మీ సేవలిక చాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్తరాష్ట్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నతాధికారుల బదిలీలకు తెరలేచింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పీఎస్. ప్రద్యుమ్నను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఆయన స్థానం లో జాయింట్ కలెక్టర్ డి. వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలను అప్పగించారు. కలెక్టర్‌తో పాటు బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను సైతం బదిలీ చేశారు. ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు.
పదిమాసాల ప్రద్యుమ్న పాలన
నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా 2013 ఆగస్టు 30న బాధ్యతలు స్వీకరించిన పవనసూర్య ప్రద్యుమ్న పాలనపై తనదైన ముద్ర వేశారు. నిజాయితీ గల అధికారిగా జిల్లాలో అవినీతి, అక్రమాలను రూపుమాపడం కోసం కృషి చేశారు. సుమారు 10నెలల పాటు జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త కలెక్టర్‌ను నియమించే వరకు జేసీ వెంకటేశ్వర్‌రావు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.
ఇసుక మాఫియాపై హరినారాయణన్ ఉక్కుపాదం
బోధన్ సబ్‌కలెక్టర్ యువ ఐఏఎస్ అధికారి ఎం.హరినారాయణన్ కూడా 2013 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. డివిజన్ ఇసుక మాఫియాపై ఆయన ఉక్కుపాదం మోపారు. యువ అధికారిగా ప్రజలతో మమేకమై.. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజాయతీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. హరినారాయణన్ స్థానంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (ఎంఐపీ)పీడీ రాంబాబుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
ఎస్సారెస్పీకి ఆనందరావు
రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు డిప్యూటీకలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొత్తగా ప్రత్యేక అధికారిని నియమించింది. ఇక నుంచి ఎస్సారెస్పీ స్పెషల్ ఆఫీసర్‌గా డిప్యూటీ కలెక్టర్ వి.ఆనందరావు వ్యవహరించనున్నారు.
ఆప్షన్ల మేరకే బదిలీలు
కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సహజంగా జిల్లాస్థాయి అధికారుల స్థానచలనం తప్పదని అందరూ ఊహించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించే మంత్రులు కోరుకున్న వారిని ఉన్నతాధికారులుగా నియమిస్తుండటం పరిపాటే. దీనికి తోడు ఉమ్మడి రాష్ర్టంలో పనిచేసిన అఖిల భారత(సివిల్)సర్వీసు అధికారులుగా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, సబ్ కలెక్టర్ హరినారాయణన్‌లు రెండు నెలల క్రితం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఆప్షన్ ఇచ్చారు.
పీఎస్ ప్రద్యుమ్న కర్ణాటక క్యాడర్‌కు చెందిన వారు. ఐఏఎస్‌గా తొలినాళ్లలో ఎక్కువ కాలం ఆయన ఆంధ్ర ప్రాంతంలోనే పనిచేశారు. ఈయనకు కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ మన జిల్లాలోనే. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పనిచేసేందుకు సుముఖత తెలిపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తమిళనాడుకు చెందిన 2010-11బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎం.హరినారాయణన్ బోధన్ సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ట్రైనీ సబ్‌కలెక్టర్‌గా వ్యవహరించిన ఆయన మొదటి పోస్టింగ్ బోధన్. ఆయన తన సొంతరాష్ట్రం తమిళనాడు సరిహద్దులో ఉండే ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పోస్టింగ్ కోసం ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం.
జిల్లాకు గిరిజాశంకర్, విజయ్‌కుమార్‌ల పేర్లు
కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. జేసీకే అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎంపీలు, మంత్రి, ఎమ్మెల్యేలను ఎవరికీ వారుగా సంప్రదించినట్లు చెప్తున్నారు.
మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గిరిజా శంకర్ పేరు వినిపిస్తుండగా.. కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం చెబుతున్నట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతానికే చెందిన మరో ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌గా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు జిల్లాకు వస్తారా.. లేక కొత్తవాళ్లు రావొచ్చా.. అన్న చర్చ సాగుతోంది.