
పరామర్శకు పయనం
నేడు జిల్లాకు రానున్న షర్మిల
‘‘ఇచ్చిన మాట కోసం,నమ్ముకున్న వారి బాగోగుల కోసం నిరం తరం పరితపించే కుటుంబం వారిది. మహానేత వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయా మన్నంత ఆవేదనతో హృదయాలు పగిలి మరణించిన వారెంద రో.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు దాదాపు ఆరేళ్ల క్రితం నల్ల కాల్వ సాక్షిగా జననేత జగన్ మోహన్‌రెడ్డి చేసిన ఓదార్పు ప్రకటనలో భాగంగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల సోమ వారం నుంచి జిల్లాలో పర్యటిస్తున్నారు..’’
వరంగల్ : నమ్ముకున్న వారిపై ఆ కుటుంబం కనబరిచే వాత్సల్యానికి నిదర్శనం. కాలం కరిగిపోయినా.. వారిపై తమ అభిమానం చెరగదనే పరామర్శ ఇది. ప్రజానేత వైఎస్సార్ అకాల మృతిని తట్టుకోలేక అసువులుబాసిన వారి కుటుంబాలను కలుసుకునేందుకు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్వయంగా వస్తున్నారు. వైఎస్సార్ కుటుంబ ప్రతినిధిగా.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సోమవారం నుంచి శుక్రవారం వరకు జిల్లాలో పరామర్శ చేపడుతున్నారు. 2009 సెప్టెంబరు 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో 72 మంది వృతిచెందారు. వీరికి అండగా ఉంటానంటూ జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా నల్ల కాల్వ వద్ద మాట ఇచ్చిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారి స్థితిగతులను తెలుసుకునేందుకు వైఎస్సార్ కుటుంబం తరుఫున షర్మిలమ్మ సోమవారం జిల్లాకు వస్తున్నారు. ఆగస్టు 24 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం వరకు జిల్లాలో షర్మిల తొలి దశ పరామర్శ యాత్ర నిర్వహిస్తారు. ఐదు రోజుల యాత్రలో భాగంగా.. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 32 మంది కుటుంబాలను పరామర్శిస్తారు.
పరామర్శ తొలి దశలో భాగంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో పూర్తిగా.. పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పాక్షికంగా పర్యటన సాగుతుంది. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరామర్శ యాత్రకు అంతా సిద్ధమైంది.
తొలి రోజు 154 కిలో మీటర్లు..
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సోమవారం ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శ యాత్రకు బయలుదేరుతారు. రాజీవ్ రహదారి మార్గంలో వరంగల్ జిల్లా కొమురవెల్లి మీదుగా 11 గంటలకు జనగామ నియోజకవర్గం చేర్యాలకు చేరుకుంటారు. చేర్యాల మండల కేంద్రంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో కర్ర రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత బచ్చన్నపేట మండలం కట్కూరులో పాశికంటి శోభారాణి, గుంటిపల్లి వెంకటేశ్ కుటుంబాలను పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలం బండనాగారంలో మానెపల్లి సిద్ధులు కుటుంబాన్ని, కేసిరెడ్డిపల్లెలో గాదెపాక సిద్ధులు కుటుంబాన్ని అలీంపూర్‌లో చాడ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఏడు కుటుంబాల పరామర్శ తర్వాత తొలిరోజు కార్యక్రమాన్ని ముగిస్తారు. బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో రాత్రి బస చేస్తారు. తొలిరోజు 154 కిలో మీటర్ల దూరంలో షర్మిల యాత్ర సాగుతుంది.
ఆ కుటుంబానికే సాధ్యం..
ఇచ్చిన మాటపై నిలబడే గొప్ప ధైర్యం, విలువలతో కూడిన రాజకీయాలు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికే సాధ్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వైఎస్సార్ అభిమానుల కుటుంబాలకు ఆరేళ్ల క్రితం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్లకాల్వ వద్ద ఇచ్చిన హామీ మేరకు తన సోదరి షర్మిలను పరామర్శ యాత్రకు పంపిస్తున్నారు. షర్మిల పరామర్శ యాత్ర కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. రాజకీయాలకు అతీతంగా అందరు ఈ కార్యక్రమాన్ని స్వాగతించాలి.
- జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు