బదిలీల దుమారం
పైరవీలకు పెద్దపీట వేశారని తహసీల్దార్ల ఆగ్రహం
రద్దు చేయాలని డిమాండ్
తహసీల్దార్ల బదిలీ వ్యవహారం జిల్లా యంత్రాంగంలో దుమారం రేపుతోంది. రెండ్రోజులు సుదీర్ఘంగా కసరత్తు చేసి గత బుధవారం సాయంత్రం జిల్లాలో 30మంది తహసీల్దార్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే బదిలీల తంతు పారదర్శకంగా జరగలేదని, పైరవీలకు పెద్దపీట వేశారంటూ పలువురు తహసీల్దార్లు ఆందోళనకు దిగారు. నిబంధనలకు పాతరేస్తూ.. ఒక వర్గానికి అనుకూలురైన తహసీల్దార్లకు పట్టణ ప్రాంతంలో పోస్టింగులిచ్చారంటూ రచ్చకు దిగారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలోనూ ఇదే తరహాలో బదిలీలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు ఆయా బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా తహసీల్దార్ల సంఘం నేతలు రాష్ట్ర సంఘ నేతలను వెంటబెట్టుకుని మంత్రుల వద్దకు వెళ్లారు.
రద్దు చేయకుంటే ఉద్యమమే..
బదిలీలను వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులతో పాటు తహసీల్దార్ల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బదిలీలను రద్దు చేసి ఎన్నికలకు ముందు పనిచేసిన స్థానాల్లోనే తమకు పోస్టింగ్ ఇవ్వాలంటున్నారు. ఎన్నికలకు ముందు ఏయే స్థానాల్లో పనిచేసిన ఎంపీడీఓలకు తాజాగా అవే స్థానాలు కట్టబెట్టడాన్ని పేర్కొంటూ.. తమకూ పనిచేసిన స్థానాలనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీని, మంత్రి కేటీఆర్‌లను కలిసి పరిస్థితి వివరించారు. రెండ్రోజులు గడువిస్తే పరిస్థితి చక్కదిద్దుతామని అమాత్యులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, రెండ్రోజుల్లో తేల్చకుంటే తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు, టీఎన్‌జీఓలు, నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నేతలంతా సమ్మెకు దిగుతారని టీజీఓ జిల్లా అధ్యక్షుడు కె.రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు.