
ఒంట్లో వేడి చేసినప్పుడు వేడి చేసే పదార్థాలను వాడటం ద్వారా రోగికి ఉపశమనం కలిగించవచ్చని పురాతన వైద్యులు నమ్మేవారు. ఆర్మీనియా మైనర్, పోంటుస్ రాజు ఆరవ మిత్రిడేట్స్‌కు ఎవరైనా ఈ సూత్రం చెప్పారో లేదో తెలీదు గాని, ఆయన ఇదే సూత్రాన్ని పాటించాడు. క్రీస్తుపూర్వం 134లో జన్మించిన ఆరవ మిత్రిడేట్స్ యవ్వనారంభంలోనే అధికారంలోకి వచ్చాడు. కుట్రలు, కుతంత్రాలకు నిలయమైన రాజరికం అనుదిన గండంగా ఉండేది. ఎవరైనా తనపై విషప్రయోగం చేస్తారేమోనని అనుమానం. విషానికి విషమే విరుగుడని భావించాడు. రకరకాల విషాలను కొద్ది మోతాదుల్లో తీసుకునేవాడు. ఏకంగా తన కోటలోని ఉద్యానవనంలో విషపు మొక్కల తోటనే పెంచాడు. భయంకరమైన విషసర్పాలు, తేళ్లు, విషపు పుట్టగొడుగులు, రకరకాల విష పదార్థాలను భారీగా నిల్వచేసేవాడు.
రకరకాల విషాలు రకరకాల విరుగుడు సమ్మేళనాలను విష పదార్థాలతోనే తయారు చేసేవాడు. వాటిని స్వల్ప మోతాదుల్లో తీసుకుంటూ శరీరాన్ని విష దుర్భేద్యంగా చేసుకున్నాడు. తన సూత్రం విజయవంతమైన సంగతి మిత్రిడేట్స్‌కు అవసాన దశలో అవగతమైంది. మిత్రిడేట్స్‌ను అతడి కొడుకే గద్దెదించాడు. ఆ పరిస్థితిలో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎలాంటి విషమూ అతడిపై పనిచేయలేదు. చివరకు తనను పొడిచి చంపేయాల్సిందిగా ఒక సైనికుడిని బతిమాలుకున్నాడు. అప్పటి నుంచి విషాలకు విరుగుడు పదార్థాలకు ‘మిత్రిడేట్స్’ అనే మాట వాడుకలోకి వచ్చింది.