క్యాన్సర్ వీధిన పడేసింది
మెదక్ రూరల్ : క్యాన్సర్ వ్యాధి సోకి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ తన ఇంట్లో చనిపోతుందేమోనని భయపడి ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో తలదాచుకునేందుకు కనీసం పూరిపాకైనా లేకపోవటంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను ఆమె భర్త నడిరోడ్డుపై పడుకోబెట్టి గుండెలవిసెలా రోదిస్తున్నాడు. 'భగవంతుడా... నాలాంటి పాపపు రాత ఎవరికీ రావద్దు దేవుడా' అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామానికి కొంతదూరంలో పోచమ్మగుట్ట దేవాలయం ఉంది. దేవాలయానికి దగ్గర్లోనే రాములు, అంజమ్మ దంపతులు పూరిపాక నిర్మించుకుని ఉంటున్నారు. రెండేళ్ల క్రితం అంజమ్మకు క్యాన్సర్ వచ్చింది. దీంతో రాములు తలకు మించిన అప్పులు చేసి ఆస్పత్రులకు తిప్పాడు. ఈ క్రమంలోనే పోచమ్మ ఆలయం వద్ద వేసుకున్న పూరిపాక పూర్తిగా కూలిపోవటంతో కొన్ని నెలల క్రితం పేరూర్ గ్రామానికి వెళ్లి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొన్ని రోజులుగా అంజమ్మ పరిస్థితి విషమించింది. దీంతో తమ ఇంట్లో మరిణిస్తుందనే ఉద్దేశంతో ఇంటి యజమాని వారిని ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. దాంతో ఏం చేయాలో తోచక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భార్యను రాములు ఓ ఆలయం పక్కనే గల రోడ్డుపై పడుకోబెట్టి కన్నీటి పర్యంతమవుతున్నాడు.
ఆస్పత్రిలో చూపించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక, కనీసం మందుబిళ్లలకు డబ్బుల్లేక తన భార్య కళ్ల ముందే చస్తుంటే ఏం చేయలేని నిర్భాగ్యుడనయ్యానంటూ రాములు ఆవేదన చెందుతున్నాడు. చలించిన గ్రామ సర్పంచ్ ర్యావ సుగుణ కుమారుడు రాంచందర్‌రెడ్డి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో పూరిగుడిసెను నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.