డబ్బుల్లేకున్నా.. టోకెన్ ఉంటే చాలు..
హైదరాబాద్: కాయగూరలు కొనాలా? చిల్లర ఉండాలి.. చేతిలో నగదు ఉండాలి అని ఇక చూసుకోవాల్సిన పనిలేదు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడరాదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. రైతు బజార్లలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలసి సంయుక్తంగా ‘టీ-సేవ’కు శ్రీకారం చుట్టింది. ఫలక్‌నుమా రైతుబజార్‌లో ఈ నెల 5న దీన్ని ప్రారంభించారు.
అంతా టోకెన్ల సిస్టమ్..
మొదటగా రైతుబజార్‌కు వచ్చే వినియోగదారులు టీ-సేవ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలపాలి. ఆ తర్వాత టీ-సేవ ప్రతినిధి వెంటనే సదరు వినియోగదారుని అకౌంట్‌లో నగదు మొత్తాన్ని పరిశీలిస్తారు. అనంతరం కూరగాయలు కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు కావాలో అడుగుతాడు. వినియోగదారుడు తెలిపిన నగదుకు అనుగుణంగా రూ.5, 10, 20లకు సంబంధించిన టోకెన్లను అందిస్తారు.
ఉదాహరణకు రూ.200ల కూరగాయలు కావాలని కోరిన వినియోగదారుడికి రూ.20లు విలువజేసే 10 టోకెన్లను అందజేస్తారు. ఒకవేళ రూ. 200కు కంటే అనగా రూ.20-30 తక్కువగా కూరగాయలు తీసుకుంటే మిగిలిన డబ్బులను ఖాతాలోకి వెనక్కి పంపడమో లేదా నగదు రూపంలో చిల్లర ఇవ్వడమో చేస్తారు. కాగా ఈ టోకెన్లను స్వీకరించిన రైతులకు సంబంధిత నగదును అకౌంట్లకు బదిలీ చేస్తారు. లేదా నగదు అందజేస్తారు. డెబిట్ కార్డు ఉన్న వారికి నేరుగా టోకెన్లను ఇచ్చి కూరగాయలు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తారు.