కనగ కనగ కమనీయం | Traditional Ugadi celebrations at Bhadrachalam temple | Sakshi
Sakshi News home page

కనగ కనగ కమనీయం

Published Tue, Apr 4 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

కనగ కనగ కమనీయం

కనగ కనగ కమనీయం

భద్రాచలం

పరమపవిత్ర గోదావరి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైనదే పావన భద్రాద్రి క్షేత్రం. ఇక్కడ స్వామివారు ధనుర్బాణ శంఖుచక్రాలను ధరించి చతుర్భుజుడిగా దర్శనమిస్తున్నాడు. ఓవైపు గోదావరి గలగలలు... మరోవైపు పాపికొండల సోయగాలు... ప్రకృతి రమణీయత మనసును దోచేస్తుండగా శ్రీరామచంద్రుడి దర్శనభాగ్యానికి భక్తజనం తహతహలాడుతుంటారు. జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామి వారి కల్యాణాన్ని చూసి తరించాలని అనుకోని వారుండరు. గోదావరిలో స్నానం ఆచరించి రామయ్య పాదాల చెంత సేదతీరితే సర్వపాపాలు తొలగిపోయినట్లేనని భక్తజనం నమ్మిక. దక్షిణ అయోధ్యగా, సాకేతపురిగా పేరుగాంచిన భద్రాచలం... ఖమ్మం పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరామనవమి సందర్భంగా నేడు ఇక్కడ శ్రీ సీతారాముల వారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా భాసిల్లుతున్న భద్రగిరిలో రాములోరి పెళ్లి అంగరంగవైభవంగా జరగనుంది.

వైకుంఠ నారాయణుడు
త్రేతాయుగంలో దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేస్తున్న సీతారాముల అనుగ్రహానికి పాత్రమైన ఒక శిల బ్రహ్మదేవుని వరప్రసాదంగా మేరు దేవి, మేరు పర్వత రాజదంపతులకు భద్రుడు పేరిట పుత్రుడై జన్మించాడు. బాల్యం నుంచి శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది శ్రీరామ సాక్షాత్కారానికై దండకారణ్యంలో ఘోరతపస్సు చేశాడు. ఆ తపప్రభావంతో శ్రీమన్నారాయణుడు మరలా శ్రీరామ రూపం దాల్చి చతుర్భుజ రామునిగా శంఖచక్ర ధనుర్భాణాలను ధరించి, ఒకవైపు సీత, మరోవైపు లక్ష్మణుడు ఉండగా, పద్మాసనస్థితిలో ఆసీనుడై ప్రత్యక్షమయ్యాడు. భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన అతని శిఖరాగ్రంపై పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా ఆ భద్రుని హృదయ స్థానాన వెలిశాడు. భద్రుని కొండ అయినందునే ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది.

కోటి నామాల రాముడు
స్వామికి భద్రాద్రి రాముడని, సాక్షాత్తు వైకుంఠం నుండి అవతరించడం వల్ల వైకుంఠ రాముడని, ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కార స్వరూపాలు అయినందువల్ల ఓంకార రాముడని, శంఖు చక్ర ధనుర్బాణాలు ధరించడంతో రామ నారాయణుడు అని కూడా పేర్లు వచ్చాయి. మహాభక్తులైన శ్రీ తిరుమంగై అళ్వార్లు, శంకర భగత్పాదులు మొదలగు మహాత్ములెందరో ఈ స్వామిని సేవించి తరించారు. ముఖ్యంగా 16వ శతాబ్దికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తురాలు స్వామికి తాటి ఆకుల పందిరి వేసి పూజలు చేసి అపర శబరిగా తరించింది. అనంతరం భక్తరామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న రామునికి ఆలయ గోపుర ప్రాకార మండపాదులను, అమూల్యమైన ఎన్నో ఆభరణాలను సమర్పించి అనేక కీర్తనలతో గానంచేసి వాగ్గేయకారుడై భద్రాద్రిరాముని సేవలో తరించాడు. భక్తరామదాసు సీతమ్మవారికి చేయించిన మాంగల్యంతోనే నేటికీ మాంగల్యధారణ కార్యక్రమం జరగడం విశేషం.    

అశ్వమేధయాగ ఫలం
పావన గౌతమి నదీ తీరాన ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం కలియుగ వైకుంఠాన్ని మరిపిస్తుంది. ప్రతి యేటా శ్రీరామ నవమి నాటి కల్యాణ మహోత్సవం వీక్షిం^è డానికి, రాములవారిని సేవించడానికి భద్రాచల క్షేత్రానికి ఎవరు వస్తారో... వారు అక్షయమైన అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారని బ్రహ్మపురాణం చెబుతోంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్‌ లగ్నాన పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో జరిగే కల్యాణాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.

అలనాడు రామదాసు చేయించిన సీతారామ కల్యాణానికి గోల్కొండ నవాబు తానీషా... పట్టువస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. భద్రాద్రిలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం ఆనవాయితీగా మారింది.   రాములోరి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు చుట్టుపక్కల సీతారాములు అలనాడు నడయాడిన ప్రదేశాలను చుట్టిరావచ్చు. అవన్నీ  భద్రాద్రికి 9 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి.
– కె. విశ్వనాథ్, సాక్షి ప్రతినిధి, భద్రాచలం, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement