
ట్రాఫిక్ న్యాయస్థానాలు వచ్చేస్తున్నాయ్!
► ‘జైలు శిక్ష ఉల్లంఘనల’ చార్జ్‌షీట్లు అక్కడే
►కొత్త కోర్టుల కోసం ప్రతిపాదనలు
►ప్రాథమికంగా అంగీకరించిన హైకోర్టు సీజే
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్ని ఒకప్పుడు జరిమానాతోనే సరిపెట్టేవారు. 2011 నుంచి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చార్జ్‌షీట్లు వేస్తూ... జైలు శిక్షలు పడేలా చేస్తున్నారు. ఆ తర్వాత మితిమీరిన వేగంతో వాహనాలను నడిపే వారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వ్యక్తులు, ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారితో పాటు అధిక మొత్తంలో ఈ–చలాన్లు బకాయి ఉండి చిక్కినవారి పైనా అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీరిలో అనేక మందికి కోర్టులు జైలు శిక్షలు సైతం విధిస్తున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో పూర్తి మార్పు తీసుకురావడానికి ఈ చర్యలు పెంచడంతో పాటు మరికొన్ని ప్రమాదకర ఉల్లంఘనల్ని ఈ జాబితాలో చేర్చాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.
సరిపడినన్ని కోర్టులు లేక...
ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేతృత్వంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేసే ట్రాఫిక్ కోర్టు ఒకటే ఉంది. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నేతృత్వంలో 18 కోర్టులున్నాయి. అయితే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ట్రాఫిక్ సంబంధిత అంశాలతో పాటు వరకట్న వేధింపుల వంటి ఇతర కేసుల్నీ విచారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అభియోగపత్రాలు పడిన ట్రాఫిక్ ఉల్లంఘనుల కోసం ఉదయం 8.30 నుంచి 10.30 వరకు మార్నింగ్ కోర్ట్స్‌గా ఇవి పనిచేస్తున్నాయి. ఫలితంగా పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ కేసుల విచారణ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కేసుల నమోదు, అభియోగపత్రాల దాఖలు పెంచితే పెండెన్సీ పెరిగిపోయే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు.
సాయంత్రవేళా రెండు గంటలు..
ఈ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి... ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యల్ని వివరించారు. వీటిపై సానుకూలంగా స్పందించిన సీజే... కోర్టుల సంఖ్య పెంచడానికి అంగీకరించారు. తాత్కాలికంగా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు ఉదయంతో పాటు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. పోలీసులు భవనాలు సమకూరిస్తే 18 కోర్టులూ నిర్వరామంగా పనిచేసేలా, ప్రత్యేకంగా రెండు ట్రాఫిక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని న్యాయ విభాగం హామీ ఇచ్చింది. ఈ అంశంపై నగర పోలీసు కమిషనర్ సైతం సానుకూలంగా స్పందించడంతో భవనాల వేట మొదలైంది.