Officials transfer
-
సీఎం కుప్పం పర్యటన వేళ బది‘లీల’లు
చిత్తూరు, సాక్షి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండ్రోజులపాటు ఈ పర్యటన జరగనుంది. అయితే.. అంతకు ముందే అక్కడి అధికార యంత్రాంగాన్ని మార్చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేపు (మంగళవారం) సీఎం చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు. ఆ పర్యటనకు ఒకరోజు ముందు.. నియోజకవర్గానికి సంబంధించి పోలీసు అధికారులు ఆఘమేఘాల మీద బదిలీ అయ్యారు. కుప్పం సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలను వీఆర్‌కు పంపిస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు.కుప్పం అర్బన్, రూరల్ సీఐలు రమణ, ఇశ్వర్‌రెడ్డిలను అనంతపురం వీఆర్‌కు బదిలీ చేశారు. అలాగే కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మికాంత్, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్లబుదుగురు ఎస్ఐ సుమన్‌ను చిత్తూరు వీఆర్‌కు బదిలీ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన టైంలో జరిగిన ఈ ఆకస్మిక బదిలీలు పోలీస్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పోలీస్ శాఖనే కాదు.. మరికొన్ని విభాగాల్లోనూ ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, నేరుగా సీఎంవో నుంచే సంబంధిత శాఖలకు ఈ ఆదేశాలు అందుతున్నాయని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. .. ఇలాంటి బదిలీలు ఊహించినవే. కానీ, ఇప్పటికే వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ బదిలీల ద్వారా రాబోయే రోజుల్లో మరింత పేట్రేగిపోయే అవకాశం లేకపోలేదని మేధావులు విశ్లేషిస్తున్నారు. -
ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం
భువనేశ్వర్: ఇటీవలే ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బహనాగ వద్ద మూడు రైళ్లు ఒక్కదానినొకిటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత అధికారులపై రైల్వే బోర్డు చర్యలకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సౌత్ ఈస్టర్ రైల్వేస్‌కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై బోర్డు వేటు వేసింది. సిగ్నలింగ్, ఆపరేషన్స్, సేఫ్టీ విభాగాలను చూసే ఈ అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇక, వేటు పడిన వారిలో ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ శుజాత్ హష్మీ, ఎస్ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కేసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండీ ఓవైసీ ఉన్నారు. అయితే, ఇది సాధారణ బదిలీల్లో భాగమేనని అధికారులు వెల్లడించారు. జేఈ ఇంటి సీల్ వేసిన సీబీఐ మరోవైపు.. ఒడిషా రైలు ప్రమాదం తర్వాత భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబం కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సీబీఐ అధికారులు హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి తాళం ఉన్నది గమనించక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. ఇది కూడా చదవండి: ఎదురొచ్చి మరీ మోదీకి బైడెన్ దంపతుల సాదర స్వాగతం.. ప్రత్యేక విందు -
ఐటీ దాడులపై ముందే లీకేజీలు!
సాక్షి, హైదరాబాద్: ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో అధికారుల ఆకస్మిక బదిలీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని కీలక వ్యక్తులు, ప్రముఖ సంస్థలకు ఐటీ దాడులు, సోదాలు, కేసుల వివరాలను లీక్ చేయడమే దీనికి కారణమని తీవ్రంగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఐటీ విభాగంలో పనిచేస్తున్న 85 మంది ఉన్నతాధికారులను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో ప్రిన్సిపల్ కమిషనర్, చీఫ్ కమిషనర్, అదనపు కమిషనర్లతోపాటు కొన్ని కీలక విభాగాలకు అధిపతులుగా ఉన్న వారిని సైతం వివిధ రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కీలక విభాగాలకు బాధ్యత వహిస్తున్న కొందరు అధికారులు బదిలీ అయ్యారు. రహస్యాల చేరవేతే కారణమా? రాష్ట్రంలో ఇటీవల బెంగళూర్, ఢిల్లీ, ముంబైకి చెందిన ఐటీ బృందాలు వాసవి, సుమధుర, ఫీనిక్స్తోపాటు పలు సంస్థల్లో సోదాలు నిర్వహించాయి. ఇది రాజకీయంగా అనేక రకాల చర్చలకు దారితీసింది. అవి ప్రముఖ రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్న, బినామీ కంపెనీలనే ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి ఈ కంపెనీల్లో లావాదేవీల వ్యవహారం, పన్నులు చెల్లించకపోవడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనితో కేంద్రం రాష్ట్ర ఐటీ అధికారుల ద్వారా కాకుండా బెంగళూర్, ముంబై, ఢిల్లీలకు చెందిన బృందాల ద్వారా తనిఖీలు చేయించి, కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో సదరు ఐటీ సోదాలకు సంబంధించిన రహస్య సమాచారం లీక్ అయిందని, అక్రమాలు జరుగుతున్నా రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదని కేంద్రానికి ఫిర్యాదులు అందినట్టు సమాచారం. దీనితో కేంద్రం అంతర్గతంగా విచారణ జరిపిందని.. సంబంధిత అధికారులను మూడు నెలల క్రితమే ఢిల్లీకి పిలిచి మందలించిందని ఆదాయ పన్ను శాఖలో చర్చ జరుగుతోంది. పది రోజుల క్రితం సంబంధిత అధికారులను మళ్లీ ఢిల్లీకి పిలిపించి.. వారి తీరుపై వచ్చిన నివేదికను చూపినట్టు సమాచారం. కీలకమైన విభాగంలో పనిచేస్తూ సోదాలు, ఇతర రహస్య సమాచారాన్ని రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులకు లీక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బదిలీలు జరిగాయని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రెండు నెలల ప్రయాస వృథా? రాష్ట్రంలో పలువురు ప్రముఖులు సాగిస్తున్న బినామీ దందాలను గుర్తించాలని తాము భావిస్తే.. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు వారికి లోపాయి కారీగా సహకరించడాన్ని కేంద్రం తీవ్రంగా భావించిందని ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కొన్ని సంస్థల అక్రమాలపై రెండు నెలల పాటు నిఘా పెట్టి వివరాలు సేకరిస్తే.. సోదాలపై లీకేజీతో అంతా వృధా అయిందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవహారాలను తేల్చే పనిని ఇతర రాష్ట్రాల్లోని అధికారులకు అప్పగించి, మళ్లీ రంగంలోకి దిగాలని కేంద్రం భావించిందని పేర్కొంటున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా జరిగే బదిలీల్లో.. రాష్ట్ర అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టు చెబుతున్నాయి. -
రాజ్యసభ, విధాన్ పరిషత్ ఎన్నికలు.. సీఎం కీలక ఆదేశాలు
సాక్షి, ముంబై: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, అధికారులు, కిందిస్ధాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జూన్ 30వ తేదీ వరకు నిలిపివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్ధేశించారు. అందుకు సంబంధించిన సర్క్యులర్ సామాన్య పరిపాలన విభాగం జారీ చేసింది. త్వరలో రాజ్యసభ, విధాన్ పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల కారణంగా ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురికావద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి బదిలీ ప్రక్రియ నిలిపివేసి ఉండవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. ఏటా వేసవి సెలవులు వచ్చాయంటే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్, మేలో ఈ బదిలీ ప్రక్రియ ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతుంది. కొందరు ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం బదిలీకాగా, మరికొందరు అనేక సంవత్సరాల నుంచి ఒకేచోట తిష్టవేయడంవల్ల అటోమేటిక్‌గా బదిలీ అవుతుంది. మరికొందరు వివిధ కారణాలు చూపుతూ తమను బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకుంటారు. మంత్రులు, ఉన్నతాధికారులతో పైరవీలు చేయించుకుంటారు. ముఖ్యంగా అధిక శాతం ఉద్యోగులు పీడబ్ల్యూడీ, జలవనరులు, ఆర్థిక, గ్రామాభివృద్ధి, గృహనిర్మాణ, రవాణ, వ్యవసాయ తదితర కీలక శాఖల్లో తమను బదిలీ చేయాలని భారీ స్ధాయిలో లాబీయింగ్ చేస్తుంటారు. వీటన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఏటా మే 31 వరకు బదిలీల ప్రకియ పూర్తి చేస్తారు. కానీ ఈ ఏడాది అకస్మాత్తుగా సామాన్య పరిపాలన విభాగం బదిలీ ప్రక్రియ జూన్ 30వ తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయడం ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మూడు భాగస్వామ్య పార్టీలతో కూడిన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం నడుస్తోంది. మూడు పార్టీల ప్రభుత్వం కావడంతో అధికారులు, ఉద్యోగుల బదిలీలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జూన్ 30వ వరకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. చదవండి: అత్యంత ఖరీదైన వెజిటేబుల్ ఇదే...ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే అసంతృప్తి ఎదురుకావద్దనే... ఇదిలాఉండగా ఆరు రాజ్యసభ స్ధానాలకు, 10 విధాన్ పరిషత్ స్ధానాలకు జూన్ 20వ తేదీ వరకు ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపే ప్రభుత్వ ఉన్నతాధికారుల బదిలీ అయితే ఎమ్మెల్యేల నుంచి అనేక ఫిర్యాదులు వస్తాయి. తమకు ఫలానా తహసీల్దార్ కావాలని, ఫలానా బీడీఓ కావాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం మే 31లోపు బదిలీ ప్రక్రియ పూర్తిచేస్తే ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజ్యసభ, విధాన్ పరిషత్ స్ధానాలను ఎమ్మెల్యేలే గెలిపించాల్సి ఉంటుంది. దీంతో ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురికాకూడదన్న ఉద్దేశంతో బదిలీలు వాయిదా వేయాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై మూడు పార్టీల మంత్రులు సైతం సానుకూలత ప్రదర్శించారని విశ్వసనీయ సమాచారం. -
ఒకేసారి 15 మందికి..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ల నుంచి మొదలుకొని స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2 స్థాయి మున్సిపల్ కమిషనర్ల వరకు స్థానభ్రంశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఒకేసారి 15 మందికి స్థానభ్రంశం కల్పించారు. త్వరలో మరిన్ని బదిలీలు జరిగే అవకాశముంది. మున్సిపల్ బదిలీలు ఇవే.. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జె.శంకరయ్య నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా.. జీహెచ్ఎంసీలోనే అదనపు కమిషనర్‌గా ఉన్న సీహెచ్ నాగేశ్వర్‌ను మీర్‌పేట కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జీహెచ్ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ (వెటర్నరీ) రామకృష్ణారావు.. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ పి.రవీందర్ సాగర్ మిర్యాలగూడ మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డిని నిర్మల్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. సీడీఎంఏ సూపరింటెండెంట్ ఎస్.వి.జానకిరామ్ సాగర్‌ను గద్వాల మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించగా.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కమిషనర్ కె.జయంత్కుమార్రెడ్డిని షాద్‌నగర్‌కు బదిలీ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్‌రెడ్డిని ఆదిబట్ల మున్సిపాలిటీకి బదిలీ చేయగా.. గుండ్లపోచంపల్లికి కమిషనర్‌గా డి.లావణ్యకు పోస్టింగ్ ఇచ్చారు. టీయూఎఫ్ఐడీసీ ఎండీ ఎంఎన్ఆర్ జ్యోతిని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమిషనర్‌గా.. సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ కె.ఫల్గున్కుమార్ను మణికొండ మున్సిపాలిటీకి కమిషనర్‌గా నియమించారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ ఎస్.జయంత్‌ను సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్‌గా నియమించగా.. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ మహ్మద్ యూసఫ్‌ను ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించారు. మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా సఫీయుల్లా నియమితులయ్యారు. డీఎల్పీఓ ఎ.జ్యోతిరెడ్డిని జవహర్‌నగర్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. -
ఏపీలో కొనసాగుతున్న అధికారుల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా లా సెక్రటరీ వెంకట రమణను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కార్యదర్శి వెంకటేశ్వరరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రోటోకాల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్‌బాబు డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖకు ఆయనను తిరిగి పంపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు కార్యదర్శి ప్రసన్న వెంకటేష్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఇప్పటికే బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్న భోజన పధకంపై తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ఈరోజు అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి శాఖలవారీగా సమీక్షలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. (చదవండి: సీఎం కార్యాలయంలో అధికారుల బదిలీ) -
జేసీ హరిజవహర్‌లాల్ బదిలీ
నల్లగొండ : జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రీతిమీనా రానున్నారు. హరిజవహర్‌లాల్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన గురువారం తన విధుల నుంచి రిలీవ్ అవుతుండగా, కొత్త జాయింట్ కలెక్టర్‌గా ప్రీతిమీనా రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. బదిలీపై వెళుతున్న నల్లగొండ అర్బన్ జిల్లాలో 340కిపైగా స్కూల్ కాంప్లెక్స్‌లున్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పనితీరు, పాఠశాలల మానిటరింగ్, గుణాత్మక విద్య అందించడం, విద్యార్థుల నమోదు పెంచడం, తదితర కార్యక్రమాల నిర్వహణకు కాంప్లెక్స్‌కు ఒక సీఆర్పీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో సీఆర్పీ సగటున 10 పాఠశాలల పనితీరును పర్యవేక్షిస్తున్నాడు. జిల్లా ప్రస్తుతం 313 మంది సీఆర్పీలు పనిచేస్తున్నారు. నియామకాలు ఇలా.... 2012నవంబర్ 6వ తేదీన క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను నియమించారు. బీఈడీ, టెట్ పాసైన వారే అర్హులనడంతో కేవలం 53 మంది అర్హులకు అవకాశం లభించింది. గతంలో అనియ త విద్యాబోధకులు, సూపర్వైజర్లుగా పనిచేసిన వారికి అవకాశం కల్పిం చాలని చాలాకాలం నుంచి ఉన్న డిమాండ్ మేరకు వారికి కూడా అవకాశం ఇచ్చారు. మిగతా వారిని మెరిట్ ప్రాతిపదికన నేరుగా నియమించారు. టెట్‌లో ఉత్తీర్ణత, డిగ్రీ, బీఈడీలో మెరిట్‌ను రోస్టర్ రిజర్వేషన్‌ను పరిగణనలోకి తీసుకుని, సంబంధిత స్కూల్‌కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలున్న గ్రామానికి చెందిన వ్యక్తికే అవకాశం కల్పించారు. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున అభ్యర్థులను పిలిచి తుది జాబితా ద్వారా నియామకం చేశారు. వివిధ కారణాలతో జిల్లాలో దాదాపు 30 ఖాళీలు ఏర్పడ్డాయి. సగటున 10 నుంచి 13 స్కూల్ కాంప్లెక్స్‌లను పర్యవేక్షించాల్సి ఉండగా, కొన్ని మండలాల్లో సీఆర్పీల ఖాళీల వల్ల ఉన్నవారే 20కిపైగా కాంప్లెక్స్‌లకు వెళ్లాల్సి వస్తున్నది. ఎంఆర్పీలకు ప్రత్యామ్నాయంగా... గతంలో మండల రిసోర్స్ పర్సన్లు (ఎంఆర్పీ) నిర్వహించిన బాధ్యతలనే ప్రస్తుతం సీఆర్పీలు కూడా నిర్వర్తిస్తున్నారు. గుణాత్మక విద్యనందించే కార్యక్రమాల నిర్వహణ, పాఠశాలల బలోపేతానికి ప్రయత్నించడం, ఎప్పటికప్పుడు పాఠశాలల నివేదికలను మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ)లకు చేరవేయడానికి అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎంఈఓలు, హైస్కూల్ హెడ్మాస్టర్లకు సహాయకులుగా పనిచేస్తున్నారు. ఎంఈఓలు ఆదేశించిన ప్రకారంగా కొన్నిచోట్ల పాఠశాలలకు వెళ్లి బోధన కూడాచేస్తున్నారు. విద్యావలంటీర్లు/అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం లేకపోవడం, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లిన చోట సీఆర్పీల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని దాదాపు 30 స్కూల్ కాంప్లెక్స్‌లకు సీఆర్పీల అవసరముంది. నియామకాలకు అవకాశం కల్పించాలని జిల్లా అధికారులు ఉన్నతాధికారులను కోరారు. అవకాశం లేదు సీఆర్పీలుగా కొత్తవారిని నియమించేందుకు అవకాశం లేదని సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఈ నెల 24వ తేదీన జీఓనం:464 ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త వారికి అవకాశం లేకపోగా ఉన్న సీఆర్పీలను కుదించాలని అందులో పేర్కొన్నారు. సగటున ఒక్కో సీఆర్పీకి 18 స్కూల్ కాంప్లెక్స్‌ల బాధ్యతలు ఇస్తూ 218 మందికి కుదించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
మీ సేవలిక చాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కొత్తరాష్ట్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నతాధికారుల బదిలీలకు తెరలేచింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పీఎస్. ప్రద్యుమ్నను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా పేర్కొన్నారు. ఆయన స్థానం లో జాయింట్ కలెక్టర్ డి. వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలను అప్పగించారు. కలెక్టర్‌తో పాటు బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌ను సైతం బదిలీ చేశారు. ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. పదిమాసాల ప్రద్యుమ్న పాలన నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా 2013 ఆగస్టు 30న బాధ్యతలు స్వీకరించిన పవనసూర్య ప్రద్యుమ్న పాలనపై తనదైన ముద్ర వేశారు. నిజాయితీ గల అధికారిగా జిల్లాలో అవినీతి, అక్రమాలను రూపుమాపడం కోసం కృషి చేశారు. సుమారు 10నెలల పాటు జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త కలెక్టర్‌ను నియమించే వరకు జేసీ వెంకటేశ్వర్రావు ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఇసుక మాఫియాపై హరినారాయణన్ ఉక్కుపాదం బోధన్ సబ్‌కలెక్టర్ యువ ఐఏఎస్ అధికారి ఎం.హరినారాయణన్ కూడా 2013 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. డివిజన్ ఇసుక మాఫియాపై ఆయన ఉక్కుపాదం మోపారు. యువ అధికారిగా ప్రజలతో మమేకమై.. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. నిజాయతీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. హరినారాయణన్ స్థానంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (ఎంఐపీ)పీడీ రాంబాబుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎస్సారెస్పీకి ఆనందరావు రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు డిప్యూటీకలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొత్తగా ప్రత్యేక అధికారిని నియమించింది. ఇక నుంచి ఎస్సారెస్పీ స్పెషల్ ఆఫీసర్‌గా డిప్యూటీ కలెక్టర్ వి.ఆనందరావు వ్యవహరించనున్నారు. ఆప్షన్ల మేరకే బదిలీలు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సహజంగా జిల్లాస్థాయి అధికారుల స్థానచలనం తప్పదని అందరూ ఊహించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించే మంత్రులు కోరుకున్న వారిని ఉన్నతాధికారులుగా నియమిస్తుండటం పరిపాటే. దీనికి తోడు ఉమ్మడి రాష్ర్టంలో పనిచేసిన అఖిల భారత(సివిల్)సర్వీసు అధికారులుగా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, సబ్ కలెక్టర్ హరినారాయణన్‌లు రెండు నెలల క్రితం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఆప్షన్ ఇచ్చారు. పీఎస్ ప్రద్యుమ్న కర్ణాటక క్యాడర్‌కు చెందిన వారు. ఐఏఎస్‌గా తొలినాళ్లలో ఎక్కువ కాలం ఆయన ఆంధ్ర ప్రాంతంలోనే పనిచేశారు. ఈయనకు కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ మన జిల్లాలోనే. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పనిచేసేందుకు సుముఖత తెలిపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తమిళనాడుకు చెందిన 2010-11బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎం.హరినారాయణన్ బోధన్ సబ్‌కలెక్టర్‌గా ఉన్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ట్రైనీ సబ్‌కలెక్టర్‌గా వ్యవహరించిన ఆయన మొదటి పోస్టింగ్ బోధన్. ఆయన తన సొంతరాష్ట్రం తమిళనాడు సరిహద్దులో ఉండే ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పోస్టింగ్ కోసం ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం. జిల్లాకు గిరిజాశంకర్, విజయ్‌కుమార్‌ల పేర్లు కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. జేసీకే అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎంపీలు, మంత్రి, ఎమ్మెల్యేలను ఎవరికీ వారుగా సంప్రదించినట్లు చెప్తున్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న గిరిజా శంకర్ పేరు వినిపిస్తుండగా.. కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం చెబుతున్నట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రాంతానికే చెందిన మరో ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన జీహెచ్ఎంసీలో కమిషనర్‌గా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు జిల్లాకు వస్తారా.. లేక కొత్తవాళ్లు రావొచ్చా.. అన్న చర్చ సాగుతోంది.