నేడు సీతారాముల కల్యాణం
ముస్తాబైన భద్రగిరి.. ఏర్పాట్లు పూర్తి
వేలాదిగా చేరుకుంటున్న భక్తజనం
ముత్యాల తలంబ్రాలతో నేడు గవర్నర్ రాక
భద్రాచలం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో మంగళవారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి రోజున భద్రగిరిలో జరిగే స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు మన రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. మిథిలాస్టేడియంలోని సుందరంగా తీర్చిదిద్దిన కల్యా ణ మండపంలో స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మండపంలో స్వామి వారి కల్యాణ తంతు మంగళవారం ఉదయం 10.30 నుంచి ప్రారంభమవుతుంది. అభిజిత్ లగ్నమందు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మాంగల్య ధారణ జరుగుతుంది. మిథిలా స్టేడియంలో 35 వేల మంది వరకూ భక్తులు కూర్చుని స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేశారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు.
ఈసారి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మిథిలా స్టేడియంలో సెక్టార్‌లలో 40 కూలర్‌లను ఏర్పాటు చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరేందుకు గోదావరి ఘాట్, మిథిలా స్టేడియం ప్రాంగణంతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ టెంట్లను ఏర్పాటు చేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులందరికీ స్వామి వారి ప్రసాదాలను అందించేందుకు సుమారు 2 లక్షల లడ్డూల ప్రసాదాలను సిద్ధం చేశారు. అదే విధంగా 100 క్వింటాళ్ల స్వామి కల్యాణం తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈసారి అందరికీ ముత్యాల తలంబ్రాలను అందించేందుకు రూ.5లకు ఒక ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం చేరుకున్న దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మిథిలా స్టేడియంలో ఇదే వేదికపై బుధవారం స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది.
రామయ్యకు మండపేట బోండాలు
మండపేట, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవంలో తూర్పు గోదావరి జిల్లా మండపేట కొబ్బరి బోండాలు కొలువుదీరనున్నాయి. పట్టణానికి చెందిన కేవీఏ రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు 2001 నుంచి భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి బోండాలను అలంకరించి తీసుకెళ్తున్నారు. బోండాలకు ఎనామిల్, వాటర్ పెయింట్లు వేస్తారు. పూసలు, రాళ్లు, రిబ్బన్లు తదితర సామగ్రితో సుందరంగా తీర్చిదిద్దుతారు. శంఖు చక్రాలు, నామాలు, సీతారాముల పేర్లతో ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. ఈ అలంకరణకు పది రోజులు పడుతుందని రామారెడ్డి తెలిపారు. సీతారాముల కల్యాణ వేడుకలో ఈ బోండాలను కానుకగా ఇవ్వాలని ఆకాంక్షించామని, అదే తరువాత ఆనవాయితీగా మారిందని చెప్పారు.
రాజన్న సన్నిధిలో..
వేములవాడ, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో శ్రీ సీతారాముల కల్యాణం మంగళవారం వైభవంగా జరుగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది తరలివస్తారు. మంగళవారం ఉదయం 10.05 నుంచి మధ్యాహ్నం 12.35 మధ్య జానకీరాముల కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో కృష్ణాజీరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు కల్యాణ వేడుకలను తిలకించేందుకు వీలుగా ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం 4.30కు రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ వేడుక జరుగుతున్న సమయంలోనే శివసత్తులు, హిజ్రాలు శివుడిని పెళ్లాడటం ఇక్కడ ఆనవాయితీ. ఓవైపు సీతారాముల తలంబ్రాల వేడుక కన్నులపండువగా సాగుతున్న సమయంలో వీరంతా పరస్పరం తలంబ్రాలు పోసుకోవటం విశేషం.