Raitu Bazaar
-
‘ఉల్లి ధర ఎంతైనా రూ 25కే’
సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు కిలో ఉల్లిని రూ. 25 కే సబ్సిడీపై అందిస్తోందని చెప్పారు. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కిలో ఉల్లికి రూ. 90 నుంచి 100 వరకూ సబ్సిడీ భారాన్ని భరిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉల్లి ధర బహిరంగ మార్కెట్ లో కిలో రూ. 150 నుంచి రూ. 200 పలుకుతోందని, పొరుగు రాష్ట్రం తెలంగాణలో రైతు బజార్లలోనే అక్కడి ప్రభుత్వం ఉల్లి కిలో రూ. 45కు అమ్ముతోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో బహిరంగ మార్కెట్లలో అయితే రూ. 150 నుంచి 200 వరకూ అమ్ముతున్నారని, మన రాష్ట్రంలో మాత్రం రూ. 25కే సబ్సిడీపై ప్రజలకు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయలను ప్రజలకు అందుబాటులో ఉంచామని..వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ , మార్కెటింగ్‌శాఖ , రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో నిత్యం ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం షోలాపూర్, అల్వార్, కర్నూలుతో పాటు గత రెండు మూడురోజులుగా తాడేపల్లి గూడెం నుంచి కూడా ఉల్లిని కొనుగోలు చేసి.. సబ్సిడీపై ప్రజలకు అందిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఉల్లిని ప్రజలకు అందుబాటు ధరకు కిలో రూ. 25కే ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 25 కోట్లు ఖర్చు చేసి దాదాపు 35 వేల క్వింటాళ్ళను కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేసిందని తెలిపారు. ఎన్నికల వాగ్దానం మేరకు.. ధరల స్ధిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. ఎవరైనా అక్రమంగా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి మోపిదేవి స్పష్టం చేశారు. -
రైతు బజార్ని పట్టించుకునేవారే కరువయ్యారు
సాక్షి, నిజామాబాద్ అగ్రికల్చర్: రైతులు పండించిన కూరగాయలు విక్రయించేందుకు కోసం నిర్మించిన రైతుబజార్లు నిరుపయోగంగా మారాయి. అక్కడ రైతులకు కనీస వసతులు కల్పించకపోవడంతో అసౌకర్యాలకు గురవుతున్నారు. తద్వారా రైతుబజార్లలో కూరగాయలు విక్రయించేందుకు రైతులు నిరాసక్తత చూపుతున్నారు. దీంతో వీక్లీ మార్కెట్ చౌరస్తా, గాంధీగంజ్, వినాయక్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ చౌరస్తా, కంఠేశ్వర్, ఇలా రోడ్లపై కూర్చొని విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మార్కెటింగ్ అధికారులు స్పందించి నగరంలో ఎక్కడా కూరగాయలు విక్రయించకుండా చర్యలు చేపట్టి.. రైతుబజార్లను ఉపయోగంలోకి తేవాలని నగరప్రజలు కోరుతున్నారు. కూరగాయల రైతుల సౌకర్యార్థం నగరంలో 2000 సంవత్సరంలో సుభాష్‌నగర్, పులాంగ్ వద్ద రైతుబజార్లను నిర్మించారు. ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చే కూరగాయల రైతులందరూ అక్కడికి వచ్చి విక్రయించుకునే వీలు కల్పించారు. మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతో అక్కడ కూరగాయలు విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపారు. తర్వాత కాలంలో వాటి నిర్వహణను గాలికొదిలేశారు. కనీసం అక్కడ మరుగుదొడ్లు, మూత్రశాలలు, తదితర నిర్వహణ సక్రమంగా చేపట్టలేదు. ఇటీవల కాలంలో రైతుబజార్ల మరమ్మతు పనులకు రూ.10లక్షలు వెచ్చించారు. మరమ్మతులు, బోర్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లకు ఖర్చుచేసి కొద్దో.. గొప్పో సౌకర్యాలను