సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి రెండో విడత ‘పల్లె ప్రగతి’ప్రారంభం కానుంది. అధికార యంత్రాంగం పల్లెబాట పడుతోంది. అధికారులు, పాలకవర్గాల హడావుడితో 11 రోజుల పాటు గ్రామాల్లో సందడి కొనసాగనుంది. గురువారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం జరగనుంది. గతేడాది సెపె్టంబర్‌లో జరిగిన 30 రోజుల ప్రణాళికలో అమలు చేసిన కార్యాచరణే ఈసారి కూడా ఆచరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి నిర్వహణకు పంచాయతీరాజ్‌శాఖ సన్నద్ధమైంది.
బాగుంటే ప్రోత్సాహకాలు.. లేకుంటే చర్యలు
ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించిన ఆ శాఖ.. ఆ అధికారి పర్యవేక్షణలో పల్లె ప్రగతిని నిర్వహించాలని నిర్దేశించనుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పరిశీలనకు మండల, జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఈ సారి కొత్తగా రాష్ట్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేసింది. 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు కేటాయించిన మండలాల్లోని రెండు పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించి.. పల్లె ప్రగతి నిర్వహణ తీరును మదింపు చేస్తారు. అంతేగాకుండా.. ఆ గ్రామంలో గుర్తించిన పనులు, నిధులు, విధుల నిర్వహణలో స్థానిక పంచాయతీ సిబ్బంది, పాలకవర్గం పనితీరుపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగా బాగా పనిచేసిన పంచాయతీలకు ప్రోత్సాహకాలు.. అలసత్వం ప్రదర్శించినట్లు తేలితే చర్యలకు సిఫారసు చేస్తారు. తొలిరోజు నిర్వహించే గ్రామసభలో మొదటి విడత ప్రగతి నివేదికను గ్రామస్తుల ముందుంచనున్నారు. పల్లె ప్రగతి లక్ష్యం, పంచాయతీ ఆదాయ, వ్యయాలు, ప్రజల భాగస్వామ్యంపై అవగాహన కలి్పంచనున్నారు. గ్రామ వార్షిక ప్రణాళికకు ఆమోదముద్ర వేయనున్నారు.
లక్ష్యాలివే..
► గ్రామాలను పచ్చదనం–పరిశుభ్రంగా ఉంచడం
► పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణలో ప్రజలకు విస్తృత భాగస్వామం కలి్పంచడం
► గ్రామాభివృద్ధికి వార్షిక ప్రణాళికలు తయారుచేసి నియంత్రిత
► పద్ధతిలో నిధుల వినియోగం
► ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం
ప్రతి నెలా రూ. 339 కోట్లు..
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తోంది. ఈ నిధులను గ్రామావసరాలకు వినియోగించాలని స్పష్టం చేసింది. మలీ్టపర్పస్ వర్కర్‌లకు వేతనాలు, చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలించేందుకుట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని, మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించింది. వీటి వినియోగంపై గ్రామస్థాయిలో పరిశీలించాలని అధికారుల బృందాలకు ప్రభుత్వం సూచించింది.
మొదటి విడతలో పూర్తి చేసిన పనులివే..
గతేడాది సెపె్టంబర్ 6 నుంచి ఆక్టోబర్ 5 వరకు తొలి విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ 30 రోజుల పాటు పల్లెల్లో పలు పనులు చేపట్టి పూర్తి చేశారు.
► 5 పంచాయతీల్లో మినహా 12,746 పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణ. 12,687 పంచాయతీల్లో 38,061 మంది కోఆప్షన్‌సభ్యుల ఎన్నిక.
► 12,744 పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు ∙అందులో 8,20,009 మంది సభ్యుల ఎన్నిక.. అందులో మహిళాసభ్యులే 4,02,965 మంది
► సమస్యలకు సంబంధించి చర్యలు చేపట్టేందుకు 12,746 గ్రామపంచాయతీల్లో పాదయాత్రల నిర్వహణ, ఈ పంచాయతీల్లో వార్షిక ప్రణాళికల తయారీ ∙10,544 పంచాయతీల్లో వైకుంఠధామాలు/శ్మశానాల ఏర్పాటుకు భూమి గుర్తింపు ∙10,875 గ్రామాల్లో డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు భూమి గుర్తింపు
► లక్షకు పైగా ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో శిథిలాల తొలగింపు ∙దాదాపు రెండున్నర లక్షల ప్రదేశాల్లో సర్కార్ తుమ్మ, పిచి్చమొక్కలు, పొదల తొలగింపు ∙లక్ష దాకా ఖాళీ ప్రదేశాల శుభ్రం ∙15,548 పాడుపడిన బావులు, 9,337 ఉపయోగించని బోరు బావులు మూసివేత
► 1.22 లక్ష ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పెంచే చర్యలు, 79,108 ప్రభుత్వ సంస్థలు, ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు.
Comments
Please login to add a commentAdd a comment