ఐటీ దాడులపై ముందే లీకేజీలు!  | Income Tax Department Sudden Transfer Of Officials | Sakshi
Sakshi News home page

ఐటీ దాడులపై ముందే లీకేజీలు! 

Sep 21 2022 1:59 AM | Updated on Sep 21 2022 8:10 AM

Income Tax Department Sudden Transfer Of Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయ పన్ను (ఐటీ) శాఖలో అధికారుల ఆకస్మిక బదిలీ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని కీలక వ్యక్తులు, ప్రముఖ సంస్థలకు ఐటీ దాడులు, సోదాలు, కేసుల వివరాలను లీక్‌ చేయడమే దీనికి కారణమని తీవ్రంగా చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఐటీ విభాగంలో పనిచేస్తున్న 85 మంది ఉన్నతాధికారులను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో ప్రిన్సిపల్‌ కమిషనర్, చీఫ్‌ కమిషనర్, అదనపు కమిషనర్లతోపాటు కొన్ని కీలక విభాగాలకు అధిపతులుగా ఉన్న వారిని సైతం వివిధ రాష్ట్రాలకు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కీలక విభాగాలకు బాధ్యత వహిస్తున్న కొందరు అధికారులు బదిలీ అయ్యారు. 

రహస్యాల చేరవేతే కారణమా? 
రాష్ట్రంలో ఇటీవల బెంగళూర్, ఢిల్లీ, ముంబైకి చెందిన ఐటీ బృందాలు వాసవి, సుమధుర, ఫీనిక్స్‌తోపాటు పలు సంస్థల్లో సోదాలు నిర్వహించాయి. ఇది రాజకీయంగా అనేక రకాల చర్చలకు దారితీసింది. అవి ప్రముఖ రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్న, బినామీ కంపెనీలనే ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి ఈ కంపెనీల్లో లావాదేవీల వ్యవహారం, పన్నులు చెల్లించకపోవడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనితో కేంద్రం రాష్ట్ర ఐటీ అధికారుల ద్వారా కాకుండా బెంగళూర్, ముంబై, ఢిల్లీలకు చెందిన బృందాల ద్వారా తనిఖీలు చేయించి, కేసులు నమోదు చేసినట్టు తెలిసింది.

ఈ క్రమంలో సదరు ఐటీ సోదాలకు సంబంధించిన రహస్య సమాచారం లీక్‌ అయిందని, అక్రమాలు జరుగుతున్నా రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదని కేంద్రానికి ఫిర్యాదులు అందినట్టు సమాచారం. దీనితో కేంద్రం అంతర్గతంగా విచారణ జరిపిందని.. సంబంధిత అధికారులను మూడు నెలల క్రితమే ఢిల్లీకి పిలిచి మందలించిందని ఆదాయ పన్ను శాఖలో చర్చ జరుగుతోంది. పది రోజుల క్రితం సంబంధిత అధికారులను మళ్లీ ఢిల్లీకి పిలిపించి.. వారి తీరుపై వచ్చిన నివేదికను చూపినట్టు సమాచారం. కీలకమైన విభాగంలో పనిచేస్తూ సోదాలు, ఇతర రహస్య సమాచారాన్ని రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులకు లీక్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బదిలీలు జరిగాయని ఐటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

రెండు నెలల ప్రయాస వృథా? 
రాష్ట్రంలో పలువురు ప్రముఖులు సాగిస్తున్న బినామీ దందాలను గుర్తించాలని తాము భావిస్తే.. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు వారికి లోపాయి కారీగా సహకరించడాన్ని కేంద్రం తీవ్రంగా భావించిందని ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న కొన్ని సంస్థల అక్రమాలపై రెండు నెలల పాటు నిఘా పెట్టి వివరాలు సేకరిస్తే.. సోదాలపై లీకేజీతో అంతా వృధా అయిందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవహారాలను తేల్చే పనిని ఇతర రాష్ట్రాల్లోని అధికారులకు అప్పగించి, మళ్లీ రంగంలోకి దిగాలని కేంద్రం భావించిందని పేర్కొంటున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా జరిగే బదిలీల్లో.. రాష్ట్ర అధికారులను ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు చెబుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement