
గత జనవరిలో అత్తాపూర్‌లో వేగంగా వెళుతున్న బైక్ ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. అయితే ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించడంతో చిన్న చిన్న గాయాలతో క్షేమంగాబయటపడ్డాడు’మే నెలలో బాలానగర్‌లో వేగంగా వెళుతున్న బైక్ ముందున్న కారును ఢీకొట్టడంతో ప్రశాంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తలకుతీవ్ర గాయం కావడంతో ఘటనాస్థలిలోనే దుర్మరణం చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే అతడి ప్రాణాలు కూడా దక్కేవి’
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సగానికి పైగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న కేసులే. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే నెలవరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 10,48,934 ఈ–చలాన్లు జారీ చేయగా, అందులో 5,72,237(54.55 శాతం) కేసులు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపినవే కావడం గమనార్హం. మొత్తం ఈ–చలాన్ల ద్వారా రూ.38,18,96,205 జరిమానా విధించగా, అందులో దాదాపు రూ.8 కోట్లు హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు విధించినదే.
ప్రాణాలు పోతున్నా మారరు..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మే నెలవరకు జరిగిన 1090 రోడ్డు ప్రమాదాల్లో 600 వరకు ఘటనలకు (55 శాతం) ద్విచక్ర వాహనదారులే కారణం. ఆయా ప్రమాదాల్లో 281 మంది మృతి చెందగా, వారిలో 182 మంది బైక్ రైడర్లే(64.7 శాతం) ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలోనూ పలువురు హెల్మెట్ ధరించనందునే తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హెల్మెట్ ధరించిన వారు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. ‘హెల్మెట్ లేకుండా బైక్ నడిపినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగితే తలకు గాయాలై కొద్ది సెకన్లపాటు స్పృహ కోల్పోవడం, తలనొప్పి, అయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, దృష్టి మసకబారడం, చెవిలో హోరున శబ్దం, రుచి తెలియకపోవడం, బాగా ఆలసటగా ఉన్నట్లు అనిపించడం, ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణలో మార్పులు కనిపిస్తాయ’ని వైద్యులు పేర్కొన్నారు. తీవ్ర గాయా లైతే తలనొప్పి, వాంతులు, వికారం, ఫిట్స్, మాట ముద్దగా రావడం, ఏదైనా అయోమయం లో బలహీనత లేదా తిమ్మిర్లు, ఆలోచనలకు చేతు లు సమన్వయం లోపించడం, తీవ్రమైన అయో మయం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఇక హెల్మెట్ పెట్టుకున్నా కింద బెల్ట్ సక్రమంగా పెట్టుకోకుంటే ప్రమాద సమయాల్లో ఊడిపోయితలకు గాయాలవుతున్నాయి. పూర్తి స్థాయిలో సక్రమంగా ధరించినప్పుడే ప్రమాదవేళరక్షణ లభిస్తుందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు.
సెల్..హెల్..
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్‌కాల్ వస్తే బండి నడుపుతూనే మాట్లాడటానికి వాహనచోదకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ఐదు నెలల్లో 4341 మంది ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ఐదు నెలల్లో ఏకంగా 24,396 కేసులు నమోదయ్యాయి. దీనికితోడు మైనర్ డ్రైవింగ్ కేసులూ భారీగా పెరుగుతున్నాయి. మాదాపూర్ జోన్‌లో 784, బాలానగర్ జోన్‌లో 186, శంషాబాద్ జోన్‌లో 185 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడిపిన 6,955 మందికి ట్రాఫిక్ పోలీసులు ఈ–చలాన్లు జారీ చేశారు.
తప్పించుకోలేరు...
ట్రాఫిక్ జంక్షన్లలోని సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ పోలీసులు చేతిలోని కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు అసంపూర్తి, అసమగ్ర నంబర్ ప్లేట్లతో రోడ్లపై చక్కర్లు కొడుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్పాట్ ఈ–చలాన్లు జారీ చేసి వారి భరతం పడుతున్నారు. ఇలా ఈ ఐదు నెల్లో ఏకంగా 16,239 నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలకు జరిమానా విధించారు. ఐటీ కారిడార్‌తో పాటు బాలానగర్, శంషాబాద్ జోన్‌లలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన 28,810 ఆటోవాలాలకు ఈ–చలాన్లు జారీ చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకున్న 1,310 వాహనాలకు కూడా జరిమానా విధించామన్నారు.
డ్రంకన్ డ్రైవర్లకు జైలే...
మద్యం తాగి వాహనం నడుపుతున్న డ్రంకన్ డ్రైవర్లను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఐదు నెలల్లో 8987 డ్రంకన్ డ్రైవర్లపై కేసులు నమోదుచేశారు. వీరిలో 2,418 మందికి ఒకటి నుంచి పది రోజుల పాటుజైలు శిక్ష పడింది.
జరిమానా విధిస్తున్నా మారడం లేదు...
వాహనచోదకులు ఎక్కువగా హెల్మెట్ లేకుండా బైక్ నడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. జరిమానాలు విధించినా తీరు మార్చుకోవడం లేదు. ఫలితంగా రోడ్డుప్ర మాదాలు జరిగితే తలకు తీవ్రగాయాలై మృత్యువాత పడుతున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉంటుండడంతో కళాశాలల్లో రోడ్డు ప్రమాదాలకు దారి తీసే పరిస్థితులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.–విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
Comments
Please login to add a commentAdd a comment