చిత్తూరు, సాక్షి: ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండ్రోజులపాటు ఈ పర్యటన జరగనుంది. అయితే.. అంతకు ముందే అక్కడి అధికార యంత్రాంగాన్ని మార్చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రేపు (మంగళవారం) సీఎం చంద్రబాబు కుప్పం వెళ్లనున్నారు. ఆ పర్యటనకు ఒకరోజు ముందు.. నియోజకవర్గానికి సంబంధించి పోలీసు అధికారులు ఆఘమేఘాల మీద బదిలీ అయ్యారు. కుప్పం సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలను వీఆర్‌కు పంపిస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు.
కుప్పం అర్బన్, రూరల్ సీఐలు రమణ, ఇశ్వర్‌రెడ్డిలను అనంతపురం వీఆర్‌కు బదిలీ చేశారు. అలాగే కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మికాంత్, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్లబుదుగురు ఎస్ఐ సుమన్‌ను చిత్తూరు వీఆర్‌కు బదిలీ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన టైంలో జరిగిన ఈ ఆకస్మిక బదిలీలు పోలీస్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పోలీస్ శాఖనే కాదు.. మరికొన్ని విభాగాల్లోనూ ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, నేరుగా సీఎంవో నుంచే సంబంధిత శాఖలకు ఈ ఆదేశాలు అందుతున్నాయని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.
.. ఇలాంటి బదిలీలు ఊహించినవే. కానీ, ఇప్పటికే వైఎస్సార్‌సీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ బదిలీల ద్వారా రాబోయే రోజుల్లో మరింత పేట్రేగిపోయే అవకాశం లేకపోలేదని మేధావులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment