సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి మూలంగా వివిధ రంగాలు తీవ్రంగా దెబ్బతినగా, కొన్ని మాత్రం నెలలు, ఏళ్లు గడిచినా పూర్వ స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరికొన్నింటికి ప్రభుత్వ పరంగా కొంత ఊతమిస్తే తిరిగి కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రంగాల వారీగా పరిశ్రమల స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందించాలనే అంశంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. వివిధ రంగాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ‘టూల్ కిట్ల’ను సిద్ధం చేసి 15 రోజుల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
పరిశ్రమలకు ముడి సరుకులు ఎంత మేర అందుబాటులో ఉన్నాయి, కార్మి కుల వలస వాటి పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతోంది, డీలర్లు, షాపుల మూసివేత వల్ల ఎంత మేర నష్టం జరుగుతోంది, వినియోగదారులు ఏ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నారు వంటి అంశాలను ‘టూల్‌కిట్’లో పొందుపరుస్తారు. టూల్ కిట్ రూపొందించడంలో భాగంగా భారీపరిశ్రమలతో పాటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) రంగం ఎదుర్కొంటున్న స్థితిగతులపై పరిశ్రమల శాఖ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. తద్వారా ఏయే రంగాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఏ తరహా సాయం అందించవచ్చనే అంశాన్ని కూడా ‘టూల్‌కిట్’లో పొందు పరుస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు.
రాత్రి షిఫ్టులకు కూడా అనుమతి
లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో పట్టాలెక్కినట్లు పరిశ్రమల శాఖ చెప్తోంది. చాలా పరిశ్రమలు ముడి సరుకుల కొరత, వాటి ధరలు పెరగడం, రవాణా, మార్కెటింగ్, కార్మికుల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కర్మాగారాల వద్దకు కార్మికులను చేరవేసేందుకు అవసరమైతే ఆర్టీసి బస్సులను తక్కువ అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. గతంలో 33 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ప్రస్తుతం ఎంత మంది కార్మికులను అయినా విధుల్లోకి తీసుకునేందుకు అనుమతిస్తోంది.
అవసరమైతే రాత్రి షిఫ్టుల్లోనూ ఉత్పత్తికి కూడా అనుమతులు ఇస్తోంది.పరిశ్రమలు మాత్రం కార్మి కుల కొరతను ఎదుర్కొనేందుకు గతంలో ఉన్న 8 గంటల పని విధానాన్ని 12గంటలకు పెంచాలని కోరుతున్నాయి. కార్మిక చట్టాలు, నిబంధనలకు లోబడి 12 గంటల షిఫ్టునకు అనుమతించడంలో సా ధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. యూపీ, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 12 గంటల పని విధానానికి అనుమతిచ్చినా, వేతనాల్లో పెంపుపై స్పష్టత ఇవ్వలేదు.
ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు కార్మికుల కొరత
రాష్ట్రంలోని పారిశ్రామికవాడల్లో సుమారు పది వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్లో 15లక్షల మంది కార్మికులు పనిచేస్తుండగా, ఇందులో సగం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తిరుగుముఖం పడుతున్నారు. తమ కంపెనీలో పని చేసే 30 మంది కార్మికుల్లో అందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని, ఇప్పటికే ఎనిమిది మంది స్వస్థలాలకు వెళ్లడంతో ఉత్పత్తికి అంతరాయం కలుగుతోందని ఉప్పల్ పారిశ్రామిక వాడకు చెందిన ఓ పరిశ్రమ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment