట్లతో కవ్వింపు చర్యలకు దిగాలని కుట్ర పన్నారు.
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లగొట్టండి...!
వైఎస్సార్ సీపీ ఏజెంట్లే లక్ష్యంగా కౌంటింగ్ కేంద్రాల్లో కవ్వింపు చర్యలతో ఘర్షణలకు దిగాలని, దాడులకూ వెనకాడొద్దని చంద్రబాబు ఆదేశించారు. అదే అదనుగా తమకు అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులను రంగ ప్రవేశం చేయించి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల నుంచి బలవంతంగా బయటకు పంపేలా చంద్రబాబు ఇప్పటికే కీలక అధికారులతో మంతనాలు జరిపారు.
ఆ తరువాత ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలన్నది ఆయన లక్ష్యం. ఈమేరకు పోస్టల్ బ్యాలెట్ల నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు వరకూ ప్రతి దశలోనూ కౌంటింగ్ కేంద్రాల్లో వాగ్వాదం, ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు టీడీపీ పావులు కదుపుతోంది.
చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న ఈసీ, కొందరు పోలీసు అధికారులు కౌంటింగ్ ప్రక్రియలోనూ అదే రీతిలో వ్యవహరించే అవకాశాలున్నాయని ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన ఈసీ, అధికార యంత్రాంగం ఉదాశీనంగా, నిస్తేజంగా వ్యవహరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment