కుంటాల(ఆదిలాబాద్ జిల్లా): పొలానికి ఎరువును తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి ఒక వృద్ధుడు మరణించాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం అంబగంటి గ్రామం సమీపంలో జరిగింది. ఈ ఘటన వివరాలు.. గ్రామానికి చెందిన ఒట్టి రాజన్న(75) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే గురవారం ఉదయం పంట పొలానికి ఎరువును తరలించేందుకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలోని పొలాల్లో బోల్తాపడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.