మెరుగుపర్చారు. శాఖల మధ్య సమన్వయలోపం.. నిత్యం సుమారు 200మంది రైతులు నిజామాబాద్ రూరల్, మోపాల్, ఇందల్వాయి, గాంధారి, మాక్లూర్, ఆర్మూర్, తదితర మండలాల నుంచి రైతులు వచ్చి నగరంలోని రోడ్లపై కూరగాయలను విక్రయిస్తారు. ఇదే అదనుగా భావించి మున్సిపాలిటీ అధికారులు రూ.20చొప్పున తైబజార్ పేరుతో వసూలు చేస్తున్నారు. రోడ్లపై కూరగాయలు విక్రయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. మున్సిపాలిటీ వారు తైబజార్ వసూలు చేయడం, ట్రాఫిక్ పోలీసులు మామూళ్ల మత్తులో మునిగిపోవడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు ఏం చేయలేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నా రు. ఈక్రమంలో రైతుబజార్లలో ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. మార్కెటింగ్ అధికారులే చొరవ తీసుకోవాలి.. రైతుబజార్లను వినియోగంలోకి తీసుకొచ్చే విషయంలో మార్కెటింగ్‌శాఖ అధికారులే చొరవ తీసుకోవాలి. మున్సిపాలిటీ, మార్కెటింగ్‌శాఖ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయపర్చాలి. నగరంలో ఎక్కడెక్కడ రోడ్లు, ప్రధానచౌరస్తాల్లో కూరగాయలు విక్రయిస్తున్నారో పరిశీలించి వారిని ఫులాంగ్, సుభాష్‌నగర్ వద్ద నిర్మించిన రైతుబజార్లలోకి తరలించాలి. జిల్లా మార్కెటింగ్ అధికారి నిర్లక్ష్యం వల్లే రైతుబజార్లు వృథాగా ఉంటున్నాయనే ఆరోపణలుసైతం వెల్లువెత్తుతున్నాయి. వినియోగంలోకి తేవాలి నగరంలో హోల్‌సేల్ మార్కెట్‌ను గాంధీగంజ్ నుంచి శ్రద్ధానంద్ గంజ్ ప్రాంతానికి తరలించారు. దీంతో నగర ప్రజలకు కొంత దూరభారం పెరిగింది. ఈక్రమంలో నగరంలో నిర్మించిన రైతుబజార్లను వినియోగంలోకి తెస్తే వి నియోగదారులకు మేలు జరుగుతోంది. నేరుగా రైతుల నుంచి తాజా కూరగాయలను కొనుగోలు చేయడంతోపాటు రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది. – యాదగిరి, కోటగల్లీ -
డబ్బుల్లేకున్నా.. టోకెన్ ఉంటే చాలు..
హైదరాబాద్: కాయగూరలు కొనాలా? చిల్లర ఉండాలి.. చేతిలో నగదు ఉండాలి అని ఇక చూసుకోవాల్సిన పనిలేదు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడరాదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. రైతు బజార్లలో ఐడీఎఫ్సీ బ్యాంక్‌తో కలసి సంయుక్తంగా ‘టీ-సేవ’కు శ్రీకారం చుట్టింది. ఫలక్‌నుమా రైతుబజార్లో ఈ నెల 5న దీన్ని ప్రారంభించారు. అంతా టోకెన్ల సిస్టమ్.. మొదటగా రైతుబజార్‌కు వచ్చే వినియోగదారులు టీ-సేవ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అనుసంధానం చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు తెలపాలి. ఆ తర్వాత టీ-సేవ ప్రతినిధి వెంటనే సదరు వినియోగదారుని అకౌంట్లో నగదు మొత్తాన్ని పరిశీలిస్తారు. అనంతరం కూరగాయలు కొనుగోలు చేయడానికి ఎంత డబ్బు కావాలో అడుగుతాడు. వినియోగదారుడు తెలిపిన నగదుకు అనుగుణంగా రూ.5, 10, 20లకు సంబంధించిన టోకెన్లను అందిస్తారు. ఉదాహరణకు రూ.200ల కూరగాయలు కావాలని కోరిన వినియోగదారుడికి రూ.20లు విలువజేసే 10 టోకెన్లను అందజేస్తారు. ఒకవేళ రూ. 200కు కంటే అనగా రూ.20-30 తక్కువగా కూరగాయలు తీసుకుంటే మిగిలిన డబ్బులను ఖాతాలోకి వెనక్కి పంపడమో లేదా నగదు రూపంలో చిల్లర ఇవ్వడమో చేస్తారు. కాగా ఈ టోకెన్లను స్వీకరించిన రైతులకు సంబంధిత నగదును అకౌంట్లకు బదిలీ చేస్తారు. లేదా నగదు అందజేస్తారు. డెబిట్ కార్డు ఉన్న వారికి నేరుగా టోకెన్లను ఇచ్చి కూరగాయలు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తారు.