Toxic substances
-
ఆ ప్రోటీన్‌తో దీర్ఘాయుష్షు?
వయసు పెరిగే కొద్దీ మన శరీర కణాల్లో సత్తువ సన్నగిల్లుతుంది. విషతుల్యమైన పదార్థాలు ఎక్కవ అవుతూంటాయి. ఫలితంగా జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు. ఈ విషయం మనకందరికీ తెలుసు. కానీ శరీరంలో పెరిగిపోయే విషపదార్థాలు ఎప్పటికప్పుడు నాశనమైపోతూంటే? అబ్బో.. అద్భుతమైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అయితే ఈ అద్భుతాన్ని సాధించడం ఎలా? స్టాన్‌ఫర్డ్ బర్న్‌హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరి ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ మార్గం కనుక్కున్నారు. మనుషుల్లో కాదుగానీ.. కొన్ని రకాల పురుగులు ఒక ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఎక్కువ కాలం బతుకుతున్నట్లు వీరు గుర్తించారు. పీ62 అని పిలుస్తున్న ఈ ప్రొటీన్ విషతుల్యమన కణ ప్రొటీన్లను గుర్తించి నాశనమయ్యేలా చేస్తూండటం దీనికి కారణం. కణాల్లోని చెత్త చెదారాన్ని తొలగించేందుకు ఉన్న ఆటోఫేగీ వ్యవస్థను బలోపేతం చేస్తే జీవితకాలం పెరుగుతుందని ఇప్పటికే చాలా పరిశోధనలు రుజువు చేశాయని ఈ ప్రొటీన్ ద్వారా ఆటోఫేగీ బలోపేతమవుతోందని మెలేన్ హాన్సెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. నిన్నమొన్నటివరకూ శాస్త్రవేత్తలు ఈ కణ రీసైక్లింగ్ శరీరం మొత్తమ్మీద ఒకేలా ఉంటుందని అంచనావేశారుగానీ.. పీ62 ప్రొటీన్ వాడకం మొదలుకొని కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయని తాజా పరిశోధన ద్వారా తెలిసింది. పీ62 కణాల్లోని మైటోకాండ్రియా, విషతుల్యమైన ప్రొటీన్లను రీసైకిల్ చేసేందుకు తరలిస్తాయని మెలేన్ వివరించారు. ఈ పరిశోధన ద్వారా అల్జైమర్స్ వంటి వ్యాధులకు కొత్త చికిత్స లభిస్తుందని అంచనా. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
కొంచెం పుచ్చుకుంటే.. మెదడుకు మేలేనట!
మితంగా పుచ్చుకుంటే మద్యం వల్ల మెదడుకు మేలే జరుగుతుందని అంటున్నారు రోచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. తక్కువ స్థాయిలో తీసుకునే మద్యం మెదడులో పేరుకుపోయే బీటీ అమైలాయిడ్ వంటి విష పదార్థాలు బయటకు పంపేందుకు దోహదపడుతుందని , తద్వారా వాపు/మంట తగ్గి మెదడు పనితీరు మెరుగవుతుందని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ద్వారా స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలంపాటు మద్యం ఎక్కువగా తీసుకోవడం నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని వీరు గతంలోనే నిరూపించగా.. తాజా అధ్యయనంలో కొన్ని ఎలుకలకు తక్కువ మోతాదులో ఎథనాల్ అందించి.. వాటి మెదళ్లలో వచ్చే మార్పులను పరిశీలించారు. అస్సలు మద్యం తీసుకోని ఎలుకల కంటే కొద్దిమోతాదులో తీసుకునే వాటిలో మెదడులోని మలినాలను తొలగించేందుకు ఉపయోగపడే సెంట్రల్ స్పైనల్ ఫ్లూయిడ్స్ వేగంగా పనిచేసినట్లు తెలిసింది. మెదడు కదలికలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా మద్యం తీసుకోని.. తక్కువ తీసుకున్న ఎలుకల పనితీరు ఒకేలా ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఈ ప్రయోగాల్లో తక్కువ మోతాదు మద్యమంటే.. రోజుకు రెండున్నర పెగ్గులుగా తీర్మానించారు! -
ముంచుకొస్తున్న గ్లైఫొసేట్ ముప్పు!
నేలతల్లికి ఎప్పుడూ లేని కష్టం వచ్చిపడింది. ఎక్కడో అమెరికాలోనే, బ్రెజిల్‌లోనో, అర్జెంటీనాలోనో కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కలుపు నిర్మూలన మందు వల్ల భూమి ఆరోగ్యానికి, పర్యావరణానికి, మనుషులు, పశువుల ఆరోగ్యానికి పెనుముప్పు వచ్చి పడింది.. ఆ పెనుముప్పు పేరే.. కలుపు మందు.. గ్లైఫొసేట్! దీన్ని పిచికారీ చేస్తే ఎంత పచ్చగా ఉన్న మొక్కయినా నిలువునా మాడి మసై పోతుంది. చట్ట ప్రకారం అయితే.. తేయాకు తోటల్లో తప్ప మరే పంట లేదా తోటలోనూ గ్లైఫొసేట్ కలుపు మందును వాడకూడదు. అటువంటిది, ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 15 లక్షల ఎకరాల్లో ఈ కలుపు మందును వాడుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 అనే జన్యుమార్పిడి పత్తిని తెలిసో తెలియకో నాటిన రైతులంతా గ్లైఫొసేట్‌ను తమ పొలాల్లో పిచికారీ చేస్తున్నారు. ఈ రకం పత్తి మొక్కపై గ్లైఫొసేట్ చల్లినా అది చనిపోకుండా ఉండేలా, కేవలం కలుపు మొక్కలన్నీ మాడిపోయేలా (ఈ అమెరికన్ హైబ్రిడ్ పత్తి రకానికి) జన్యుమార్పిడి చేశారని సమాచారం. తల్లి పాలల్లోనూ అవశేషాలు.. గ్లైఫొసేట్ అత్యంత ప్రమాదకరమైన కటిక విష రసాయనం. ఇది కేన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల నాడే ప్రకటించింది. దీన్ని పంట పొలాల్లో పిచికారీ చేయటమే కారణం. అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల్లో విచ్చలవిడిగా దీన్ని తట్టుకునే పత్తి తదితర జన్యుమార్పిడి పంటలు సాగవుతున్నాయి. ఫలితంగా అక్కడి భూములు, భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. చివరికి తల్లి పాలల్లోనూ, మనుషుల మూత్రంలోనూ గ్లైఫొసేట్ అవశేషాలు ఉన్నాయని తేలింది. కలుపు మందు చల్లితే భూమికి ఏమవుతుంది? పంట భూమి (అది మాగాణి అయినా, మెట్ట/చల్క భూమి అయినా సరే) ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆ మట్టిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉండాలి. అప్పుడే నేల సజీవంగా, స్వయం సమృద్ధంగా ఉంటుంది. చెంచాడు మట్టిలో ఈ భూతలంపై మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. ఇలాంటి పొలంలో కలుపు మందును చల్లితే ఆ భూమిపైన కలుపు మొక్కలతోపాటు భూమి లోపలి సూక్ష్మజీవరాశి, వానపాములు కూడా పూర్తిగా నశిస్తాయి. నిర్జీవంగా మారిన నేల గట్టిపడి చట్టుబండవుతుంది. నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కలుపు మందుల వాడకం ఎక్కువ కావడం వల్ల రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజానీకం ఆరోగ్యం మరింత ప్రమాదంలో చిక్కుకుంటాయి. జగమొండి కలుపు మొక్కలు! కలుపు మొక్కల నిర్మూలనకు గ్లైఫొసేట్ మందును కొన్నేళ్లు చల్లుతూ ఉంటే∙‘జగమొండి కలుపు మొక్కలు’ పుట్టుకొస్తాయి. అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా.. తదితర దేశాల్లో ఇదే జరిగింది. తోటకూర వంటి సాధారణ జాతుల మొక్కలు కూడా గ్లైఫొసేట్ దెబ్బకు మొండి కలుపు చెట్లుగా అవతారం ఎత్తాయి. అమెరికాలోని సుమారు 6 కోట్ల ఎకరాల్లో వీటి బెడద తీవ్రంగా ఉందని యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్(యు.సి.ఎస్.) నివేదిక తెలిపింది. ఎంత తీవ్రమైన కలుపు మందులు చల్లినా ఈ కలుపు మొక్కలు చావకపోగా, ఆరేడు అడుగుల ఎత్తు పెరుగుతుండటంతో అక్కడి రైతులు సతమతమవుతున్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కలుపు మందులు కనిపెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విషమిస్తున్నాయే తప్ప మెరుగవ్వటం లేదని యు.సి.ఎస్. శాస్త్రవేత్తలు తెలిపారు. కలుపు నిర్మూలనకు పైపాటు దుక్కికి అయ్యే ఖర్చులు గ్లైఫొసేట్ వల్ల తొలి దశలో తగ్గినప్పటికీ.. క్రమంగా జగమొండి కలుపుల బెడద ఎక్కువ అవుతున్నదని వారు తెలిపారు. గ్లైఫొసేట్ కలుపు మందును తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలను, ఏళ్ల తరబడి ఏక పంటలుగా విస్తారంగా సాగు చేస్తుండటమే ఈ ఉపద్రవానికి మూలకారణమని శాస్త్రవేత్తలు తేల్చటం విశేషం. అమెరికా తదితర దేశాల పొలాల్లో గ్లైఫొసేట్ కలిగించిన పెనునష్టం మన పాలకులకు, రైతులకు కనువిప్పు కావాలి. భూములు నాశనమవుతాయి.. కలుపు మందును తట్టుకునే బీజీ–3 రకం పత్తి పంటకు మన దేశంలో ప్రభుత్వ అనుమతి లేదు. గ్లైఫొసేట్ అత్యంత ప్రమాదకరమైన కలుపు మందు. పంట భూములు నాశనమవుతాయి. భూముల్లో సూక్ష్మజీవరాశి, వానపాములు, జీవవైవిధ్యం నశిస్తుంది. మన దేశంలో తేయాకు తోటల్లో తప్ప మరే పంటలోనైనా దీన్ని వాడటం నిషిద్ధం. పత్తి సాగు విస్తీర్ణంలో ఈ ఏడాది 20% వరకు బీజీ–3 రకం పత్తిని అక్రమంగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కన్నుగప్పి విత్తనాలమ్మిన వారు, సాగు చేస్తున్నవారు, విత్తనాలు సేకరించి నిల్వచేసే వారు.. అందరూ నేరస్థులే. గ్లైఫొసేట్‌ను తట్టుకునే జన్యుమార్పిడి పంటలను అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల్లో సాగు చేస్తున్నారు. అక్కడ మొండి కలుపు మొక్కలు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. మన దగ్గర రైతులకు సంతోషం ఒకటి, రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం నిలవదు. దీర్ఘకాలంలో పర్యావరణం దెబ్బతింటుంది. ఇది కేన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. సీఐసీఆర్ పత్తి హైబ్రిడ్లే ప్రత్యామ్నాయం. – డా. కేశవులు, డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ సంస్థ, హైదరాబాద్ -
విషానికి విషమే విరుగుడు
ఒంట్లో వేడి చేసినప్పుడు వేడి చేసే పదార్థాలను వాడటం ద్వారా రోగికి ఉపశమనం కలిగించవచ్చని పురాతన వైద్యులు నమ్మేవారు. ఆర్మీనియా మైనర్, పోంటుస్ రాజు ఆరవ మిత్రిడేట్స్‌కు ఎవరైనా ఈ సూత్రం చెప్పారో లేదో తెలీదు గాని, ఆయన ఇదే సూత్రాన్ని పాటించాడు. క్రీస్తుపూర్వం 134లో జన్మించిన ఆరవ మిత్రిడేట్స్ యవ్వనారంభంలోనే అధికారంలోకి వచ్చాడు. కుట్రలు, కుతంత్రాలకు నిలయమైన రాజరికం అనుదిన గండంగా ఉండేది. ఎవరైనా తనపై విషప్రయోగం చేస్తారేమోనని అనుమానం. విషానికి విషమే విరుగుడని భావించాడు. రకరకాల విషాలను కొద్ది మోతాదుల్లో తీసుకునేవాడు. ఏకంగా తన కోటలోని ఉద్యానవనంలో విషపు మొక్కల తోటనే పెంచాడు. భయంకరమైన విషసర్పాలు, తేళ్లు, విషపు పుట్టగొడుగులు, రకరకాల విష పదార్థాలను భారీగా నిల్వచేసేవాడు. రకరకాల విషాలు రకరకాల విరుగుడు సమ్మేళనాలను విష పదార్థాలతోనే తయారు చేసేవాడు. వాటిని స్వల్ప మోతాదుల్లో తీసుకుంటూ శరీరాన్ని విష దుర్భేద్యంగా చేసుకున్నాడు. తన సూత్రం విజయవంతమైన సంగతి మిత్రిడేట్స్‌కు అవసాన దశలో అవగతమైంది. మిత్రిడేట్స్ను అతడి కొడుకే గద్దెదించాడు. ఆ పరిస్థితిలో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎలాంటి విషమూ అతడిపై పనిచేయలేదు. చివరకు తనను పొడిచి చంపేయాల్సిందిగా ఒక సైనికుడిని బతిమాలుకున్నాడు. అప్పటి నుంచి విషాలకు విరుగుడు పదార్థాలకు ‘మిత్రిడేట్స్’ అనే మాట వాడుకలోకి వచ్చింది. -
కే ఎఫ్‌సీని నిషేధించాలి
బాలల హక్కుల సంఘం డిమాండ్ - ఈ కొలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు - మలమూత్ర విసర్జకాల్లో ఉండే పాథోజెన్స్ ఉనికి బట్టబయలు.. - తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులకు కారణమయ్యే విష పదార్థాలు.. - తెలంగాణ రాష్ట్ర ఆహార నాణ్యత పరిశోధన సంస్థ పరీక్షల్లో వెల్లడి పంజగుట్ట: చూడగానే నోరూరించే కేఎఫ్‌సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్)లో అత్యంత విషతుల్యమైన అవశేషాలు ఉన్నట్లు వెల్లడైందని బాలల హక్కులసంఘం స్పష్టం చేసింది. మలమూత్ర విసర్జకాల్లో ఉండే పాథోజెన్స్తో ఈకొలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు తెలంగాణ ఆహార నాణ్యత పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారనైనట్టు సంఘం సభ్యులు తెలిపారు . వీటిని తిన డం వల్ల తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నట్టు చెప్పారు. మ్యాగీ వివాదం మొదలైన తర్వాత కేఎఫ్‌సీ కెంటకీ ఫ్రైడ్ చికెన్‌లో నాణ్యత ప్రమాణాలపై తమకు అనుమానం వచ్చిందన్నారు. ఇటీవల హిమాయత్‌నగర్‌లోని కేఎఫ్సీలో చికెన్‌ను కొనుగోలు చేసి తెలంగాణ ఆహార నాణ్యత పరిశోధన సంస్థకు పంపగా, ఇందులో ఆరోగ్యానికి హాని చేసే అత్యంత విష పదార్థాలు ఉన్నట్లు తేలిందన్నారు. పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తూ పరోక్షంగా వారి చావుకు కారణం అవుతున్న కేఎఫ్‌సీ కెంటకీ ఫ్రైడ్ చికెన్ విక్రయాలపై నిషేధం విధించి, నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ, ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ సుజాతాస్టీఫెన్ మాట్లాడుతూ కేఎఫ్‌సీ చికెన్‌లో టైఫాయిడ్, ప్యారాటైఫాయిడ్, అమిబియాసిస్, విరోచనాలకు కారణమవుతున్న విష పదార్థాలు ఉన్నాయని, వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు. దీనికి 68 శాతం సాల్మోనెల్లా బ్యాక్టీరియానే కారణమన్నారు. -
మస్తుగా ‘మత్తు’ దందా
బాన్సువాడ: కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా మత్తు పదార్థాలను దిగుమతి చేసుకొంటూ, అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. క్లోరల్ హైడ్రేట్తోపాటు ఇతర మత్తు పదార్థాలను మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని, వాటిని కల్లు కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మత్తు పదార్థాల నిల్వలున్న ప్రాంతాలు ఆబ్కారీ అధికారులకు తెలిసినా, నెలనెల అందే మామూళ్లను పుచ్చుకొని, దాడులు నిర్వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై వారు స్పందించడం లేదు. తనిఖీలు శూన్యం గత బుధవారం నిజాంసాగర్ మండలం గోర్గల్‌లో భారీగా క్లోరల్ హైడ్రేట్ నిల్వలను స్వాధీనం చేసుకొన్న విషయం విదితమే. క్లోరల్ హైడ్రేట్, డైజోఫారం, అల్ఫా జోలం లాంటి మత్తు పదార్థాల నిల్వలు సరిహద్దు మండలాలలో భారీగానే ఉన్నట్లు స్పష్టమైంది. మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వీటిని దిగుమతి చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. మద్నూర్‌లో ఎస్ఎన్ఏ రోడ్డుపై రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, ఎకై ్సజ్ శాఖ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ, వాటిలో తనిఖీలు సరిగా నిర్వహించకపోవడంతో మత్తు పదార్థాలు మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటికి తోడు జుక్కల్, మద్నూర్ మండలా ల సరిహద్దులలో ఉన్న అక్రమ మార్గాల ద్వారా సైతం మత్తు పదార్థాలను అర్ధరాత్రి వేళ తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్రలోని దెగ్లూర్, నాందేడ్ ప్రా ంతాల నుంచి క్లోరల్ హైడ్రేట్ బస్తాలను తీసుకువస్తున్నారు. పత్తి, పప్పు దినుసులు, కిరాణవస్తువులను తీసుకువచ్చే లారీల్లో క్లోరల్ హైడ్రేట్ బస్తాలను తరలిస్తున్నట్లు తెలిసింది. ఆదాయం ఘనమే మహారాష్ట్రలో 30 కిలోల క్లోరల్ హైడ్రేట్ బస్తా ధర సుమారు రూ. ఏడు వేలు కాగా, ఇక్కడికి తీసుకువచ్చి రూ. తొమ్మిది వేల నుంచి రూ.పది వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్ మండలాలలోని మారుమూల గ్రామాలలో వీటిని నిల్వ చేస్తున్నారు. కోళ్ల ఫారములు, పశువుల పాకలు, దట్టమైన అడవులు, పూరి గుడిసెలలో నిల్వ చేస్తూ, కల్లు కాంట్రాక్టర్లతో మిలాఖాత్ అవుతూ ఈ మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క బస్తాపై రూ. మూడు వేల వరకు సంపాదిస్తుండడంతో పలువురికి ఈ అక్రమార్జన కలిసివస్తోంది. అక్రమంగా తెస్తోన్న మత్తు పదార్థాలను బాన్సువాడ, బోధన్, నిజామా బాద్, కామారెడ్డి, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఆబ్కారీ సిబ్బంది నామమాత్రపు దాడులు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.