సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఆన్‌లైన్ పరీక్షలైన టోఫెల్, పీటీఈ, ఐఈఎల్‌టీఎస్‌ల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటికి సంబంధించిన ‘కీ’లు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. లాడ్జిల్లో ‘కోచింగ్ సెంటర్లు’ఏర్పాటు చేసి అభ్యర్థులకు తర్ఫీదు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ దందాలో దాదాపు 40 మంది మంచి స్కోర్స్ సాధించి విదేశీ విద్యకు వెళ్లారు. మరో 40 మంది సఫలీకృతులు కాలేకపోయారు.
తమ సిరీస్‌కు చెందిన ‘కీ’లు ఇస్తామంటూ మోసం చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వేట మొదలుపెట్టిన మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక ఏజెంట్ కె.కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన ‘కీ’లు తీసుకువచ్చి అందిస్తున్న సూత్రధారి యువరాజ్ సింగ్ కోసం గాలిస్తున్నారు. వీరి ద్వారా లబ్ధిపొంది, ఆన్‌లైన్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి విదేశాలకు వెళ్లిన విద్యార్థులకూ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
పరీక్ష కోసం అయిన పరిచయంతో...
నిజామాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కు చెందిన కుర్రా కిరణ్‌కుమార్ 2013లో అక్కడి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2016 మేలో హైదరాబాద్‌కు వచ్చి కేపీహెచ్‌బీలో ఉన్న మలేషియా టౌన్‌షిప్‌లో స్థిరపడ్డాడు. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేద్దామనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్‌టీఎస్) పరీక్ష రాయాలని సిద్ధమయ్యాడు.
విదేశాల్లో విద్యనభ్యసించాలని భావించే వారు ఐఈఎల్‌టీఎస్, పీయర్‌సన్ టెస్ట్స్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్) వంటి పరీక్షలు ఆన్‌లైన్‌లో రాసి మంచి స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కిరణ్‌కు పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన యువరాజ్ సింగ్‌తో పరిచయమైంది. పరీక్ష అడ్డదారిలో పాస్ కావడానికి సహకరిస్తానని చెప్పడంతో కిరణ్ అంగీకరించడమే గాక, పరీక్ష రాసే అభ్యర్థుల్ని వెతికే పనిలోపడ్డాడు.
12 గంటల ముందే ‘కీ’ బయటకు...
పరీక్షల్లో అడ్డదారిలో స్కోర్ సాధించాలనుకునే వారి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసేవాడు. కిరణ్, యువరాజ్ సగం సగం తీసుకునేవారు. పరీక్షకు ముందు రోజు.. దాదాపు 12 గంటల ముందు యువరాజ్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ని తెచ్చి ఇచ్చేవాడు.
వీరిద్దరూ కలసి స్థానికంగా ఉన్న లాడ్జిల్లో గదులు బుక్ చేసి, నగదు చెల్లించిన అభ్యర్థుల్ని తీసుకువచ్చి రాత్రంతా ప్రిపేర్ చేయించేవారు. అయితే మూడు నాలుగు సిరీస్‌లుండే పేపర్‌లో ఒక్క సిరీస్ మాత్రమే తెచ్చేవారు. మరుసటి రోజు ఆ సిరీస్ వచ్చిన వారు ఉత్తీర్ణులవుతుండగా... మిగిలిన వారికి సరైన స్కోర్ రావట్లేదు. ఇలా మంచి స్కోర్ పొందిన వారిలో 40 మంది విదేశాలకు వెళ్లిపోయారు.
మోసపోయామని ఫిర్యాదు చేయడంతో...
కిరణ్‌కు రూ.50 లక్షలు చెల్లించిన మరో 40మందికి సరైన స్కోర్ రాలేదు. దీంతో వీరిలో కొందరు కిరణ్‌పై సైఫాబాద్, మీర్‌చౌక్, జూబ్లీహిల్స్ ఠాణాల్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం గత వారం కిరణ్‌ను పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది.
ఇతడి విచారణలోనే యువరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడికి క్వశ్చన్ పేపర్ ‘కీ’ బ్రిటిష్ కౌన్సిల్ నుంచే అందుతున్నట్లు బయటపెట్టాడు. దేశ వ్యాప్తంగా ఈ దందా చేస్తున్న యువరాజ్ కోసం గాలిస్తున్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో పంజాబ్, హరియాణాల్లో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు.
వీరి ద్వారా అక్రమంగా లబ్ధిపొంది విదేశాలకు వెళ్లిన 40 మందికి నోటీసు లు జారీచేయాలని భావిస్తున్నారు. మోసపోయినట్లు చెప్తున్న వారూ అక్రమ మార్గంలో స్కోర్ సాధించాల ని ప్రయత్నించిన వారే కాబట్టి వీరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉం దా? అనే కోణాన్నీ పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment