సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల తరహాలోనే.. రైతుల కోసం ప్రత్యేకంగా ‘వ్యవసాయ ప్రగతి’ని చేపట్టాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. పొలాల్లో భూసార పరీక్షలు, విత్తనాలు వేయడం మొదలు పంట ఉత్పత్తుల విక్రయాల దాకా అన్ని అంశాల్లో విస్తృత అవగాహన కల్పించడం, అవసరమైన సాయం అందించడం లక్ష్యంగా ఈ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. దీనిపై వ్యవసాయ శాఖ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటినుంచి అమల్లోకి తేవాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా.. ఈ వానాకాలం సీజన్ నుంచే మొదలుపెట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే ‘వ్యవసాయ ప్రగతి’ని ప్రకటించవచ్చని అంటున్నాయి. ప్రతీ సీజన్ (వానాకాలం, యాసంగి)కు ముందు వ్యవసాయ ప్రగతి కార్యక్రమం ఉండేలా.. అంటే ఏటా రెండుసార్లు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
రైతువద్దకే యంత్రాంగమంతా..
ప్రభుత్వం పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల కింద ఎన్నో పనులు చేపడుతోంది. సంబంధిత శాఖల సమన్వయంతో.. పారిశుధ్యం, దోమల నివారణ, రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో పిచ్చి చెట్లను తొలగించడం, శిథిలాల తొలగింపుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది. ఇదే తరహాలో వ్యవసాయ సీజన్లకు ముందు ‘వ్యవసాయ ప్రగతి’ చేపట్టాలని.. వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) మొదలు జిల్లాస్థాయి అధికారుల దాకా రైతుల వద్దకే వెళ్లేలా కార్యక్రమానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే చోట్ల, ఏయే పంటలు వేయాలి? ఎంత మేర సాగు చేయాలి? అన్నది నిర్ధారించి.. ఈ వ్యవసాయ ప్రణాళికపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
వివిధ శాఖల సమన్వయంతో..
రైతులకు సంబంధించి వ్యవసాయశాఖతోపాటు నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్ వంటి శాఖలతోనూ అవసరం ఉంటుంది. రిజర్వాయర్లు, నదులున్నచోట కాలువల్లోకి నీటికి ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై నీటి పారుదలశాఖ స్పష్టత ఇస్తుంది. ఆ మేరకు రైతుల వద్దకు నీటిపారుదల అధికారులు కూడా వస్తారు. అలాగే విద్యుత్ మోటార్లకు సక్రమంగా కరెంటు సరఫరా అయ్యేలా చూడటం, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలకు సంబంధించి విద్యుత్ అధికారులు వస్తారు. అలాగే జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడా రైతుల వద్దకు వచ్చి పంటలు, సాగుపై సూచనలు చేస్తారు. ఆయా శాఖలు, విభాగాలతో వ్యవసాయశాఖ సమన్వయం చేసుకొని ‘వ్యవసాయ ప్రగతి’ కార్యక్రమం చేపడతుంది. మరోవైపు రైతు వేదికలను ఆధారం చేసుకొని మరికొన్ని కార్యక్రమాలను చేపడతారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, కంది వేయాలన్న ప్రభుత్వ సూచనల మేరకు వీటిపైనా రైతులకు అవగాహన కల్పిస్తారు. పంట పండించాక మద్దతు ధరలు ఎలా ఉంటాయి, ఏయే పంటలకు ఎక్కడ అధిక ధరలు లభించే అవకాశం ఉందన్న సూచనలూ చేస్తారు. వరి పొలాల్లో అంతర పంటగా చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. కొన్నిదేశాల్లో ఇలా చేపల పెంపకం జరుగుతున్నందున.. ఆయాచోట్ల అధ్యయనం చేశాక ప్రణాళిక రూపొందించనున్నారు. ప్రభుత్వం విస్తృతస్థాయిలో ‘వ్యవసాయ ప్రగతి’కి రూపకల్పన చేస్తున్నా.. ఎక్కడైనా లోపాలు ఉంటే రైతుల ఆగ్రహానికి కూడా గురికావాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు.
వ్యవసాయ ప్రగతి కింద చేపట్టే కార్యక్రమాలివీ..!
వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్న ప్రకారం.. భూసార పరీక్షల నుంచి విత్తనాలు, యాంత్రీకరణ, రుణాలు, పంట అమ్మకాల దాకా దాదాపు అన్ని అంశాల్లో రైతులకు తోడ్పడే కార్యక్రమాలను ‘వ్యవసాయ ప్రగతి’కింద చేపట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు కసరత్తు మొదలుపెట్టారని తెలిసింది.
– గ్రామాల్లో మొబైల్ టెస్టింగ్ సెంటర్ల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి.. వాటి ఫలితాలకు అనుగుణంగా ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో రైతులకు సూచిస్తారు. రైతులు ఆయా నేలలకు అవసరమైన ఎరువులు మాత్రమే వాడాలి. ఎక్కువ వాడితే పంట విషపూరితం అవుతుంది. కాబట్టి మోతాదును నిర్ణయిస్తారు.
– కొందరు రైతులు వానలు మొదలవగానే విత్తనాలు వేస్తారు. కానీ నిర్ణీత మోతాదులో వర్షం పడ్డాక మాత్రమే విత్తనాలు వేయాలి. లేకుంటే వృథా అవుతుంది. అందువల్ల వర్షం ఏమేరకు పడితే.. విత్తనాలు వేయాలో సూచిస్తారు. ముఖ్యంగా పత్తి రైతులు తొలివానకే విత్తనం వేయడం, తర్వాత కొద్దిరోజులు వానలు లేక.. విత్తనాలు మాడిపోవడం తరచూ జరుగుతోంది. అధికారులు ఈ సమస్యకు చెక్‌పెడతారు.
– వ్యవసాయ కేలండర్ ప్రకారం ఏ నెలలో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతులకు స్పష్టమైన సూచనలు చేస్తారు. శాస్త్రీయ పద్దతుల్లో పంటలు వేయకపోతే దాని ప్రభావం దిగుబడిపై పడుతుందన్నది వివరిస్తారు.
– పంటలకు తగిన విత్తనాలను ఎంచుకోవడంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. కల్తీ విత్తనాలు కొనకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా తెలియజేస్తారు. మరోవైపు కల్తీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్ బృందాలతో దాడులు నిర్వహిస్తారు.
– వర్షాలు సకాలంలో పడకపోయినా, వానల మధ్య ఎక్కువ రోజులు విరామం వచ్చినా.. పంటల రక్షణకు ఎలాంటి పద్ధతులు అనుసరించాలో తెలియజేస్తారు. అవసరమైతే స్వల్పకాలిక, మధ్యకాలిక పంటల వివరాలు తెలియజేస్తారు.
– ఏ పంటకు ఎంత నీరు అవసరమనేది తెలియజేస్తారు. మన దగ్గర అవసరానికి మించి నీటిని వినియోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నందున.. రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తారు.
– వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం వ్యవసాయ యంత్రాల కోసం ఇస్తున్న సబ్సిడీని తెలియజేస్తారు. అవసరమైతే రైతు వేదికల వద్ద ఆయా యంత్రాలను ప్రదర్శిస్తారు. కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఎక్కువగా ప్రోత్సహించి వ్యవసాయ యాంత్రీకరణవైపు రైతులను మళ్లిస్తారు.
– రైతుబంధు అందరికీ అందేలా ప్రత్యేక చర్యలు చేపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను పెట్టే ఆలోచన ఉన్నట్టు సమాచారం.
– రైతుబీమా ఉండీ, సొమ్ము అందని వారు ఎవరైనా ఉంటే.. వివరాలను సేకరించి ఎల్‌ఐసీకి పంపిస్తారు.
– బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించేలా స్థానిక అధికారులు కృషిచేస్తారు. రైతుబంధు సొమ్మును అప్పుల కింద జమ చేసుకోకుండా బ్యాంకర్లతో చర్చలు జరుపుతారు.
– పంటలు చేతికొచ్చాక మద్దతు ధరకు మించి అధికంగా ఎక్కడ ధరలు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎలా తెలుసుకోవాలో రైతులకు వివరిస్తారు.
పల్లె, పట్టణ ప్రగతి తరహాలో ‘వ్యవసాయ ప్రగతి’ రైతుకు ఊతం
Published Mon, May 9 2022 12:57 AM | Last Updated on Mon, May 9 2022 7:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment