'తిట్టించుకుని.. మళ్లీ అక్కడికే వెళ్లారు'
హైదరాబాద్: సీనియర్ నేత డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారు గురువారం మీడియాతో మాట్లాడారు. పదవి లేకుండా డీఎస్ నెల రోజులు కూడా ఉండలేక పోయారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
డీఎస్ ను దూషించిన కేసీఆర్ వద్దకే ఆయన వెళ్లారని చెప్పారు. పదే పదే పెద్ద పదవులు తనకే ఉండాలనడం డీఎస్ స్థాయి వ్యక్తికి సరికాదని పేర్కన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్ కు ఉన్నత పదవులు ఇచ్చిందని, ఆయనకు పార్టీలో సముచిత గౌరవమే దక్కిందని వివరించారు. అన్ని పదవులూ అనుభవించి పార్టీని వీడడాన్ని ప్రజలెవరూ హర్షించరని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
డీఎస్ పార్టీని వీడడం బాధాకరమని, ఆయనది అనాలోచిత నిర్ణయమని జానారెడ్డి అన్నారు. ఆయన రాజీనామా ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను అవమానించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా తాను పార్టీ సిద్ధాంత ప్రకారమే నడుచుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ ను విలీనం చేసే పనిని హైకమాండ్ ఎవరికి అప్పగించిందో తెలియదని, ఆ పనిని పార్టీ నేతలు సరిగా డీల్ చేయలేదని డీఎస్ ఎలా వ్యాఖ్యానించారో ఆయనే వివరించాలని జానారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ లో డీఎస్కు పదవులు దక్కాయే తప్ప, అవమానాలు పడ్డారనడం వాస్తవం కాదని భట్టి విక్రమార్క అన్నారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే డీఎస్ టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.