ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఈ-బిడ్డింగ్ విధానాన్ని శుక్రవారం వ్యాపారులు వ్యతిరేకించారు. ఈ విధానం అమలుతో తమకు ఇబ్బంది కలుగుతోందని పేర్కొంటూ పత్తి జెండాపాటకు హాజరుగాకుండా వ్యాపారులు భీష్మించుకు కూర్చున్నారు. గురువారం సాయంత్రం కొందరు వ్యాపారులు మార్కెట్‌లో కొనుగోలు చేసిన పత్తిని ఈ-బిడ్డింగ్‌లో నమోదు చేయించకుండా బయటకు తరలించారు.
ఈ వ్యవహారంపై మార్కెట్ కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ శుక్రవారం ఆరా తీసి ఆయా వ్యాపారులను సరుకు తరలింపుకు సంబంధించిన వివరాలను ఈ-బిడ్డింగ్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఆది నుంచి ఈ-బిడ్డింగ్‌ను వ్యతిరేకిస్తున్న వ్యాపారులు మరోసారి ఏకమై తామకు ఈ విధానం నచ్చలేదని, దీనిని మార్చాలని డిమాండ్ చేశారు. ఈ-బిడ్డింగ్ పనులు తాము చేయలేమని, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో ఈ-బిడ్డింగ్ విధానం సక్రమంగా అమలు చేయకుండా పత్తిలోనే అమలు చేయడం సరికాదని వ్యాపారులు కార్యదర్శితో వాదించారు. ఈ-బిడ్డింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉదయం నిర్వహించిన జెండా పాటకు గైర్హాజయ్యారు.
ఈ వ్యవహారం తెలుసుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, చిన్ని కృష్షారావు మార్కెట్‌కు చేరుకొని కార్యదర్శితో ఈ-బిడ్డింగ్ విధానంపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-బిడ్డింగ్‌ను అమలు చేస్తున్నామని, దానిలో మార్పేమీ ఉండదని కార్యదర్శి స్పష్టం చేశారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించరాదని, వెసులుబాటు కలిగించాలని వారు కోరారు. సర్దుబాటు ధోరణితో వ్యవహరించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరడంతో కార్యదర్శి ఆ మేరకు అంగీకరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావడంతో శుక్రవారం మార్కెట్‌కు సరుకు తక్కువగా వచ్చింది.
మార్కెట్ ఉద్యోగులకు ఎన్నికల డ్యూటీలు ఉండడంతో తక్కువ సంఖ్యలో ఉద్యోగులు మార్కెట్ విధులు నిర్వహించారు. ఇదే అదునుగా వ్యాపారులు ఈ-బిడ్డింగ్‌పై తమ వ్యతిరేకతను చూపినట్లు కూడా మార్కెట్‌లో చర్చించుకున్నారు. ఈ వ్యవహారం జరుగుతున్న సమయంలో అమ్మకానికి సరుకు తెచ్చిన రైతులు కొందరు తమ సరుకు కొనుగోలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెట్ అధికారులను కోరారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో చర్చలు పూర్తయిన తర్వాత 11 గంటల సమయంలో జెండాపాట నిర్వహించారు. జెండాపాటలో వ్యాపారులు యధావిధిగా పాల్గొన్నారు. ఈ-బిడ్డింగ్‌ను వ్యతిరేకించిన వ్యాపారుల్లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, పత్తి ఖరీదుదారుడు గొడవర్తి శ్రీనివాసరావు, సత్యంబాబు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
ఈ-బిడ్డింగ్‌ను వ్యతిరేకించిన వ్యాపారులు
Published Sat, Apr 12 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM
Advertisement