tragic incident
-
నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్న వరుస విషాదాలు
నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నుంచి ఇప్పుడు తారకరత్న వరకు వరుస విషాదాలు నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. వారికి తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే మరికొందరు ఆసక్మికంగా మరణించడం నందమూరి కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చుతోంది. మొదటగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినీ నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 1996లో 'మామ కోడళ్ల సవాల్' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన హరిన్ చక్రవర్తి ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోసించారు. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఆయన్ను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. హరిన చక్రవర్తి సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వీ సైతం రోడ్ యాక్సిడెంట్లోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ 1962లో అరుదైన వ్యాధితో చనిపోయారు. ఆ సమయంలో ఇరుగు పొరుగు షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాకే ఇంటికి వెళ్లారట. కొడుకు మరణవార్తతో తీవ్రంగా కుంగిపోయిన ఆయన ఆ విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయమే పట్టిందట. 1996లో సీనియర్ ఎన్టీఆర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు సాయికృష్ణ 2004లో ఆకస్మికంగా మృతి చెందారు. 2014 లో ఎన్టీఆర్ మరో కుమారుడైన హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిర్మాతగా కొనసాగిన ఆయన నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక పెద్ద కుమారుడు జానకీరామ్ మరణించిన నాలుగేళ్లకు నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. ఓ అభిమాని వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతుండగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే కన్నుమూశారు.ఇక గతేడాది ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడడం ఎన్టీఆర్ కుటుంబాన్ని కలచివేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు తాజాగా తారకరత్న మరణం మరోసారి నందమూరి కుటుంబాన్ని కుదిపేసింది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న ఆయన గతరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇలా కొన్నాళ్లుగా వరుస విషాదాలతో నందమూరి కుటుంబానికి శాపంగా మారింది. -
ప్రకాశం జిల్లాలో రెండు విషాద ఘటనలు.. ఏడుగురు మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: జిల్లాలో ఒకేరోజు రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. బెస్తవారిపేట మండలం పెంచకలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ఆటోను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నాలుగు ఆవులు కూడా చనిపోయాయి. చదవండి: పుట్టింటికి పంపలేదని భర్తపై అలిగి.. ఇంట్లో ఎవరూలేని సమయంలో.. ఇదిలా ఉండగా, జిల్లాలోని చినగంజాం మండలం సోపిరాల రైల్వే గేటు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల వివరాలు తెలియాల్సి వుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విషాద యాత్ర
పన్నెండు రోజులు... కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం... అంతా సవ్యంగానే సాగింది. కాశీ వంటి తీర్థయాత్రలను విజయవంతంగా చేసుకుని వచ్చారు. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం నుంచి ఓ బస్సులో బయలుదేరిన వీరంతా బుధవారం ఉదయం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్దకు చేరుకున్నారు. సముద్రస్నానాలు చేశారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని చివరిగా సింహాద్రప్పన్నను దర్శించి ఇళ్లకు చేరాలనుకుని బయలుదేరారు. ఇన్నాళ్ల ప్రయాణం వల్ల వచ్చిన బడలిక... వాతావరణం చల్లగా ఉండటం... కాస్త కడుపులో ఆహారం పడటంతో... అంతా చిన్నగా కునుకు తీస్తున్నారు. ఇంతలో పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారు ప్రయాణిస్తున్న బస్సు పల్టీ కొట్టింది. ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. అంతా బస్సులోనే ఇరుక్కున్నారు. తేరుకుని చూసేసరికి గాయాలతో అందరి ఒళ్లూ రక్తసిక్తమై ఉంది. తమతో ప్రయాణిస్తున్న ఓ ముగ్గురు ప్రాణాలు వదిలారు. మరో 46మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ యలమంచిలి వాసుల విషాద యాత్ర. భోగాపురం (విజయనగరం జిల్లా), యలమంచిలి రూరల్, మాకవరపాలెం : సుదీర్ఘ యాత్ర సవ్యంగా సాగింది. కానీ చివరికొచ్చేసరికి విషాదం నింపింది. తమతో ప్రయాణిస్తున్న ముగ్గురు బస్సులోనే ప్రాణాలు కోల్పోగా 46 మంది తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. ఐకమత్యంగా వెళ్లిన వారంతా... ఒక్క సంఘటనతో కకావికలమయ్యారు. ఇదీ బుధవారం మధ్యాహ్నం భోగాపురం మండలం జాతీయ రహదారి పోలిపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఫలితం. యలమంచిలి, ఎస్.రాయవరం, మాకవరపాలెం, చిన్నగుమ్ములూరు, రాంబిల్లి, పోతిరెడ్డిపాలెం, జి.కోడూరు గ్రామాలకు చెందిన 43 మంది తోడుగా ఇద్దరు వంటపనివారను తీసుకుని ఈ నెల రెండో తేదీన కాశీయాత్రకు ఎస్ఎస్ టీఆర్ ట్రావెల్స్ బస్సులో బయలు దేరారు. పది రోజులపాటు దిగ్విజయంగా యాత్రలు పూర్తి చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లారేసరికి పూసపాటిరేగ సమీపానికి చేరుకోగానే చింతపల్లి వద్ద సముద్రంలో స్నానాలు చేసుకున్నారు. గోవిందపురంలో సంతోషిమాత, శివాలయం, కృష్ణమందిరం దర్శించుకున్నారు. అక్కడే వంటలు పూర్తి చేసుకుని భోజనాలు చేసి అక్కడినుంచి సింహాచలం వెళ్లి వరాహనర్సింహస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు పోలిపల్లి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ డివైడర్ వద్ద ఒక్కసారిగా యూ టర్న్ తీసుకునేందుకు ఆగగా... దాని వెనుక వస్తున్న లారీ బలంగా ఢీకొంది. ఆ ధాటికి అదుపు తప్పిన లారీ ఎదురుగా యాత్రికులతో వస్తున్న బస్సును ఢీకొంది. బస్సు రెండు పల్టీలు కొట్టి తలకిందులైంది. అనుకోని సంఘటనతో యాత్రికులంతా ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ప్రమాదం వార్త తెలుసుకున్న సీఐ రఘువీర్ విష్ణు, ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవే విస్తరణ పనులు చేపడుతున్న వారికి సమాచారం అందించి మూడు జేసీబీలను తీసుకువచ్చి లారీలో, బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు సీట్లలో ఇరుక్కుపోయి ఊపిరాడక పోతిరెడ్డి పాలేనికి చెందిన కరణం వెంకన్న (45), కోడూరుకు చెందిన భీశెట్టి అచ్చియ్యమ్మ (50), కృష్ణాపురానికి చెందిన కలగాని అప్పలనర్సి(52)లు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లా ఎస్పీ పాలరాజు ప్రమాద స్థలానికి చేరుకుని హైవే పెట్రోలింగ్, అంబులెన్స్, బొలెరో ఇలా అన్ని వాహనాల్లో క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. తగరపువలస ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో 28 మందిని, విశాఖ కేజీహెచ్‌లో 9మందిని, విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి 7గురిని తరలిం చారు. వారంతా ఆయా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వెల్లకట్టలేని గ్రామీణుల సేవలు ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న గ్రామస్తులు పరుగుపరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లా పాపలతో హాహాకారాలు చేస్తున్న యాత్రికులను స్థానిక యువకులు బస్సులోంచి బయటకు తీసుకువచ్చారు. వెంటనే గ్రామంలో ఉన్న పీహెచ్‌సీకి సమాచారం అందడంతో వైద్యాధికారి సునీల్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని గాయాలపాలై రక్తం కారుతూ ఉన్న వారికి ప్రథమ చికిత్స చేశారు. వారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు. స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపు నుంచి సిబ్బంది వచ్చి కట్టర్ల ద్వారా బస్ సీట్లను, బాడీని కట్ చేసి ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయ ధర్మకర్త కర్రోతు పైడిరాజు విద్యుత్ సరఫరాను అందించారు. స్థానికులు జనరేటర్ తీసుకువచ్చి, రోడ్డుపైన పడిఉన్న క్షతగాత్రులకు ఫ్యాను సౌకర్యం కలగజేసి ఉపశమనాన్ని అందించారు. -
తండ్రి పాడె మోస్తూ కుప్పకూలిన కొడుకు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రాణం కంటే మిన్నగా చూసుకున్నాడు... పెంచి పెద్దవాడిని చేసి ఒక ఇంటివాడిని చేశాడు.. అలాంటి ప్రేమానురాగాలతో చూసుకున్న తండ్రి కన్నుమూయడాన్ని ఆ కొడుకు తట్టుకోలేకపోయాడు.. ఆయన అంతిమయాత్రలోనే తానూ తనువు చాలించాడు.. చివరకు తండ్రి చితి పక్కనే ఆ తనయుడికి అంత్యక్రియాలు చేయాల్సి వచ్చింది. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరిజిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది. పిఠాపురం వస్తాదు వీధికి చెందిన జాగు అశోక్‌బాబుకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పిత్రికి తరలించారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు. అంతిమ సంస్కారాల కోసం ఆయన భౌతిక కాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. రెండవ కుమారుడు శివప్రసాద్ తండ్రి పాడెను మోస్తూ కొంత దూరం వెళ్లగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పాడె మోస్తూన్నవాడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో అంతిమ యాత్రను అక్కడే ఆపి అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తండ్రి అశోక్, కొడుకు శివప్రసాద్‌లకు ఒకేసారి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. శివప్రసాద్ తండ్రి పట్ల ఎక్కువ ప్రేమానురాగాలతో ఉండేవాడని, ఆయన మృతిని తట్టుకోలేక తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఏమీ తినకుండా ఉండిపోయి తీవ్రంగా కుమిలిపోయాడని బంధువులు తెలిపారు. ఒకేసారి తండ్రీకొడుకుల మృతితో వారి బంధువులు గుండెలవిసేలా రోదిస్తుంటే వారిని ఆపడం ఎవరితరం కాలేదు.. శివప్రసాద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. -
గుండెను మెలిపెట్టే విషాదమిది..
ముంబయి: మహారాష్ట్రలో గుండెను మెలిపెట్టే విషాదం చోటుచేసుకుంది. అక్కడి నీటి కరువుకు భరించలేని ఎండ తోడై ఓ బాలిక ప్రాణాన్ని హరించింది. తన ఇంటికోసం సుదూరంగా ఉన్న ఓ నీటి పంపు నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు అదే పనిగా ఎండలో తిరగడమే ఆ బాలిక ప్రాణం పోవడానికి కారణమైంది. తీవ్ర వడదెబ్బ తగిలి బాలిక మృత్యువాత పడింది. బీడ్ జిల్లాలోని సబాకడ్ గ్రామంలో తీవ్ర నీటి కరువు ఉంది. దీంతో ఆ ఊరికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న చేతిపంపు ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ పంపునకు రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎండ తీవ్రత కూడా పట్టించుకోకుండా ఎప్పుడు వీలయితే అప్పుడు నీళ్లు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఐదో తరగతి చదువుతున్న యోగితా అశోక్ దేశాయ్ (12) అనే బాలిక తన ఇంట్లోకి మంచి నీళ్లకోసం నడి ఎండలో పలుమార్లు తిరిగింది. అలా తిరుగుతూనే అనూహ్యంగా ఓ సారి కుప్పకూలింది. ఆ వెంటనే ఒకే సారి తీవ్ర అనారోగ్యానికి లోనై ప్రాణాలు విడిచింది. డిహైడ్రేషన్ సమస్య ఏర్పడి ఫలితంగా గుండెపోటు వచ్చి ఆ బాలిక ప్రాణాలు విడిచిందని వైద్యులు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో కరువు సమస్య తలెత్తడం ఇది నాలుగోసారి. -
క్యాన్సర్ వీధిన పడేసింది
మెదక్ రూరల్ : క్యాన్సర్ వ్యాధి సోకి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళ తన ఇంట్లో చనిపోతుందేమోనని భయపడి ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో తలదాచుకునేందుకు కనీసం పూరిపాకైనా లేకపోవటంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను ఆమె భర్త నడిరోడ్డుపై పడుకోబెట్టి గుండెలవిసెలా రోదిస్తున్నాడు. 'భగవంతుడా... నాలాంటి పాపపు రాత ఎవరికీ రావద్దు దేవుడా' అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. మెదక్ మండల పరిధిలోని పేరూరు గ్రామానికి కొంతదూరంలో పోచమ్మగుట్ట దేవాలయం ఉంది. దేవాలయానికి దగ్గర్లోనే రాములు, అంజమ్మ దంపతులు పూరిపాక నిర్మించుకుని ఉంటున్నారు. రెండేళ్ల క్రితం అంజమ్మకు క్యాన్సర్ వచ్చింది. దీంతో రాములు తలకు మించిన అప్పులు చేసి ఆస్పత్రులకు తిప్పాడు. ఈ క్రమంలోనే పోచమ్మ ఆలయం వద్ద వేసుకున్న పూరిపాక పూర్తిగా కూలిపోవటంతో కొన్ని నెలల క్రితం పేరూర్ గ్రామానికి వెళ్లి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొన్ని రోజులుగా అంజమ్మ పరిస్థితి విషమించింది. దీంతో తమ ఇంట్లో మరిణిస్తుందనే ఉద్దేశంతో ఇంటి యజమాని వారిని ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. దాంతో ఏం చేయాలో తోచక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భార్యను రాములు ఓ ఆలయం పక్కనే గల రోడ్డుపై పడుకోబెట్టి కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఆస్పత్రిలో చూపించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక, కనీసం మందుబిళ్లలకు డబ్బుల్లేక తన భార్య కళ్ల ముందే చస్తుంటే ఏం చేయలేని నిర్భాగ్యుడనయ్యానంటూ రాములు ఆవేదన చెందుతున్నాడు. చలించిన గ్రామ సర్పంచ్ ర్యావ సుగుణ కుమారుడు రాంచందర్‌రెడ్డి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో పూరిగుడిసెను నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. -
ఆలయ ఉత్సవంలో అపశ్రుతి
మారియమ్మన్ ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీ మొత్తంలో నిల్వ ఉంచిన బాణసంచాకు మంటలు వ్యాపించి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొల్లిమలైలో సోమవారం వేకువ జామున చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు. సేలం:నామక్కల్ జిల్లా కొల్లిమలైలోని ఉరప్పురం గ్రామం లో మారియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. వేకువ జామున అమ్మవారికి కత్తిని సమర్పించే ఘట్టం జరిగింది. ఇందుకుగాను కత్తిని ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. రాత్రి జరిగే వేడుక కోసం ముందుగానే బాణ సంచాలు ఓ గదిలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచారు. ఊరేగింపులో భాగంగా పేలిన ఓ బాణ సంచా నేరుగా ఆ గదిలో పడింది. దీంతో ఆ గదిలో ఉన్న బాణసంచా మొత్తానికి మంటలు అంటుకున్నాయి. ఆ పేలుళ్ల దాటికి ఆ పరిసరాలు దద్దరిల్లిపోయాయి. ఆ గదికి పక్కనే ఉన్న వాళ్లు పరుగులు తీశారు. సుమారు అరగంట పాటుగా బాణ సంచాలు పేలడంతో ఆ గది నేల మట్టమైంది. ఆ పరిసరాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ గ్రామానికి చేరుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మంటలు అదుపు చేయడంతో ఆ పరిసరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ బాణ సంచాలు పేలడం, ఆ గది నేలమట్టం కావడంతో ఆ శిథిలాల కింద ఇద్దరు మృతి చెంది ఉండడం వెలుగు చూసింది. తీవ్రంగా గాయపడి శిథిలాల కిందపడి ఉన్న మరో నలుగురిని ఆగమేఘాలపై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందుకున్న నామక్కల్ జిల్లా కలెక్టర్ దక్షిణామూర్తి నేతృత్వంలో అధికారుల బృందం ఆ గ్రామాన్ని సందర్శించింది. బాధితులకు సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు గల కారణాలను విచారించారు. మృతి చెందిన వారిలో అదే గ్రామానికి చెందిన కదిర్ వేల్(6), చిన్న స్వామి(40)గా గుర్తించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం నామక్కల్ మార్చురీకి తరలించిన వాలవందినాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.