ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: ప్రగతి మంత్రం ఫలించింది. పల్లెచిత్రం మారింది. హరితహారమే లక్ష్యంగా పారిశుద్ధ్య నిర్వహణే కర్తవ్యంగా రాష్ట్రంలోని 12,751 పంచాయతీల్లో సాగిన రెండోవిడత పల్లె ప్రగతి కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. అక్షరాస్యతలోనూ ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని భావించిన ప్రభుత్వం.. ‘ఈచ్ వన్ టీచ్ వన్’నినా దం కింద తొలిసారి గ్రామ పంచాయతీల్లో 25,03,901 మంది వయోజనులను నిరక్షరాస్యులుగా గుర్తిం చింది. ఇందులో అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 1,54,804, నల్లగొండ జిల్లాలో 1,47,054 మంది వయోజన నిరక్షరాస్యులు ఉం డగా, యాదాద్రి జిల్లాలో 1,32,412 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,21,847 మంది, నిర్మల్ జిల్లాలో 1,20,597 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వారి కోసం సర్కారు అక్షర యజ్ఞం చేపట్టనుంది. దశాబ్దాలుగా సమస్యల వలయంలో చిక్కుకొని కునారిల్లుతున్న గ్రామీణ ప్రాం తాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా విస్తృతంగా అభివృద్ధి, అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ఈసారి విశేషం. తొలిరోజు గ్రామ సభల్లో వార్షిక ప్రణాళిక, పంచా యతీ ఆదాయ వ్యయాలు, తొలి విడత పల్లెప్రగతి నివేదికను గ్రామస్తుల ముందుంచడం ద్వారా పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. గ్రామ సభలు, పాదయాత్రలు, శ్రమదానాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల హడావుడితో గత 11 రోజులు పల్లెల్లో సందడి వాతావరణం కనిపించింది. పరిసరాల పరిశుభ్రత, పిచ్చిమొక్కల తొలగింపు, వైకుంఠధామాలు, కంపోస్టు యార్డు, శాశ్వత నర్సరీలకు స్థలాలను గుర్తించారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాయి.
దాతల సహకారం...
పల్లె దాటినా సొంతూరిపై మమకారంతో సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చిన పలువురు దాతలు పల్లె ప్రగతికి ఇతోధికంగా సహకారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందించి 15,739 మంది దాతృత్వంతో ముందుకొచ్చారు. వీరంతా రూ. 11.64 కోట్ల విరాళాలను అందజేశారు. మరింత ఆర్థిక సాయం అందించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పల్లెల సత్వర సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ పద్దుల కింద రూ. 1,475.28 కోట్లు విడుదల చేయగా ఈ నిధులకు దాతల సాయం చేదోడువాదోడుగా నిలవడంతో అభివృద్ధి పట్టాలెక్కనుంది. పల్లెసీమలకు సమస్యల నుంచి విముక్తి లభించనుంది.
మొత్తం గ్రామ పంచాయతీలు : 12,751
గ్రామీణ జనాభా : 2.03 కోట్లు
గ్రామ సభలు నిర్వహించిన పంచాయతీలు : 12,749
భాగస్వామ్యమైన ప్రజలు : 7,02,563
Comments
Please login to add a commentAdd a comment