పేషెంట్ల పేరుతో.. నేతల ఇళ్లలోనే కిట్లు | PPE Kits Distribution After Political Leaders House in Hyderabad | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ కిట్ల పంపిణీలోనూ కిరికిరి

Jul 31 2020 9:12 AM | Updated on Jul 31 2020 9:12 AM

PPE Kits Distribution After Political Leaders House in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సర్కారీ కోవిడ్‌ కిట్ల పంపిణీలో స్థానిక నేతల జోక్యం అధికారులకు ఇబ్బందిగా మారింది. కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన బాధితులకు అందాల్సిన కిట్లు...రోగుల పేరుతో నేతల ఇళ్లకు చేరుతున్నాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది నేరుగా హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల ఇళ్లకు వెళ్లి వీటిని  అందజేయాల్సి ఉంది. అయితే స్థానికంగా కొందరు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు వైద్య సిబ్బందికి అడ్డుతగులుతున్నారు. తమ డివిజన్‌ పరిధిలో తాము తప్ప మరెవరూ సర్కారీ కిట్లు పంపిణీ చేయడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారు. లబ్దిదారులకు కాకుండా ముందస్తుగా వాటిని తమ బంధువులకు అందజేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో బాధితులే స్వయంగా ప్రైవేటు మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తీరా అక్కడ అజిత్రోమైసిన్‌ వంటి యాంటి బయాటిక్‌ సహా జింకోవిట్, విటమిన్‌ సీ, ఈ, డీ వంటి మల్టీవిటమిన్‌ టాబ్లెట్లు దొరకడం లేదు. సకాలంలో మందులు వాడక పోవడంతో శరీరంలో వైరస్‌ తీవ్రత పెరిగి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై మృత్యువాత పడుతున్నారు. మరికొందరు బాధితులకు ఏకంగా పాజిటివ్‌ నుంచి నెగిటివ్‌ వచ్చిన తర్వాత ఐసోలేషన్‌ కిట్లను అందిస్తుండటం గమనార్హం. 

సర్కారీ కిట్ల కోసం బాధితుల నిరీక్షణ
నగరంలోని మల్కజ్‌గిరి సర్కిల్‌ పరిధిలో ఇప్పటి వరకు 724 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 290 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రభుత్వం 350 కిట్లు అందజేయగా, ఇప్పటి వరకు 199 మందికి పంపిణీ చేశారు. ఇక సర్కిల్‌ 19 పరిధిలో 1568 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 640 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రభుత్వం 890 కిట్లను సరఫరా చేయగా, ఇప్పటి వరకు 800 కిట్లు మాత్రమే పంపిణీ చేశారు. గోషామహల్‌ పరిధిలో 490 కిట్లకు ఇప్పటి వరకు 430 పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 932 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 540 మందికే కిట్లు అందజేశారు. కుత్బుల్లాపూర్‌లో 1069 యాక్టివ్‌ కేసులు ఉండగా, 540 మందికే కిట్లు అందాయి. అంబర్‌పేటలో 981 యాక్టివ్‌ కేసులు ఉండగా, 460 మందికే కిట్లు అందాయి. ఉప్పల్‌లో 342 కేసులు నమోదు కాగా, వీటిలో ప్రస్తుతం 172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో ఒక్కరికి కూడా సర్కారీ కిట్లు అందలేదు. మేడ్చల్‌జోన్‌లో 734 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 219 మందికే కిట్లు అందజేశారు. మలక్‌పేటలో 1500 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 300 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరిలో 250 మందికే కిట్లు అందాయి. ఎల్బీన గర్‌లో 827 కేసులు ఉండగా, వీరిలో 800 మందికే కిట్లు అందాయి. చాంద్రాయణగుట్టలో 561 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా, వీరిలో 500 మందికి, సంతోష్‌నగర్‌లో  168 మందిలో 150 మందికి, ఫలక్‌నుమాలో 128 మంది ఉండగా, వీరిలో 107 మందికి, చార్మినార్‌లో 91 మంది ఉం డగా, వీరిలో 80 మందికే కిట్లు సరఫరా చేశారు. ఇక మెహిదీపట్నంలో 364 మందికి 320 మందికే అందజేశారు. కూకట్‌పల్లిలో 365 మంది ఉంటే, వీరిలో 283 మందికే కిట్లు సరఫరా చేశారు.  

బ్లాక్‌ మార్కెట్లో ఆ మందులు 
కరోనా వైరస్‌ నియంత్రణకు ఇప్పటి వరకు ఎలాంటి వాక్సిన్‌ రాలేదు. అసింప్టమాటిక్, మైల్డ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా మేరకు సాధారణ యాంటిబయాటిక్‌(జలుబు, దగ్గుకు అజిత్రోమైసిన్, జ్వరానికి డోలో 650, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్‌ సీ,ఈ,డీ సహా జింకోవిట్‌ వంటి మల్టీవిటమిన్‌) మందులు వాడుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు తలెత్తిన అత్యవసర బాధితులకు తాత్కాలిక ఉపశమనం కోసం వాడే రెమిడెసివియర్, ఫావిఫెరావిడ్, డెక్సామెథాసన్‌ ఫోర్‌ ఎంజీ, టోలిసిజుమబ్‌లు మార్కెట్లో దొరకడం లేదు. అపోలో, మెడిప్లస్‌ వంటి ప్రముఖ మెడికల్‌ షాపుల్లోనూ ఇవి అందుబాటులో లేవు. కొన్ని ఏజెన్సీలు మార్కెట్లో వీటికి కృత్తిమ కొరత సృష్టించి, గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ ఈ మందులు లేక పోవడంతో అత్యవసర పరిస్థితిల్లో బాధితులు మధ్య వర్తుల సహాయంతో వీటిని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎప్పటికపుడు ఆయా తయారీ కంపెనీలు, సరఫరా ఏజెన్సీలపై నిఘా ఉంచాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement