బాన్సువాడ: కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మత్తు పదార్థాలను దిగుమతి చేసుకొంటూ, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. క్లోరల్ హైడ్రేట్‌తోపాటు ఇతర మత్తు పదార్థాలను మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని, వాటిని కల్లు కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మత్తు పదార్థాల నిల్వలున్న ప్రాంతాలు ఆబ్కారీ అధికారులకు తెలిసినా, నెలనెల అందే మామూళ్లను పుచ్చుకొని, దాడులు నిర్వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై వారు స్పందించడం లేదు.
తనిఖీలు శూన్యం
గత బుధవారం నిజాంసాగర్ మండలం గోర్గల్‌లో భారీగా క్లోరల్ హైడ్రేట్ నిల్వలను స్వాధీనం చేసుకొన్న విషయం విదితమే. క్లోరల్ హైడ్రేట్, డైజోఫారం, అల్ఫా జోలం లాంటి మత్తు పదార్థాల నిల్వలు సరిహద్దు మండలాలలో భారీగానే ఉన్నట్లు స్పష్టమైంది. మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వీటిని దిగుమతి చేసుకొంటున్నట్లు తెలుస్తోంది.
మద్నూర్‌లో ఎస్‌ఎన్‌ఏ రోడ్డుపై రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఎకై ్సజ్ శాఖ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ, వాటిలో తనిఖీలు సరిగా నిర్వహించకపోవడంతో మత్తు పదార్థాలు మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటికి తోడు జుక్కల్, మద్నూర్ మండలా ల సరిహద్దులలో ఉన్న అక్రమ మార్గాల ద్వారా సైతం మత్తు పదార్థాలను అర్ధరాత్రి వేళ తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్రలోని దెగ్లూర్, నాందేడ్ ప్రా ంతాల నుంచి క్లోరల్ హైడ్రేట్ బస్తాలను తీసుకువస్తున్నారు. పత్తి, పప్పు దినుసులు, కిరాణవస్తువులను తీసుకువచ్చే లారీల్లో క్లోరల్ హైడ్రేట్ బస్తాలను తరలిస్తున్నట్లు తెలిసింది.
ఆదాయం ఘనమే
మహారాష్ట్రలో 30 కిలోల క్లోరల్ హైడ్రేట్ బస్తా ధర సుమారు రూ. ఏడు వేలు కాగా, ఇక్కడికి తీసుకువచ్చి రూ. తొమ్మిది వేల నుంచి రూ.పది వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్ మండలాలలోని మారుమూల గ్రామాలలో వీటిని నిల్వ చేస్తున్నారు. కోళ్ల ఫారములు, పశువుల పాకలు, దట్టమైన అడవులు, పూరి గుడిసెలలో నిల్వ చేస్తూ, కల్లు కాంట్రాక్టర్లతో మిలాఖాత్ అవుతూ ఈ మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్కొక్క బస్తాపై రూ. మూడు వేల వరకు సంపాదిస్తుండడంతో పలువురికి ఈ అక్రమార్జన కలిసివస్తోంది. అక్రమంగా తెస్తోన్న మత్తు పదార్థాలను బాన్సువాడ, బోధన్, నిజామా బాద్, కామారెడ్డి, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఆబ్కారీ సిబ్బంది నామమాత్రపు దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మస్తుగా ‘మత్తు’ దందా
Published Sun, Nov 30 2014 3:14 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement