నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు నుంచి ఇప్పుడు తారకరత్న వరకు వరుస విషాదాలు నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. వారికి తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే మరికొందరు ఆసక్మికంగా మరణించడం నందమూరి కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చుతోంది.
మొదటగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినీ నిర్మాతగా రాణిస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 1996లో 'మామ కోడళ్ల సవాల్' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన హరిన్ చక్రవర్తి ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోసించారు. నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే ఆయన్ను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. హరిన చక్రవర్తి సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వీ సైతం రోడ్ యాక్సిడెంట్‌లోనే కన్నుమూశారు.
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ 1962లో అరుదైన వ్యాధితో చనిపోయారు. ఆ సమయంలో ఇరుగు పొరుగు షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాకే ఇంటికి వెళ్లారట. కొడుకు మరణవార్తతో తీవ్రంగా కుంగిపోయిన ఆయన ఆ విషాదం నుంచి బయటకు రావడానికి చాలా సమయమే పట్టిందట. 1996లో సీనియర్ ఎన్టీఆర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు సాయికృష్ణ 2004లో ఆకస్మికంగా మృతి చెందారు.
2014 లో ఎన్టీఆర్ మరో కుమారుడైన హరికృష్ణ పెద్ద కొడుకు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. నిర్మాతగా కొనసాగిన ఆయన నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక పెద్ద కుమారుడు జానకీరామ్ మరణించిన నాలుగేళ్లకు నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు.
ఓ అభిమాని వివాహానికి హాజరై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతుండగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే కన్నుమూశారు.ఇక గతేడాది ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడడం ఎన్టీఆర్ కుటుంబాన్ని కలచివేసింది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు తాజాగా తారకరత్న మరణం మరోసారి నందమూరి కుటుంబాన్ని కుదిపేసింది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న ఆయన గతరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇలా కొన్నాళ్లుగా వరుస విషాదాలతో నందమూరి కుటుంబానికి శాపంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment